Dinesh Karthik: టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ విన్నర్‌.. దినేశ్ కార్తిక్‌కు గోల్డెన్ ఛాన్స్: అంబటి రాయుడు

ఐపీఎల్-17 సీజన్‌లో అదరగొడుతున్న దినేశ్ కార్తిక్‌ (Dinesh Karthik)ను 2024 టీ20 ప్రపంచకప్‌ (T20 WorldCup 2024)లో చివరిసారిగా భారత్ తరఫున ఆడేందుకు ఎంపిక చేయాలని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు కోరాడు.

Updated : 16 Apr 2024 17:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్-17 సీజన్‌లో వెటరన్‌ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌ (Dinesh Karthik) అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 205.45 స్ట్రైక్‌రేట్‌, 75.33 సగటుతో 226 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలున్నాయి. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఈ వెటరన్ 23 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్‌ కార్తిక్ (83; 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) విశ్వరూపం చూపించాడు. అతడు వీరోచితంగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లోనే 108 మీటర్ల సిక్సర్‌ బాదాడు. ఈ సీజన్‌లో అత్యధిక దూరం వెళ్లిన సిక్స్‌ ఇదే. దీంతో 38 ఏళ్ల డీకేపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముంబయితో మ్యాచ్‌ సందర్భంగా కార్తిక్‌ ఆటను చూసి రోహిత్ శర్మ షాకయ్యాడు. ఇలాగే ఆడాలంటూ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించాడు. అంతేకాదు ‘‘నువ్వు టీ20 వరల్డ్ కప్‌ ఆడాలని డీకే భాయ్‌’’ అని రోహిత్ నవ్వుతూ అన్నాడు.  

బహుశా రోహిత్ మాటలను దినేశ్‌ కార్తిక్ సీరియస్‌గా తీసుకున్నాడేమో. తన బ్యాటింగ్‌ విన్యాసాలతో అలరిస్తూ టీ20 ప్రపంచకప్‌ రేసులోకి వచ్చేశాడు. ఈనేపథ్యంలోనే భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ (T20 WorldCup 2024)లో చివరిసారిగా భారత్ తరఫున ఆడేందుకు దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయాలని రాయుడు కోరాడు. ‘‘ఆయన (దినేశ్‌ కార్తిక్) ఎంత ప్రతిభావంతుడో చిన్నప్పటినుంచి చూస్తున్నాను.  అతను ఎప్పుడూ ఎంఎస్ ధోనీ నీడలో ఉన్నాడు. అతని ప్రతిభను ప్రదర్శించడానికి డీకేకు పెద్దగా అవకాశాలు రాలేదు. చివరిసారిగా భారత్‌ తరఫున మ్యాచ్‌ విన్నర్‌గా ప్రపంచకప్‌ని సాధించి తన కెరీర్‌ను ముగించేందుకు దినేశ్ కార్తిక్‌కు సువర్ణావకాశం ఉంది. కాబట్టి, అతనిని ప్రపంచకప్‌నకు ఎంపిక చేస్తారని భావిస్తున్నా’’ అని అంబటి రాయుడు స్టార్‌స్పోర్ట్స్‌తో అన్నాడు.

ఇర్ఫాన్ పఠాన్‌ ఏమన్నాడంటే?

అదే షోలో ఉన్న టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్ పఠాన్‌.. రాయుడు అభిప్రాయంతో ఏకీభవించలేదు. ‘‘దినేశ్‌ కార్తిక్ బాగా ఆడుతున్నాడు. మంచి లయ మీద కనిపిస్తున్నాడు. కానీ భారత క్రికెట్, ప్రపంచకప్ వేరే స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ కప్‌లలో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు బౌలింగ్ చేశారు. ఇంపాక్ట్ రూల్ కూడా లేదు. అక్కడ బ్యాటింగ్‌ చేయడానికి పరిమితమైన అవకాశాలుంటాయి. ఆ ఒత్తిడిలో భిన్నంగా ఉంటుంది’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. జూన్‌ 2 నుంచి వెస్టిండీస్‌, యూఎస్ఏ వేదికగా పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని