IND vs AUS: భారత్‌-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్‌’ కష్టాలు..!

IND vs AUS: భారత్‌-ఆసీస్‌ నాలుగో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న రాయ్‌పుర్‌ మైదానానికి కరెంట్‌ సమస్యలు నెలకొన్నాయి. ఇక్కడ కొన్నేళ్లుగా విద్యుత్‌ సరఫరా లేదట. దీంతో మ్యాచ్‌ నిర్వహణకు జనరేటర్లే ఆధారంగా మారాయి.

Published : 01 Dec 2023 14:00 IST

రాయ్‌పుర్‌: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ (IND vs AUS Forth T20 Match) శుక్రవారం జరగనుంది. రాయ్‌పుర్‌ (Raipur Stadium)లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌ వేళ మైదానంలో కొన్ని చోట్ల విద్యుత్‌ వెలుగులు ఉండకపోవచ్చు. ఈ స్టేడియంను కొంతకాలం నుంచి కరెంట్‌ (Electricity) కష్టాలు వెంటాడుతుండటమే కారణం. గత కొన్నేళ్లుగా విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడంతో మైదానానికి కరెంట్‌ సరఫరా లేదు. దీంతో నేటి మ్యాచ్‌ను జనరేటర్లతో నడిపించనున్నారట..!

ఈ స్టేడియంను నిర్మించిన తర్వాత.. నిర్వహణను ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)కు అప్పగించారు. మిగతా ఖర్చులను క్రీడా శాఖ భరిస్తోంది. అయితే, 2009 నుంచి ఈ స్టేడియం కరెంట్‌ బిల్లులను చెల్లించట్లేదు. ఆ బకాయిలు పెరిగి రూ.3.16కోట్లకు చేరాయి. బకాయిల గురించి పీడబ్ల్యూడీ, క్రీడా శాఖకు పలు సార్లు నోటీసులు పంపినా.. ఎటువంటి స్పందనా రాలేదని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు.

ఆ విషయంలో నేనెప్పటికీ విరాట్‌ కోహ్లీ కాలేను: అశ్విన్‌

దీంతో చేసేదేం లేక, 2018లో ఈ మైదానానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో ఇక్కడ హాఫ్‌-మారథాన్‌ను నిర్వహించారు. మైదానంలో కరెంట్‌ సరఫరా లేకపోవడంతో ఇందులో పాల్గొన్న అథ్లెట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అభ్యర్థన మేరకు స్టేడియంలో తాత్కాలిక కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. అయితే, ఆ కరెంట్‌ కేవలం స్టేడియంలోని గదులు, వీక్షకుల గ్యాలరీ, బాక్సుల్లో లైట్లకు మాత్రమే సరిపోతుంది. దీంతో మైదానంలో ఫ్లడ్‌ లైట్ల కోసం ప్రత్యేకంగా జనరేటర్లు ఉపయోగిస్తున్నారు.

2018 తర్వాత నుంచి ఇక్కడ మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. అన్ని సార్లు తాత్కాలిక కనెక్షన్‌, జనరేటర్లతోనే నడిపించారు. తాజా మ్యాచ్‌కు తాత్కాలిక కనెక్షన్‌ సామర్థ్యాన్ని పెంచాలని క్రికెట్ అసోసియేషన్‌ సంబంధిత అధికారులను కోరింది. అందుకు అనుమతులు లభించినా.. ఎలాంటి పనులు చేపట్టలేదు. భారత్‌, ఆసీస్‌ మ్యాచ్‌కూ జనరేటర్లతోనే ఫ్లడ్‌లైట్లను వెలిగించనున్నట్లు అసోసియేషన్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని