IND vs ENG: మా జట్టులో అతడే అశ్విన్‌.. తొలి సిరీస్‌ అనే ఒత్తిడే లేదు: ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్

బజ్‌బాల్ క్రికెట్‌తో ప్రత్యర్థులను ఆటాడుకుందామని భావించిన ఇంగ్లాండ్‌కు భారత పర్యటనలో (IND vs ENG) చుక్కెదురైంది. కానీ, ఓ బౌలర్‌ను అరంగేట్రం చేయించడం మాత్రం తమ జట్టుకు కలిసొస్తుందని మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.

Published : 02 Mar 2024 00:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - ఇంగ్లాండ్‌ జట్ల (IND vs ENG) మధ్య నాలుగు టెస్టులు ముగిశాయి. ఇప్పటికే భారత్ 3-1 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌ ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షోయబ్‌ బషీర్ కేవలం రెండు మ్యాచుల్లోనే 12 వికెట్లు తీసి అబ్బురపరిచాడు. తొలిసారి భారీ జట్టుపై ఆడుతున్నామనే ఒత్తిడే అతడిలో కనిపించలేదు. ఈ క్రమంలో బషీర్‌ను ఉద్దేశించి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తదుపరి రవిచంద్రన్ అశ్విన్‌గా బషీర్‌ను అభివర్ణించాడు. 

‘‘ఇంగ్లాండ్‌ జట్టు ఇటీవల వరుసగా ఓటములను చవిచూసింది. కానీ, ఆటగాళ్ల ప్రదర్శనపరంగా అద్భుతంగానే ఉంది. ఈ మెగా సిరీస్‌లో ఇంగ్లాండ్‌ తరఫున ప్రపంచస్థాయి స్పిన్నర్‌ వెలుగులోకి వచ్చాడు. అతడే షోయబ్ బషీర్. అందుకే, మనం సంబరాలు చేసుకోవాలని చెబుతున్నా. కేవలం తన రెండో మ్యాచ్‌లోనే 8 వికెట్లు తీశాడు. అతడు రవిచంద్రన్ అశ్విన్‌ కొత్త వెర్షన్. మా సెలక్టర్లు బషీర్‌ను తీసుకురావడం అభినందనీయం. ఇంగ్లిష్‌ క్రికెట్‌కు తప్పకుండా మంచి జరుగుతుంది. 

ధర్మశాలలో మా జట్టు విజయం సాధిస్తుందని భావిస్తున్నా. ఐదు టెస్టుల సిరీస్‌లో మెరుగైన జట్టుతోనే బరిలోకి దిగాం. యాషెస్‌ సిరీస్‌తో పోలిస్తే ఇక్కడే అత్యుత్తమ టీమ్‌ ఆడుతోంది. ఒక్కో సెషన్‌ ఆడుతూ వెళ్తే ఫలితం అనుకూలంగా రాబట్టే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ను మేం గెలుచుకోలేం.. కనీసం చివరి మ్యాచ్‌నైనా విజయంతో ముగిస్తాం’’ అని మైకెల్ వాన్‌ వెల్లడించాడు.

రజత్‌కు మద్దతు ఇవ్వాలి: ఏబీడీ

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన భారత ఆటగాడు రజత్‌ పటీదార్‌ ప్రదర్శనలో మాత్రం వెనకబడ్డాడు. అయినా, అతడిని ఐదో టెస్టు కోసం జట్టులోనే కొనసాగిస్తున్నారు. ఇలా చేయడానికి కారణాలను దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తెలిపాడు. ‘‘రజత్‌ పటీదార్‌కు జీవితాంతం గుర్తుండిపోయే సిరీస్‌ ఇది కాదు. అయితే, జట్టుగా భారత్ విజయాలను నమోదు చేసింది. అయితే, రజత్‌ యాటిట్యూడ్‌, డ్రెస్సింగ్‌ రూమ్‌లో అతడి ప్రవర్తన నచ్చడంతో మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచే అవకాశం ఉంది. అతడు ఎక్కువగా పరుగులు చేయకపోయినా జట్టుతోపాటు కొనసాగే ఆస్కారముంది. అతడికి అవకాశాలు ఇస్తూనే ఉండాలి. లేకపోతే ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు’’ అని ఏబీడీ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని