Dinesh Karthik: వారెవ్వా దినేశ్‌ కార్తిక్‌.. ఆ షాట్లు ‘న భూతో న భవిష్యతి’!

వయసు పెరిగినా.. తనలోని బ్యాటింగ్‌ దూకుడు తగ్గలేదని నిరూపిస్తున్నాడు దినేశ్ కార్తిక్‌. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లతో బెంగళూరు జట్టుకు కీలకంగా మారాడు.

Updated : 12 Apr 2024 12:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ముంబయి చేతిలో బెంగళూరుకు (Mumbai Vs Bengaluru) ఓటమి తప్పలేదు. కానీ, దినేశ్ కార్తిక్‌ (Dinesh Karthik) ఆటను చూస్తే మాత్రం ప్రశంసించకుండా ఉండలేం. ఈ వెటరన్‌ ప్లేయర్‌ కొలతలేసి మరీ షాట్లు కొట్టాడా? అన్నట్లుగా ఆడాడు. ఫీల్డర్ల మధ్యలో నుంచి బంతిని పంపించడం ‘న భూతో’ అన్నట్లుగా ఉంది. బెంగళూరు 196 పరుగుల భారీ స్కోరు చేయడానికి ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్‌, రజత్‌ పటీదార్‌ తర్వాత దినేశ్ కార్తిక్‌ ప్రధాన కారణం. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఐదు వికెట్లు తీసిన బుమ్రానూ వదల్లేదు. అలాగే బెంగళూరు ఇన్నింగ్స్‌లోని 16వ ఓవర్‌ను ముంబయి బౌలర్ ఆకాశ్‌ మధ్వాల్‌కు డీకే క్రికెటింగ్ షాట్లను చూపించాడు. ఈ ఓవర్‌లో నాలుగు ఫోర్లు సహా 19 పరుగులు వచ్చాయి.

  • ఆఫ్ స్టంప్ ఆవలగా వేసిన ఆ ఓవర్‌ రెండో బంతిని ఏబీ డివిలియర్స్‌ స్టైల్‌లో దినేశ్‌ కార్తిక్‌ థర్డ్‌మ్యాన్‌ దిశగా అలవోకగా బౌండరీకి పంపించాడు. 
  • నాలుగో బంతికి కొట్టిన షాట్‌ అద్భుతం. స్కూప్‌తో కీపర్, షార్ట్‌ థర్డ్‌ ఫీల్డర్‌ మీదుగా వెనక్కి బౌండరీ లైన్‌కు వెళ్లింది. ఆపేందుకు ఏమాత్రం అవకాశం దక్కలేదు.
  • వికెట్‌ కీపర్‌ వెనుకనే పరుగులు చేయాలని ఎవరైనా చెప్పారా? అన్నట్లుగా అతడి ఆట సాగడం విశేషం. 16వ ఓవర్‌ ఐదో బంతిని వికెట్ కీపర్‌, షార్ట్‌ థర్డ్‌ ఫీల్డర్ డైవ్ చేసినా దొరకలేదు. వారిద్దరి మధ్యలో నుంచి బౌండరీకి దూసుకుపోయింది. 
  • నాలుగో బౌండరీ కూడా ఒకే ప్లేస్‌మెంట్‌లో రావడం అరుదుగా జరుగుతుంటుంది. చివరి బంతిని కూడా వికెట్ల వెనుకగా బౌండరీ లైన్‌ దాటించాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించగా.. బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిన బాల్ వెనక్కి వెళ్లిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని