Team India: ఇప్పుడు కెప్టెన్‌ ఎవరో తెలుసు.. ఐపీఎల్‌ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు

రెండోసారి టైటిల్‌ను నెగ్గాలనే లక్ష్యంతో టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్‌ బరిలోకి దిగింది. జూన్ 5న తొలి మ్యాచ్‌లో ఆడనుంది. 

Published : 02 Jun 2024 10:10 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) సంగ్రామం మొదలైంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో జూన్ 5న తలపడనుంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (Team India) ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌లో చోటు చేసుకున్న పరిస్థితులు ఇక్కడ కనిపించలేదని మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మ్యాథ్యూ హేడెన్ వెల్లడించారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇలాంటి విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటాడని.. జాతీయ జట్టు కోసం ఆడేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోరాడేలా ఉద్భోద చేసి ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు. అసలు ఐపీఎల్‌ ఊసే వారి మధ్య చర్చకు వచ్చి ఉండదని స్పష్టం చేశారు.

వరల్డ్‌ కప్‌పైనే దృష్టంతా..: ఇర్ఫాన్

‘‘నాకు తెలిసి ఒక్కసారి కూడా ఐపీఎల్‌లో ఏం జరిగిందనే చర్చ ఆటగాళ్ల మధ్య వచ్చి ఉండదు. ఒక్కరు కూడా మాట్లాడి ఉండరు. కోచ్ రాహుల్‌ ద్రవిడ్ ఫోకస్ అంతా ప్రపంచ కప్‌పైనే. అది హార్దిక్‌ అయినా ఇతర ఆటగాడు ఎవరైనా సరే పొట్టికప్ గెలవడంపైనే ఉండాలి. మా దగ్గర సెలబ్రిటీ కల్చర్‌ బాగా పెరిగిపోయింది. కొన్నిసార్లు ఇదే చేటు చేస్తుందేమోనని ఆందోళన ఉంది. ఆస్ట్రేలియన్లతో పోలిస్తే మా భావోద్వేగాలు, నిబద్ధత, మైండ్‌సెట్‌ అంతా విభిన్నం’’ అని పఠాన్ వ్యాఖ్యానించాడు. 

ఇక్కడ లీడర్‌ అతడే: హేడెన్

‘‘వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టు ఇక్కడికి వచ్చింది. టీమ్‌కు నాయకుడు ఎవరు అనేది అందరికీ తెలుసు. ఇక దానిపై మాట్లాడాల్సిన అవసరమే లేదు. కెప్టెన్ రోహిత్ నాయకత్వంలో భారత్‌ బరిలోకి దిగింది. మరొకరు (పాండ్య) వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. వీరిద్దరూ జట్టును ముందుండి నడిపించాలి. ఐపీఎల్ విషయం గురించి చర్చ అనేది జరగదని ఇర్ఫాన్‌ చెప్పిన మాటలు నచ్చాయి. అసలు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు’’ అని హేడెన్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని