IND vs PAK: ‘బెస్ట్‌ ఫీల్డర్‌’ మెడల్‌ ప్రదానం.. భావోద్వేగానికి గురైన రవిశాస్త్రి

పాకిస్థాన్‌ను కట్టడి చేయడంలో బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌ కూడా కీలక పాత్ర పోషించింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి బీసీసీఐ ‘బెస్ట్‌ ఫీల్డర్’ మెడల్‌ను అందజేసింది.

Updated : 10 Jun 2024 14:14 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. స్వల్ప లక్ష్యం ఉంచినా పాక్‌ను కట్టడి చేసి టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్‌ ప్రమాణాలను పాటించిన ఆటగాడికి భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను అందించాడు. దీన్ని ఏ ప్లేయర్‌ సొంతం చేసుకున్నాడనేది ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ వెల్లడించాడు. పంత్, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఈ మెడల్‌ కోసం పోటీ పడ్డారని తెలిపాడు. అయితే, బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రిషభ్‌ పంత్‌.. ఫీల్డింగ్‌లోనూ మూడు క్యాచ్‌లు పట్టాడు.  కీపర్‌గా స్టంప్స్‌ వెనుక చురుగ్గా ఉన్నాడు. దీంతో పంత్‌కే ఈ మెడల్‌ వరించింది. రిషభ్‌కు మెడల్‌ను అందజేస్తూ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘మాట్లాడేముందు పంత్‌ను హగ్‌ చేసుకుంటా. అతడిని వరల్డ్‌ కప్‌లో చూడటం చాలా బాగుంది. అద్భుతంగా ఆడుతున్నాడు. పంత్ రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే కన్నీళ్లు వచ్చేశాయి. ఆ పరిస్థితుల్లో అతడిని ఆసుపత్రిలో చూస్తాననుకోలేదు. కోలుకుని వచ్చి.. ఇలాంటి భారీ మ్యాచుల్లో సత్తా చాటడం ప్రశంసనీయం. అందుకే హృదయపూర్వక అభినందనలు చెబుతున్నా. పంత్ బ్యాటింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. కానీ, వికెట్‌ కీపింగ్‌ చేయడం చాలా కష్టం. శస్త్రచికిత్స తర్వాత మైదానంలోకి దిగి చురుగ్గా కదలడం అద్భుతమే. అంతర్జాతీయంగా కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచావు. మృత్యువు అంచుల్లోకి వెళ్లి వచ్చిన పంత్.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మున్ముందు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. 

ఖండం మాత్రమే మారింది: సచిన్

పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంపై క్రికెట్ దిగ్గజం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. కుటుంబంతో కలిసి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. ‘‘భారత్ - పాకిస్థాన్‌.. కొత్త ఖండం.. అదే ఫలితం. టీ20 బ్యాటర్ల ఫార్మాట్‌. కానీ, న్యూయార్క్‌లో బౌలర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ గెలవడం అభినందనీయం. అమెరికాలో ఇలాంటి మ్యాచ్‌లు జరగడం అద్భుతం’’ అని సచిన్‌ పోస్టు చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని