Dinesh Karthik: ఫినిషర్‌ మళ్లీ వచ్చాడు.. ఈసారి బెంగళూరును గెలిపించాడు..

ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్‌ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్‌ ఇచ్చి బెంగళూరును గెలిపించాడు. 

Updated : 26 Mar 2024 16:52 IST

దినేశ్‌ కార్తీక్‌ (Dinesh Karthik).. ఈ పేరు చెప్పగానే నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కెరీర్‌ మొత్తం అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయిన కార్తీక్‌.. బంగ్లాదేశ్‌తో ఆ ఒక్క ఫైనల్లో అభిమానులకు బాగా నచ్చేశాడు. ఈ మ్యాచ్‌లో కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా (Team India)ను గెలిపించి గుడ్‌ ఫినిషర్‌ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత కార్తీక్‌ మళ్లీ పెద్దగా ఆడింది లేదు. భారత్‌ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. జెర్సీ విప్పి కోటు వేసుకుని కామెంటరీ చెప్పాడు. దీంతో కార్తీక్‌ పని అయిపోయిందని అతడి రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది అనుకున్నారు. కానీ ఐపీఎల్-17లో బెంగళూరు తరఫున పంజాబ్‌ కింగ్స్‌పై అతడాడిన ఇన్నింగ్స్‌ మళ్లీ మునుపటి కార్తీక్‌ను గుర్తుకు తెచ్చింది. కార్తీక్‌లో ఫినిషర్‌ ఇంకా ఉన్నాడని నిరూపించాడు.

అప్పుడలా.. ఇప్పుడిలా

భారత్‌ తరఫున సుదీర్ఘ కెరీర్‌ కొనసాగించిన కార్తీక్‌.. కెరీర్‌ చరమాంకంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరవడం విశేషమే. ఎందుకంటే వయసు మీద పడిన నేపథ్యంలో ఒకప్పటిలా సౌకర్యంగా ఆడడం డీకేకు కష్టమే. అయినా కూడా 2018లో నిదహాస్‌ ట్రోఫీ తుది పోరులో బంగ్లాపై 8 బంతుల్లోనే 29 పరుగులతో అజేయంగా నిలిచి ఔరా అనిపించాడు. చాన్నాళ్లు అభిమనుల మైండ్‌ నుంచి పోలేదు ఆ ఇన్నింగ్స్‌. ఆ తర్వాత కొన్నాళ్లే జాతీయ జట్టులో కొనసాగిన అతడు ఎవరూ ఊహించనట్లుగా మైక్‌ పట్టుకుని కామెంటరీ మొదలుపెట్టాడు. దీంతో అతడి కెరీర్‌ ముగిసినట్లే అనుకున్నారు. ఐపీఎల్‌ మళ్లీ అతడి ఆశలను నిలబెట్టింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున బరిలో దిగుతూ తానింకా ఉన్నానని చాటుకున్నాడు. ఈ ఏడాది కీపర్‌గా జట్టులో చోటు దక్కకపోయినా అచ్చమైన బ్యాటర్‌గా రెండో మ్యాచ్‌లోనే తన విలువ చాటుకున్నాడు. పంజాబ్‌తో పోరులో ఆశలు లేని స్థితి నుంచి ఆర్సీబీని గెలిపించాడు. ఒకప్పటి శైలిలో దూకుడైన షాట్లతో పంజాబ్‌ బౌలర్లను కంగుతినిపించాడు. 10 బంతుల్లోనే 28 పరుగులు సాధించి బెంగళూరుకు తొలి విజయాన్ని అందించాడు. ఏబీ డివిలియర్స్‌ మాదిరి క్రీజులో గొప్పగా కదులుతూ వికెట్ల వెనుక కొట్టిన షాట్లు అద్భుతం. నిదహాస్‌ ట్రోఫీ మాదిరిగానే అప్పుడూ అతడి స్కోర్లు కూడా దాదాపు సమానమే. దీంతో అభిమానులు ఆ కార్తీక్‌ మళ్లీ వచ్చాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

ఇలాగే ఆడితే

ఈసాలా కప్‌ నమదే.. అని మరోసారి బరిలో దిగిన బెంగళూరుకు ఇప్పుడు కార్తీక్‌ లాంటి చమక్కులే కావాలి. గతంలో ఫినిషింగ్‌ లోపించి చాలా మ్యాచ్‌ల్లో చేజేతులా ఓడిన ఆర్సీబీ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలంటే కార్తీక్‌ స్ఫూర్తిని మిగిలిన వాళ్లు అందిపుచ్చుకోవాలి. నిజానికి ఈసారి కార్తీక్‌పై ఎక్కువ ఒత్తిడి ఉంది. ఎందుకంటే అతడు స్పెషలిస్టు బ్యాటర్‌గానే బరిలో ఉన్నాడు. అనుజ్‌ రావత్‌ వికెట్ల వెనుక ఉండడంతో కార్తీక్‌కు ఇలా ఛాన్స్‌ వచ్చింది. అయినా కూడా ఆ అవకాశాన్ని డీకే గొప్పగా ఉపయోగించుకున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో అజేయంగా 38 పరుగులు చేసి జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కార్తీక్‌.. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై అదరగొట్టి మున్ముందు మ్యాచ్‌ల్లోనూ తనపై ఆధారపడొచ్చన సందేశాన్ని పంపాడు. పంజాబ్‌పై ఆరంభంలో కార్తీక్‌ ఆట చూస్తే అతడి లయ దెబ్బ తిన్నట్లు స్పష్టంగా కనిపించింది. కానీ కొన్ని బంతుల వ్యవధిలోనే మునుపటి కార్తీక్‌ను బయటకు తెచ్చాడు. రాబోయే మ్యాచ్‌ల్లో డీకే ఇంకెలా ఆడతాడో చూడాలి.

        - ఈనాడు క్రీడా విభాగం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని