IPL 2024: హోస్ట్‌ టీమే విన్నర్‌.. ‘ఫస్ట్‌’ బెస్ట్‌ వీరే!

ఐపీఎల్ 17వ సీజన్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐదు మ్యాచుల్లో నాలుగు చివరి ఓవర్‌ వరకూ వెళ్లాయి..

Updated : 25 Mar 2024 14:02 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో అన్ని జట్లూ తమ తొలి మ్యాచ్‌ను ఆడేశాయి. ఇప్పటివరకు అతిథ్యం ఇచ్చిన టీమ్‌లే గెలిచాయి. కొత్త కెప్టెన్లు ఆకట్టుకోగా.. అంచనాలు పెద్దగా లేని బ్యాటర్లు భారీ హిట్టింగ్‌తో అలరించారు. తామేం తక్కువ కాదంటూ బౌలర్లూ నిరూపించారు. ఇలా ఫస్ట్‌ మ్యాచుల్లో బెస్ట్‌గా నిలిచిన ప్లేయర్లపై ఓ లుక్‌ వేద్దాం.

  1. ముస్తఫిజర్‌ రహ్మాన్: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై విజయంతో బోణీ కొట్టింది. బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరును కట్టడి చేయడంలో చెన్నై బౌలర్‌ ముస్తఫిజర్‌ రహ్మాన్‌ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో తన అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడు. ధోనీ నుంచి బాధ్యతలు చేపట్టిన రుతురాజ్‌ కెప్టెన్‌గా తన ప్రతిభ కనబరిచాడు. 
  2. సామ్‌ కరన్‌ దూకుడు: గత మినీ వేలం ముందు వరకు లీగ్‌ చరిత్రలో అత్యధిక ధర సొంతం చేసుకున్న ఆటగాడిగా సామ్‌ కరన్‌ పేరిట రికార్డు ఉండేది. కానీ, గత సీజన్‌లో అనుకున్నంత మేర రాణించలేకపోయాడు. ఈసారి మాత్రం మొదటి మ్యాచ్‌లోనే తన విశ్వరూపం చూపించాడు. దిల్లీతో మ్యాచ్‌లో క్లిష్టసమయంలో కీలకమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించాడు. 47 బంతుల్లో 63 పరుగులు చేశాడు. దాదాపు 15 నెలల తర్వాత మైదానంలోకి దిగిన దిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్ భారీగా పరుగులు చేయకపోయినా.. క్రీజ్‌లో మాత్రం కంఫర్ట్‌గా ఆడాడు.
  3. రస్సెల్ హిట్టింగ్‌.. క్లాసెన్‌ క్లాస్‌: ఈ సీజన్‌లో తొలిసారి ఓ జట్టు 200+ స్కోరును దాటింది. అలానే ఛేదనలోనూ ప్రత్యర్థి దీటుగా బదులిచ్చింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన కోల్‌కతా-హైదరాబాద్‌ మ్యాచ్‌లో ఈ ఘనత నమోదు కావడం విశేషం. గత రెండు సీజన్లలో పెద్దగా ఆకట్టుకోని ఆండ్రి రస్సెల్‌ ఈసారి మొదటి మ్యాచ్‌లో బీభత్సం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కోల్‌కతా 208/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హెన్రిచ్‌ క్లాసెన్ (29 బంతుల్లో 63) దెబ్బకు విజయానికి చేరువగా వచ్చింది. చివరికి 204/7 స్కోరు చేసి హైదరాబాద్‌ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.
  4. సంజూ శాంసన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌: ఐదు మ్యాచుల్లో నాలుగు చివరి ఓవర్‌ వరకూ వెళ్లగా.. రాజస్థాన్‌ - లఖ్‌నవూ మ్యాచ్‌ మాత్రం మలుపులేమీ లేకుండానే ముగిసింది. అయితే, రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్ (82*) భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కొన్ని సీజన్లుగా ఆటతో కాకుండా తన ప్రవర్తనతో నెట్టింట వైరల్‌గా మారిన రియాన్‌ పరాగ్‌(43) మంచి ఆటతీరు ప్రదర్శించాడు. లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ (58), వైస్‌ కెప్టెన్‌ (64*) అర్ధశతకాలు చేసినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. టీ20 ప్రపంచ కప్‌ నేపథ్యంలో సంజూ, కేఎల్ ఇన్నింగ్స్‌లు, ప్రదర్శన కీలకం. 
  5. గుజరాత్‌ అదుర్స్‌: బ్యాటింగ్‌కు కష్టమైన అహ్మదాబాద్‌ పిచ్‌పై ముంబయి ఒక దశలో విజయం దిశగా సాగింది. కానీ, గుజరాత్‌ బౌలర్ల అద్భుత ప్రతిభతో ముంబయి ఓటమిపాలైంది. హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీతోపాటు బౌలింగ్‌లో విఫలమయ్యాడు. కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన గిల్ జట్టును నడిపించడంలో సక్సెస్‌ కావడం విశేషం. కీలక సమయంలో మోహిత్ శర్మ (2/32), ఉమేశ్ యాదవ్ (2/31), ఒమర్జాయ్ (2/27) రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సాయి సుదర్శన్‌ (45) చక్కని ఆటతీరు ప్రదర్శించాడు. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ (43) కూడా రాణించాడు. బుమ్రా (3/14) పదునైన బౌలింగ్‌ చేశాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని