Ravichandran Ashwin: నేనెప్పటికీ విరాట్‌ కోహ్లీ కాలేను: అశ్విన్‌

Ravichandran Ashwin: తాను ఎంత కష్టపడినా ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్ కోహ్లీ (Virat ) స్థాయిని అందుకోలేనని అంటున్నాడు సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌. ఓ క్రీడాఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన కెరీర్‌ గురించిన విషయాలను పంచుకున్నాడు.

Updated : 01 Dec 2023 14:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్పిన్‌ మంత్రంతో బ్యాటర్లను బోల్తా కొట్టించే టీమ్‌ఇండియా (Team India) సీనియర్‌ బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin).. మైదానంలో చురుగ్గా కదల్లేకపోతాడనే అపవాదు ఉంది. దాన్ని పోగొట్టుకునేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇందుకోసం కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చిందని అశ్విన్‌ అంటున్నాడు. అయితే, రెట్టింపు శ్రమ పెట్టినా ఫిట్‌నెస్‌ విషయంలో తాను ఎప్పటికీ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) కాలేనని అన్నాడు.

ఓ క్రీడాఛానల్‌లో భారత మాజీ క్రికెటర్‌ డబ్ల్యూ.వి. రామన్‌తో అశ్విన్‌ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌ గురించి ఈ స్పిన్నర్‌ అనేక విషయాలు పంచుకున్నాడు. ‘‘నా జీవితంలో చాలా సులభంగా ఎన్నో త్యాగాలు చేశా. ఫిట్‌నెస్‌ కోసం చాలా కష్టపడ్డా. ఎందుకంటే నేను ఆటను ఎంతగానో ప్రేమిస్తా. మీరు దేన్నైనా అమితంగా ఇష్టపడితే.. దానితో వచ్చే సవాళ్లను కూడా ఆనందంగా స్వీకరిస్తారు. అందుకే, ఫిట్‌గా ఉండటం కోసం నాకు ఇష్టమైన ఆహారాన్ని, నా లైఫ్‌స్టైల్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది’’ అని అశ్విన్‌ చెప్పాడు.

‘‘అయితే, ఇక్కడ వాస్తవమేంటంటే.. ఫిట్‌నెస్‌ కోసం నేను రెట్టింపు కష్టపడినా ఎప్పటికీ విరాట్‌ కోహ్లీలా కాలేను. ఈ విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే అది అతడి ప్రయాణం.. ఇది నా జీవిత ప్రయాణం. ఇక, నాలో అథ్లెటిక్‌ లక్షణాలు లేవనే ట్యాగ్‌ నాకు ఎప్పటి నుంచో ఉంది. దాన్ని చూసి నేను ఆగిపోలేదు. కష్టపడుతున్నా. పరిస్థితులకు తగినట్లుగా మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు నా నైపుణ్యాలన్నీ ప్రదర్శిస్తా. ఇది నాకు ఇష్టమైన ప్రయాణం’’ అని అశ్విన్‌ తెలిపాడు.

దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..

ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అశ్విన్‌ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడి ఒక వికెట్‌ తీసిన విషయం తెలిసిందే. అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా టోర్నీకి చివరి నిమిషంలో అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే, జట్టు కూర్పు కోసం ఆ తర్వాత అతడిని బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్లలో అశ్విన్‌ ఒకడు. టెస్టుల్లో ఇప్పటివరకు అతడు 489 వికెట్లు తీశాడు. తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఈ స్పిన్నర్‌ను ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అశ్విన్‌ అందుకునే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని