Esha Singh: ఈ టీనేజర్‌.. దూసుకెళ్లే ఓ బుల్లెట్‌.. షూటింగ్‌ సంచలనం ఇషా సింగ్‌

పద్దెనిమిది ఏళ్లకే ఆసియా గేమ్స్‌కు దూసుకెళ్లిన ఇషా సింగ్‌ (Esha Singh).. హైదరాబాదీ షూటర్ కావడం విశేషం. సరదాగా ప్రారంభించిన క్రీడలోనే ఛాంపియన్‌గా ఆసియా క్రీడల్లో పాల్గొనే స్థాయికి చేరుకొంది.

Published : 25 Aug 2023 12:07 IST

ఆగిపోవడం.. అలసిపోవడం.. ఆ అమ్మాయికి తెలీదు. నిరాశతో కుంగిపోవడం.. ఓటమి బాధలో మునిగిపోవడం ఆమెకు అలవాటు లేదు. తుపాకీ చేతపట్టగానే.. ఆమెకు కనిపించేది లక్ష్యమే. వినిపించేది తాను పేల్చే తూటాల శబ్దమే. గమ్యాన్ని చేరే ఆ గురితో కరతాళ ధ్వనులు.. చివరగా మెడలో వాలే పతకాలు. ఇలా పిస్టల్‌తో టీనేజీలోనే సంచలనాలు సృష్టించడం ఆమెకు తుపాకీతో పెట్టిన విద్య. ఆమెనే.. ఇషా సింగ్‌ (Esha Singh). ఇటీవల షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మిక్స్‌డ్, టీమ్‌ స్వర్ణాలతో చరిత్ర సృష్టించిన ఈ హైదరాబాదీ 18 ఏళ్ల టీనేజర్‌ ఇక ఒలింపిక్స్‌ పతకంపై కన్నేసింది. ముందుగా ఈ ఏడాది ఆసియా క్రీడల్లో సత్తాచాటడమే తన లక్ష్యమంటోంది. 

సరదాగా మొదలై..

షూటింగ్‌లో ఇషా ప్రయాణం అనుకోకుండానే మొదలైంది. చిన్నతనంలో ఆమె గో కార్టింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కేటింగ్‌లోనూ ఓ చేయి వేసింది. ఒకసారి గచ్చిబౌలి స్టేడియం వెళ్లినప్పుడు అక్కడి షూటింగ్‌ రేంజ్‌లో తుపాకీ పేల్చిన చప్పుడు ఆమెను ఆకర్షించింది. అప్పుడే తుపాకీతో ప్రేమలో పడింది. ఒకసారి వాళ్ల నాన్న స్నేహితుడు ఒకాయన తన చేతికి తుపాకీ ఇచ్చి.. లక్ష్యానికి గురిపెట్టమని చెప్పడంతో ఇషా షూటింగ్‌ కెరీర్‌కు అడుగు పడింది. తొమ్మిదేళ్ల వయసులో శిక్షణ మొదలెట్టిన ఆమె.. ఒలింపిక్‌ కాంస్య విజేత గగన్‌ నారంగ్‌ దగ్గర మెళకువలు ఒంటబట్టించుకుంది. 2018లో 13 ఏళ్లకే 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ జాతీయ ఛాంపియన్‌గా నిలిచి.. ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్సు షూటర్‌గా రికార్డు నమోదు చేసింది. యూత్, జూనియర్‌ విభాగాల్లోనూ స్వర్ణాలు సాధించింది. 2019 జూనియర్‌ ప్రపంచకప్‌లో రజతం గెలిచింది. 

నమ్మకంతో ముందుకు

2019లో కొన్ని టోర్నీల్లో ఇషా రాణించలేకపోయింది. కానీ ఏ మాత్రం నిరాశకు లోను కాకుండా... ఓటములే ఉత్తమ పాఠాలు నేర్పుతాయని ముందుకు సాగుతోంది. కరోనా సమయంలోనూ ఇంట్లోనే షూటింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్‌ కొనసాగించింది. ఓటమి ఎదురైందని ఆగిపోతే.. సమస్యలను చూసి బెదిరిపోతే.. ఛాంపియన్‌గా నిలవలేమని నమ్మింది. తిరిగి పతకాల వేటలో సాగింది. 2022 జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 25 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. ఈ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మొట్టమొదటి భారత షూటర్‌ ఆమెనే. అదే పోటీల్లో 10మీ. పిస్టల్‌ టీమ్, మిక్స్‌డ్‌ విభాగాల్లోనూ బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఇప్పుడు సీనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ 25మీ. టీమ్, 10మీ. మిక్స్‌డ్‌ టీమ్‌ స్వర్ణాలతో రికార్డులు తిరగరాసింది. 2020లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇషా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకుంది.

నాన్నే స్ఫూర్తి..

షూటింగ్‌లో ఇంత దూరం రావడానికి ఇషాకు నాన్న సచిన్‌ సింగ్‌ స్ఫూర్తి. ఆయన ఒకప్పుడు కార్టింగ్, ర్యాలీ రేసర్‌. ఎల్లప్పుడూ ఇషా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తాడు. అమ్మ శ్రీలత కూడా ఇషాకు అండగా నిలుస్తోంది. పరాజయాలు పలకరించినా కుంగిపోకుండా ఉండాలని, ఆటలో గెలుపోటములు సహజమని ఆమెకు చెబుతోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఇషా ప్రదర్శన మెచ్చి తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్లు నగదు ప్రోత్సాహకంగా అందించింది. టోక్యో ఒలింపిక్స్‌ కోర్‌ టీమ్‌కు ఎంపికైనప్పటికీ టాప్‌-2లో చోటు దక్కకపోవడంతో ఆమె ఆ క్రీడల్లో పాల్గొనలేకపోయింది. కానీ వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు మాత్రం అర్హత సాధించడమే కాదు.. పతకం కూడా గెలుస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. అంతకంటే ముందు వచ్చే నెలలో చైనాలో ఆరంభమయ్యే ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా సాగుతోంది. ఖాళీగా ఉన్నప్పుడు రెస్టారెంట్లకు వెళ్లి భోజనం ఆస్వాదించడం, సినిమాలు చూడడం ఇషాకు ఇష్టం. అల్లుఅర్జున్‌కు ఆమె అభిమాని. ఇంకా బొమ్మలు గీయడాన్ని కూడా ఎంతో ప్రేమిస్తోంది. షూటింగ్‌ కాకుండా ఆమెకిష్టమైన వ్యాపకం అదే. సాహస క్రీడలపైనా ఆసక్తితో ఉన్న ఇషాకు.. గో కార్టింగ్‌లో తండ్రితో పోటీపడాలన్నది ఆశ. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని