Hanuma Vihari: ఒంటిచేత్తో ఆడాడు.. హనుమ విహారి వాదనను నమ్ముతా: చోప్రా

భారత్‌ తరఫున కీలక సమయాల్లో రాణించిన హనుమ విహారి (Hanuma Vihari) విషయంలో ఇలా జరగడం బాధాకరమని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.

Published : 28 Feb 2024 17:10 IST

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు క్రికెట్‌ వర్గాలను విస్మయానికి గురి చేస్తోన్న అంశం హనుమ విహారి కెప్టెన్సీ తొలగింపు. రంజీ ట్రోఫీలో ఆంధ్రా జట్టుకు సారథిగా ఉన్నప్పుడు తోటి సహచరుడిని అసభ్య పదజాలంతో మందలించాడనే ఆరోపణలతో ఏకంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ కుమారుడిని అనడమే దీనికి కారణమని క్రికెట్‌, రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే హనుమ విహారి ఇకపై ఆంధ్రా జట్టుకు ఆడేది లేదని తేల్చి చెప్పాడు. ఈ వివాదంపై భారత మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు. 

‘‘ఇదంతా బురద చల్లే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇరువైపులా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సోదరభావంతో ప్లేయర్లకు ఒక విషయం చెబుతున్నా. సహచరులపై ఎప్పుడూ నమ్మకం ఉంచాలి. హనుమ విహారి సాధారణ ఆటగాడిగానే కాకుండా గతంలో ఆంధ్రా కోసం, టీమ్‌ఇండియా కోసం ఒంటి చేత్తో మ్యాచ్‌లు ఆడిన టాలెంటెడ్‌ క్రికెటర్. అతడి కెరీర్‌ అద్భుతంగా ఉంది. రంజీ ట్రోఫీలో ఆంధ్రా జట్టును సెమీస్‌కు క్వాలిఫై చేయడంలో కీలకపాత్ర పోషించాడు. సిడ్నీ టెస్టులో గాయమైనా సరే క్రీజ్‌లో పాతుకుపోయిన తీరు చూసిన తర్వాత అతడిపై గౌరవభావం పెరిగింది. అందుకే, నేను హనుమ విహారి వైపు వాదనను నమ్ముతున్నా’’ అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. 

ఇదీ హనుమ విహారి పోస్టు.. 

‘‘బెంగాల్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌ సందర్భంగా 17వ ఆటగాణ్ని గేమ్‌ విషయంలో కోప్పడ్డాను.  ఆ విషయం అతని తండ్రికి చెప్పాడు. రాజకీయ నాయకుడైన ఆయన నాపై చర్య తీసుకోవాలని ఏసీఏని కోరారు. ఆ మ్యాచ్‌లో బెంగాల్‌ భారీ లక్ష్యాన్ని నిలిపినా.. మేం పోరాడి గెలిచాం. గత సీజన్‌లో ఫైనల్‌కు చేరిన బెంగాల్‌ను మేం మొదటి మ్యాచ్‌లోనే ఓడించినా నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిందిగా ఏసీఏ ఆదేశించింది. నా తప్పేమీ లేకపోయినా నన్ను కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఆ క్రికెటర్‌ను నేను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో విహారి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని