Dinesh Karthik: ఫినిషర్‌ డీకే వీడ్కోలు.. కెరీర్‌లో అదొక్కటే లోటు!

భారత క్రికెట్‌లో చాలామంది క్రికెటర్లు ఉన్నారు. కానీ, ఎవరి నోటనైనా ఒక పేరు వచ్చిందంటే వెంటనే గుర్తుకురావాలి. అలాంటి జాబితాలోని క్రికెటర్ దినేశ్‌ కార్తిక్‌.

Published : 24 May 2024 00:14 IST

నిదహాస్‌ ట్రోఫీ 2018.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik). ఫైనల్‌ పోరులో బంగ్లాదేశ్‌పై కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు కప్‌ అందించాడు. అప్పటినుంచే ‘ఫినిషర్‌’గా అవతారం ఎత్తిన డీకే డెత్‌ ఓవర్లలో శివాలెత్తిపోయేవాడు. ఇప్పటికే టీమ్‌ఇండియాకు ఎంపిక కాని అతడు.. ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతూ ‘ఫినిషర్‌’ పాత్రకు గుడ్‌బై చెప్పేశాడు.  

ఈ సీజన్‌లోనూ..

ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌తో దినేశ్‌ కార్తిక్‌ కూడా మెగా టోర్నీకి ముగింపు పలికేశాడు. ఈ సీజన్‌లో డీకే 15 మ్యాచుల్లో 326 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా తరఫున ఈసారి ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకోవడంలో కుర్రాళ్లకు బలమైన పోటీదారుగా నిలిచిన డీకే.. వయసురీత్యా అవకాశం మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడు అదే కారణంతో ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. 38 ఏళ్ల కార్తిక్‌ ఇప్పటివరకు భారత్‌ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. 

ధోనీ ప్రాభవం ముందు.. 

అంతర్జాతీయ క్రికెట్‌లోకి డీకే అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు అయింది. అయినా, తక్కువ మ్యాచుల్లోనే చోటు దక్కడానికి కారణం ఎంఎస్ ధోనీ అని చెప్పొచ్చు. వయసురీత్యా ధోనీ కంటే డీకే నాలుగేళ్లు చిన్న. కానీ టెస్టులు, వన్డేల్లో ఎంఎస్‌డీ కంటే దినేశ్‌ కార్తిక్‌ ముందే జాతీయజట్టులోకి వచ్చాడు. కానీ, టీ20ల్లో ఇద్దరూ ఒకేసారి అరంగేట్రం చేశారు. ధోనీ బ్యాటింగ్‌, కీపింగ్‌ విభాగాల్లో అద్భుత నైపుణ్యం ప్రదర్శించడంతోపాటు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంతో జట్టులో ‘రెండో’ వికెట్‌ కీపర్‌ అవసరం లేకుండా పోయింది.

ధోనీ గైర్హాజరీలో డీకేకు అవకాశాలు దక్కేవి. ధోనీ కెరీర్‌, ఫేమ్‌ పీక్‌ స్టేజ్‌కు వెళ్లడంతో డీకే ఎక్కువగా ఐపీఎల్‌లోనే ఆడాల్సివచ్చింది. జాతీయ జట్టు తరఫున వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడంలో కార్తిక్ సఫలీకృతం కాలేదు. కొన్నిసార్లు మాత్రమే జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌లు ఆడాడు. టీ20 ప్రపంచకప్‌ 2022లో కీలకంగా మారతాడని భావించినా.. ఘోరంగా విఫలమై అభిమానులను నిరాశపరిచాడు. 

అదొక్కటే బాధ.. 

ఐపీఎల్‌లో ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన దినేశ్‌ కార్తిక్‌ 257 మ్యాచులు ఆడి 4,842 పరుగులు సాధించాడు. పంజాబ్, ముంబయి, ఆర్సీబీ, గుజరాత్ లయన్స్, కోల్‌కతా, దిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తన సొంత రాష్ట్రానికి చెందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున మ్యాచ్‌ ఆడలేకపోవడం బాధపెట్టే అంశమని గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించాడు. సీఎస్కే యాజమాన్యం వేలంలో తీసుకోవాలని చూసినా.. అప్పుడు అందుబాటులో లేకుండా పోయినట్లు గుర్తు చేసుకున్నాడు. ప్రతీ సీజన్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ వచ్చిన డీకే ఈసారి మాత్రం ప్రదర్శనను పతాకస్థాయికి తీసుకెళ్లాడు. తన జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలం కావడంతో నిరాశగా వీడ్కోలు పలికేశాడు.

మైదానంలో లేకపోయినా.. 

దినేశ్‌ కార్తిక్‌ను ఆటగాడిగా కాకుండా వ్యాఖ్యాతగా ఇప్పటికే అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్‌ మినహా.. భారత జట్టు ఆడే మ్యాచులకు కామెంట్రీ చేస్తున్నాడు. ఇకనుంచి మెగా లీగ్‌లోనూ అతడి మాటను వినే అవకాశం ఉంది. అయితే, దీనికోసం వచ్చే సీజన్‌ వరకా? లేకపోతే క్వాలిఫయర్‌ 2 నుంచే అతడు కామెంట్రీ బాధ్యతలు తీసుకుంటాడా? అనేది తెలియడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు