Rohit Sharma: నా కెప్టెన్సీ అలానే ఉంటుంది: రోహిత్‌ శర్మ వెల్లడి

రోహిత్‌ శర్మ మైదానంలో ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు.. కానీ, అతడు తెరవెనక మ్యాచ్‌ కోసం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తాడు. ఇక గ్రౌండ్‌లో సూటిగా సుత్తి లేకుండా వ్యవహరిస్తాడు. 

Published : 30 May 2024 13:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రోహిత్‌ (Rohit Sharma) బ్యాటింగ్‌ వలే కెప్టెన్సీ కూడా సుత్తి లేకుండా సూటిగా ఉంటుంది. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ కెప్టెన్సీ చూసిన క్రీడాపండితులు ఆశ్చర్యపోయారు. ఆ టోర్నీలో జట్టును ఏకంగా 10 మ్యాచ్‌లు ఓటమెరుగకుండా నడిపించడం సామాన్యమైన విషయం కాదు. తాజాగా రోహిత్‌ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ కెప్టెన్సీలో తాను వ్యూహరచన ఎలా చేస్తాడు.. ఆటగాళ్లతో సంబంధాలు వంటి కీలక అంశాలను వెల్లడించారు.   

గంటల తరబడి ప్లానింగ్‌..

‘‘కెప్టెన్‌గా నేను చాలా వరకు డేటాపై ఆధారపడతాను. దానిని విశ్లేషించే వ్యూహాలను సిద్ధం చేసుకొంటాను. కొత్త ట్రెండ్లను గుర్తించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో గంటల కొద్దీ సమయం మీటింగ్‌ రూముల్లో గడుపుతాను. ముఖ్యంగా మ్యాచ్‌లో ఊహించని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనేదానిపై సిద్ధమవుతా. ప్రాథమికంగా జట్టులోని ఆటగాళ్ల కోసం కాదు.. నాకు ఇది ముఖ్యం. ఆ పరిస్థితులపై అవగాహన ఉండటం చాలా కీలకం. ఇక మైదానంలోకి దిగే సమయానికి అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాను. నా ప్లానింగ్‌ ఇలానే ఉంటుంది. 

కానీ, ఈ విషయాలు మొత్తం చెప్పి జట్టు సభ్యుల మెదళ్లను నింపేయను. ఎవరికి ఏది అవసరమో.. ఎంతవరకు ముఖ్యమో అంతే చెబుతాను. ఇక ప్రత్యర్థులు మమ్మల్ని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధమవుతున్నారో తెలుసుకోవాలనుకుంటాను’’ అని రోహిత్‌ వివరించాడు. 

అదే నాకు అసలైన సవాల్‌..

‘‘కెప్టెన్‌గా ఆటగాళ్లను సమన్వయం చేసుకోవడం అతిపెద్ద సవాలు. ప్రతి ప్లేయర్‌ ఆలోచనా తీరు విభిన్నంగా ఉంటుంది. వారి అవసరాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఆ విషయాలు మొత్తం కెప్టెన్‌గా నేను తెలుసుకోవాలి.. అవసరాన్ని బట్టి స్పందించాలి. ఇక ప్రతి ఆటగాడికి మిగిలిన వారితో సమప్రాధాన్యం ఇవ్వాలి.. అప్పుడే అతడు జట్టులో భాగంగా ఫీల్‌ అవుతాడు. ఎవరైనా ఆటగాడు మన దృష్టికి ఓ సమస్యను తీసుకొస్తే.. జాగ్రత్తగా విని మంచి పరిష్కారం సూచించగలగాలి. వీటన్నిటితోపాటు నేను కెప్టెన్‌గానే కాకుండా.. ఆటగాడిగా కూడా సిద్ధమవ్వాలి.

ఇక టీ20 ఫార్మాట్‌ వేగంగా మారిపోతోంది. ప్రతి ఒక్క ఆటగాడికి విభిన్నమైన శైలి ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకొని.. దానిని బట్టి వారు ఎలా ఆడాలో నిర్ణయించాలి. ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకున్నా.. సమాచారాన్ని వీలైనంత ఫిల్టర్‌ చేసి ఎటువంటి సంక్లిష్టతలు లేకుండా వారికి తెలియజేస్తాను’’ అని రోహిత్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని