Dinesh Karthik: మూడేళ్లు ఆడగలిగే ఫిట్‌నెస్‌ ఉన్నా.. ఐపీఎల్‌కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!

టీమ్‌ఇండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దానికి కారణమేంటనేది తాజాగా వెల్లడించాడు. 

Updated : 01 Jun 2024 13:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌లో (IPL 2024) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన తర్వాత దినేశ్‌ కార్తిక్ (Dinesh Karthik) మెగా లీగ్‌కు వీడ్కోలు పలికేశాడు. ఇక నుంచి కామెంటేటర్‌గానే క్రికెట్ అభిమానులకు కనిపిస్తాడు. అతడి ఫిట్‌నెస్‌ను గమనిస్తే కనీసం మరో మూడేళ్లయినా ఆడగలిగే సత్తా ఉంది. అయినా, రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రిటైర్‌మెంట్‌ తీసుకోవడానికిగల కారణాలను వెల్లడించాడు. 

‘‘శారీరకంగా మరో మూడేళ్లు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. ఇప్పుడీ ఇంపాక్ట్‌ రూల్‌ కొనసాగితే.. తప్పకుండా ఆడేందుకు ఛాన్స్‌ ఉంది. అప్పుడు మరో సీజన్‌ కొనసాగేవాడినే. నా జీవితంలో ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. గత మూడు దశాబ్దాల్లో గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమైన సందర్భాలు దాదాపు లేవు. నా ఫిట్‌నెస్‌ విషయంలో ఎప్పుడూ ఆందోళన పడలేదు. అయితే, మానసికంగా ప్రభావం చూపించాయి. అందుకే మెగా లీగుల్లో మ్యాచ్‌లు ఆడగలనా? లేదా? అనే సందిగ్ధత మొదలైంది. 

నేనెప్పుడు బరిలోకి దిగినా వందశాతం నిబద్ధతతో ఆడేందుకు ప్రయత్నిస్తా. కనీసం కొన్ని మ్యాచులైనా ఆడాలనే సూచనలు వచ్చాయి. మానసికంగా సంసిద్ధంగా లేకపోతే మైదానంలోకి దిగినా సరైన ప్రదర్శన చేయలేం. బయట నుంచి చెప్పేవారికి ఇవేవీ తెలియకపోవచ్చు. కానీ, క్రికెటర్లుగా పూర్తి అవగాహన ఉంటుంది. సరిగ్గా ఆడకపోతున్నా కంటిన్యూ కావడం వల్ల ఏదో తప్పు చేస్తున్నామనే భావన వెంటాడుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని భావించా. భవిష్యత్తులో నేను భారత జట్టులోకి రావడం దాదాపు సాధ్యం కాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రిటైర్‌మెంట్‌కు ఇదే సరైన సమయమని నిర్ణయం తీసుకున్నా’’ అని దినేశ్ కార్తిక్‌ వెల్లడించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్యానెల్ కామెంటేటర్ల జాబితాలో అతడికి చోటు దక్కడం విశేషం. దీంతో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచుల సందర్భంగా అతడి కామెంట్రీని మనం వినే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని