Dinesh karthik: ధోని ఉన్నా.. పోరాటమే శ్వాసగా

దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌. మధ్యలో ఎన్నో ఆటుపోట్లు. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా మహేంద్ర సింగ్‌ ధోని జట్టులో పాతుకుపోవడంతో అతను వెనుకాలే ఆగిపోయాడు.

Published : 24 May 2024 03:19 IST

దిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌. మధ్యలో ఎన్నో ఆటుపోట్లు. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా మహేంద్ర సింగ్‌ ధోని జట్టులో పాతుకుపోవడంతో అతను వెనుకాలే ఆగిపోయాడు. కానీ పోరాటాన్ని మాత్రం ఆపలేదు. టీమ్‌ఇండియాకు ఆడుతూనే ఉండాలనే ఆశ వదులుకోలేదు. లేటు వయసులోనూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన ఆ క్రికెటరే దినేశ్‌ కార్తీక్‌. బుధవారం ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ చేతిలో బెంగళూరు ఓటమితో ఈ సీనియర్‌ ఆటగాడి ఐపీఎల్‌ కెరీర్‌ ముగిసింది. తన్నుకువస్తున్న భావోద్వేగాలను నియంత్రించుకుంటూ.. కన్నీళ్లను దాచుకుంటూ.. సహచర ఆటగాళ్లు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ మధ్య అతను మైదానాన్ని వీడాడు. ఇప్పుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు అతను అధికారికంగా ప్రకటించకపోయినా.. లీగ్‌ డిజిటల్‌ ప్రసారదారు జియో సినిమా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సీజన్‌తో ఐపీఎల్‌ కెరీర్‌ ముగిస్తానని అతను గతంలో సంకేతాలిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా కార్తీక్‌ అధికారికంగా వీడ్కోలు పలకలేదు. కానీ 38 ఏళ్ల కార్తీక్‌ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం లేదు. దీంతో టీమ్‌ఇండియా తరపునా అతని ఇన్నింగ్స్‌ ముగిసిందనే చెప్పాలి. ఈ చెన్నై ఆటగాడు 19 ఏళ్ల వయసులోనే 2004లో ఇంగ్లాండ్‌తో వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడు నెలలకే టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. ధోని రాకతో కార్తీక్‌ ఓపెనర్‌గా మారి 2007లో ఇంగ్లాండ్‌తో టెస్టుల్లోనూ సత్తాచాటాడు. కానీ ఆ తర్వాత క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ధోని కెప్టెనయ్యాక జట్టులో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ స్థానానికి ఖాళీ లేకుండా పోయింది. 2010 నుంచి 2017 మధ్యలో ఐపీఎల్‌లో నిలకడగా రాణించిన కార్తీక్‌ జాతీయ జట్టులోకి మాత్రం వస్తూ వెళ్లాడు. 2018 నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో చివరి బంతికి సిక్సర్‌తో అతను జట్టును గెలిపించిన క్షణాలు ఎప్పటికీ ప్రత్యేకమే. 2022లో ఆర్సీబీ తరపున ఫినిషర్‌గా అదరగొట్టడంతో టీ20 ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ ఐపీఎల్‌లోనూ సత్తాచాటి టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యేలా కనిపించాడు. అయితే సెలక్టర్లు యువ ఆటగాళ్లకే పెద్దపీట వేయడంతో కార్తీక్‌కు నిరాశ తప్పలేదు. దీంతో మరోసారి భారత జట్టులోకి వచ్చే అవకాశం లేదని అతనికి కూడా అర్థమైపోయింది. టీమ్‌ఇండియా తరపున అతను 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించిన కార్తీక్‌.. 257 మ్యాచ్‌ల్లో 4842 పరుగులు చేశాడు. ఇప్పటికే వ్యాఖ్యాతగా మారిన అతను ఇకపైనా మాటలతోనే అలరించనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని