Rohit Sharma: రోహిత్ నాయకత్వం అద్భుతం.. ధోనీ తర్వాత అతడే: భారత మాజీ క్రికెటర్

ఎంఎస్ ధోనీ నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోవడం చాలా కష్టం. కానీ, రోహిత్ శర్మ ఆ దిశగా నడుస్తున్నట్లు మాజీ క్రికెటర్ రైనా వ్యాఖ్యానించాడు.

Published : 28 Feb 2024 14:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉన్నాయని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) అభినందించాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమ్‌ఇండియా (IND vs ENG) కైవసం చేసుకోవడంలో హిట్‌మ్యాన్‌ సారథ్యం ప్రధాన కారణమని రైనా వ్యాఖ్యానించాడు. ఎక్కువ మంది యువకులు ఉన్నా సరే ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని పేర్కొన్నాడు. ఈ టెస్టు సిరీస్‌లోనే నలుగురు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం గమనార్హం. తొలుత 0-1 తో వెనుకబడినా అనంతరం పుంజుకుని సిరీస్‌ను సొంతం చేసుకోవడం గొప్ప విషయమని రైనా తెలిపాడు. 

‘‘రోహిత్ కెప్టెన్సీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అతడి నాయకత్వం అద్భుత స్థాయిలో ఉంది. తప్పకుండా ధోనీ తర్వాత అత్యుత్తమ కెప్టెన్‌ రోహిత్ అనడంలో సందేహం లేదు.  యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంలో ధోనీ మాదిరిగానే రోహిత్ ముందుంటాడు. ‘కెప్టెన్‌ కూల్‌’ నాయకత్వంలో నేను చాలా ఏళ్లు క్రికెట్ ఆడా. అలాగే సౌరభ్‌ గంగూలీ కూడా కుర్రాళ్లకు స్వేచ్ఛ ఇచ్చేవాడు. అతడి తర్వాత ధోనీ జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు రోహిత్ సరైన దిశలోనే ఉన్నాడు.  పక్కా ప్లానింగ్‌తో వ్యూహాలను పన్నుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఇలా ఆటగాళ్లను రొటేట్‌ చేసిన పద్ధతిని చూడలేదు. గతంలో ఫాస్ట్‌ బౌలర్లు తరచూ గాయాలబారిన పడేవారు. ఇప్పుడు ఇంజూరి మేనేజ్‌మెంట్‌తో ఆ ప్రమాదం తగ్గింది’’ అని రైనా వ్యాఖ్యానించాడు.

అప్పుడే చెప్పాడు.. మెర్సిడెజ్‌ కొంటానని..: రోహిత్ చిన్ననాటి కోచ్

ఆర్థిక కష్టాలను ఎదుర్కొని మరీ గొప్ప క్రికెటర్‌గా మారిన రోహిత్ శర్మ గురించి చిన్ననాటి కోచ్ దినేశ్‌ లాడ్‌ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. మెర్సిడెజ్‌ కార్‌ను కొనడం కల అని.. తప్పకుండా భవిష్యత్తులో నెరవేర్చుకుంటానని రోహిత్ చెప్పాడట. ‘‘నేను, రోహిత్ ఓసారి దారిలో వెళ్తూ మెర్సిడెజ్‌ కారును చూశాం. అప్పుడు రోహిత్ స్పందిస్తూ ‘‘సర్, ఏదొక రోజు అలాంటి కారును కొంటా’ అని అన్నాడు. అప్పుడు అతడు ముంబయి తరఫున అండర్ -19 జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటికి పెద్ద టోర్నీల్లో ఆడలేదు. ఇది సాధ్యమేనా? అని అనిపించినా.. రోహిత్ ఆత్మవిశ్వాసంతో ఆ మాట అన్నాడు’’ అని దినేశ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని