IPL 2024: ధోనీ కొన్ని తప్పులు చేశాడేమో కానీ.. రోహిత్‌ ఎప్పుడూ చేయలేదు : పార్థివ్‌ పటేల్

కెప్టెన్సీలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఐపీఎల్‌ చరిత్రలో (IPL) ఇద్దరు మాత్రమే ఐదేసి సార్లు తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపారు. 

Published : 20 Mar 2024 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో రెండు రోజుల్లో ఐపీఎల్‌ 17వ (IPL 2024) సీజన్‌ సమరం ఆరంభం కానుంది. ఇప్పుడు అందరి దృష్టి చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ, ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా కాకుండా బ్యాటర్‌గా ఆడుతున్న రోహిత్‌ శర్మపైనే ఉంది. వీరిద్దరూ ఆయా జట్లకు అత్యధికంగా ఐదు సార్లు ట్రోఫీలనందించి అత్యుత్తమ సారథులుగా నిలిచారు. వీరి నాయకత్వ లక్షణాలను పోల్చుతూ మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ముంబయిని నడిపించిన రోహిత్‌ శర్మ ఎప్పుడూ తప్పిదాలు చేయలేదని.. చెన్నై సారథి మహీ మాత్రం కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేశాడని పార్థివ్‌ వ్యాఖ్యానించాడు. ‘‘జట్టు సభ్యుల విషయానికొస్తే రోహిత్‌ ఎంతో మద్దతుగా ఉంటాడు. హార్దిక్‌ పాండ్య, బుమ్రా ముంబయి జట్టులోకి వచ్చిన కొత్తలో పెద్దగా రాణించలేదు.  వారిని పక్కనపెట్టాలని జట్టు యాజమాన్యం భావించినా.. వారికి రోహిత్‌ మద్దతుగా నిలిచాడు. వారి ఆటపై నమ్మకం ఉంచి ప్రోత్సహించాడు. దీంతో వీరిద్దరూ ఆ తర్వాత పుంజుకుని అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టు విజయాల్లో భాగమయ్యారు.

మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ రోహిత్‌ జట్టును నడిపించిన తీరు ఇతరులతో పోల్చలేనిది. దీనికి ఉత్తమ ఉదాహరణ ముంబయి రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ను ఒక్క పరుగు తేడాతోనే గెల్చుకుంది. మైదానంలో ప్రశాంతంగా ఉండగలిగే కెప్టెన్‌ లేకపోతే ఇది సాధ్యం కాదు. ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు, పొరపాట్లు జరుగుతుంటాయి. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. గత పదేళ్లలో అతడు చేసిన తప్పు మీకు గుర్తుకురాదు. ధోనీ కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేశాడు. కీలక సమయంలో పవన్‌ నేగికి ఓవర్‌ ఇవ్వడం లాంటివి చేశాడు. కానీ.. రోహిత్‌ అలాంటి బ్లండర్లు చేయలేదు. అయితే, ధోనీ సూచనలు ఇస్తూ ఆటగాళ్లకు మ్యాచ్‌ను తేలిగ్గా మారుస్తుంటాడు’’ అని పార్థివ్‌ తెలిపాడు. 

రోహిత్‌.. పరిస్థితికనుగుణంగా నిర్ణయిస్తుంటాడు: జహీర్‌

‘‘ప్రతీ మ్యాచ్‌ కోసం కొన్ని ప్రణాళికలతో బరిలోకి దిగుతుంటాం. కానీ, మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. మనం అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అలాంటప్పుడు అప్పటికప్పుడు ప్రణాళికలు మారుస్తూ ఉండాలి. రోహిత్ శర్మ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు. మ్యాచ్‌ను గుప్పిట్లో ఉంచుకోవడానికి చివరివరకూ ప్రయత్నిస్తాడు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కెప్టెన్‌కు కఠినమైన సవాల్. ఇలా ముంబయి జట్టు కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు’’ అని భారత మాజీ క్రికెటర్ జహీర్‌ ఖాన్ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని