Tim Paine on Ben Stokes: వారికి అలా చెబుతావా..? బెన్‌స్టోక్స్‌పై టిమ్‌పైన్ తీవ్ర విమర్శలు

ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) మళ్లీ వన్డేల్లోకి అడుగు పెట్టడంపై ఆ జట్టు అభిమానులు ఆనందపడుతుండగా.. ప్రత్యర్థి మాజీలు మాత్రం విమర్శలకు పనిచెప్పారు. తాజాగా ఆసీస్‌ మాజీ కెప్టెన్ టిమ్‌ పైన్‌ మాటల యుద్ధం ప్రారంభించాడు.

Published : 19 Aug 2023 14:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఆడేందుకు సిద్ధమైన ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్‌పై (Ben Stokes) ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్‌ పైన్‌ (Tim Paine) విమర్శల దాడి మొదలుపెట్టాడు. గతేడాది వన్డేల (ODI) నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు బెన్ స్టోక్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఆ జట్టు కోచ్ సహా అభిమానుల నుంచి విపరీతంగా విజ్ఞప్తులు రావడంతో యూ-టర్న్‌ తీసుకున్నాడు. రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించడంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. అలాగే వరల్డ్‌ కప్‌ కోసం ప్రకటించిన ప్రాథమిక జట్టులోనూ స్థానం కల్పించారు. ఈ క్రమంలో బెన్‌స్టోక్స్‌ నిర్ణయంపై టిమ్‌ పైన్ విమర్శలు గుప్పించడం గమనార్హం. 

ODI World Cup 2023 : బెన్ కంటే ముందు ఇమ్రాన్

‘‘బెన్‌ స్టోక్స్ వన్డేల్లోకి తిరిగి రావడం ఆసక్తికరంగా అనిపించింది. అతడి వ్యవహరం ఎలా ఉందంటే.. నేనే ఎంచుకుని ఆడతా. ఏది ఆడాలనిపిస్తే అదే ఆడతా. కేవలం పెద్ద టోర్నీల్లోనే ఆడతానన్నట్లుగా అతడి పరిస్థితి ఉంది. ఇలా చేయడం వల్ల గత ఏడాది నుంచి ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతో శ్రమించిన ఇతర ఆటగాళ్ల అవకాశాలను మిస్‌ చేసినట్లు అవుతుంది. అలాంటి యువ క్రికెటర్లతో ‘సారీ, నువ్వు వెళ్లి రిజర్వ్‌ బెంచ్‌పై కూర్చో. నేను ఇప్పుడు ఆడాలని అనుకుంటున్నా’ అని చెప్పినట్లుగా ఉంది.

హ్యారీ బ్రూక్‌ (Harry Brook) విషయంలోనే అన్యాయం జరిగిందనిపిస్తోంది. ఇటీవల బెన్‌ స్టోక్స్ (Ben Stokes) బౌలింగ్‌ కూడా చేయడం లేదు. అలాంటప్పుడు బ్యాటర్‌గా బెన్‌ స్టోక్స్ లేదా హ్యారీ బ్రూక్? ఎవరు బెస్ట్‌ అనే ప్రశ్న ఉత్పన్నమవడం సహజం. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఇంగ్లాండ్‌ ఫేవరేట్‌గా భావిస్తున్నారు. సెమీస్‌కు చేరే నాలుగింట్లో మా జట్టుతోపాటు భారత్, ఇంగ్లాండ్‌ తప్పక ఉంటాయి’’ అని టిమ్‌ పైన్‌ వ్యాఖ్యానించాడు. హ్యారీ బ్రూక్‌ టెస్టుల్లో అత్యంత వేగంగా 1000+ పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, వన్డేల్లో గొప్ప ప్రదర్శన లేకపోవడంతో అతడిని ప్రాథమిక జట్టులోకి తీసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని