Hardik Pandya: వారితో పోలిస్తే.. హార్దిక్‌ పరిస్థితే వేరు: ఇర్ఫాన్‌ వ్యాఖ్యలకు మాజీ క్రికెటర్‌ కౌంటర్

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లను ఇవ్వడంలో బీసీసీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ కొట్టిపడేశాడు.

Updated : 02 Mar 2024 15:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆటగాళ్లందరినీ సమానంగా చూడాలని.. కొందరికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశవాళీ క్రికెట్‌ ఆడకపోయినా హార్దిక్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్‌ దక్కిందని.. ఇషాన్‌, శ్రేయస్‌లను పక్కనపెట్టారన్న ఉద్దేశంతో ఇర్ఫాన్‌ ఇలా వ్యాఖ్యానించాడు.  తాజాగా వాటికి కౌంటర్ ఇస్తూ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. పాండ్య విషయంలో కారణం విభిన్నమని.. దానిని ఎత్తి చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. 

‘‘హార్దిక్‌ పాండ్య రెడ్‌ బాల్ క్రికెట్ ఆడటం లేదు. అందులో పాల్గొనాలని అనుకోవడం లేదు. పాండ్య కూడా చెప్పలేదు. టెస్టు సిరీస్‌లకు అందుబాటులో ఉండటంలేదు. సుదీర్ఘ ఫార్మాట్‌లో బౌలింగ్‌ చేసేంత బలం అతడికి లేదు. అందుకే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆడాలని ఎవరూ అడగరు. గాయాలబారిన పడితే పరిమిత ఓవర్ల క్రికెట్‌కూ దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉండి భారత్‌కు ఆడకుండా బ్రేక్‌ తీసుకున్నాడనుకుందాం.. అప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లేదా విజయ్ హజారే ట్రోఫీలో ఆడకుండా వీడియో షూట్‌లు చేసుకుంటే దానిని తప్పుగా మీరు చెప్పొచ్చు. కానీ, ఇప్పుడు అతడు ఆ పరిస్థితుల్లో లేడు. అలాంటప్పుడు తప్పేమీ చేయకుండా శిక్షించాలని అనుకోవడం ఎందుకు?’’ అని చోప్రా ప్రశ్నించాడు. 

ఇర్ఫాన్‌ ఏమన్నాడంటే? 

‘‘శ్రేయస్, ఇషాన్‌ కిషన్ అద్భుతమైన టాలెంట్ కలిగిన క్రికెటర్లు. తప్పకుండా పుంజుకొని వస్తారు. ఇక హార్దిక్‌ పాండ్య రెడ్‌బాల్ క్రికెట్ ఆడకూడదని భావిస్తే.. కనీసం దేశవాళీలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనైనా పాల్గొనాలి. జాతీయ జట్టుకు అందుబాటులో లేని సమయంలో ఫిట్‌గా ఉంటే డొమిస్టిక్‌ క్రికెట్ ఆడాలని చెబుతున్నారు. ఇదే సూత్రం అందరికీ సమానంగా ఎందుకు వర్తించడం లేదు? అలాంటప్పుడు భారత క్రికెట్‌ అనుకున్నంత మేర లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది’’ అని ఇర్ఫాన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని