Hardik Pandya: దేశవాళీ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లోనైనా పాండ్య ఆడితే బాగుండేది: ఇర్ఫాన్ పఠాన్‌

టీమ్‌ఇండియాలో ఇప్పుడు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లపై చర్చ సాగుతోంది. దేశవాళీ క్రికెట్‌లో ఆడలేదని శ్రేయస్‌, ఇషాన్‌పై వేటు వేసిన బీసీసీఐ పాండ్య విషయంలో వెనక్కి తగ్గడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

Published : 29 Feb 2024 15:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాలో (Grade A) హార్దిక్‌ పాండ్యకు చోటు దక్కింది. గతేడాది వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా గాయపడిన హార్దిక్‌.. ఇప్పటివరకు మైదానంలోకి అడుగు పెట్టలేదు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌నే ఆడుతున్న పాండ్యను టెస్టులకు ఎంపిక చేసేందుకూ సెలక్టర్లు మొగ్గు చూపడం లేదు. అతడి శరీరం సహకరించదనే ఉద్దేశంతో పక్కన పెట్టేయడం గమనార్హం. తాజాగా ఐపీఎల్‌ కోసం సన్నద్ధవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఫిట్‌గా ఉన్నప్పుడు దేశవాళీలో ఆడించాల్సిందని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇషాన్ కిషన్, శ్రేయస్‌ అయ్యర్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి పక్కన పెట్టేసిన క్రమంలో పాండ్య విషయంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్‌, శ్రేయస్‌ కాంట్రాక్ట్‌ రద్దు కావడంతోపాటు పాండ్య పైనా స్పందించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయంలో దేశవాళీలోనైనా పరిమిత ఓవర్ల టోర్నీ ఆడితే బాగుంటుందని సూచించాడు. 

‘‘శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్ కిషన్ ప్రతిభ కలిగిన క్రికెటర్లు. తప్పకుండా పుంజుకొని తిరిగి వస్తారని భావిస్తున్నా. అదే సమయంలో.. హార్దిక్‌ పాండ్య మాదిరిగా ఎవరైనా రెడ్ బాల్‌ క్రికెట్ ఆడకుండా ఉండాలని భావిస్తే.. కనీసం వారిని దేశవాళీలోని పరిమిత ఓవర్ల మ్యాచుల్లోనైనా పాల్గొనేలా చేయాలి. ఇదే సూత్రం అందరికీ అమలు చేయకపోతే.. భారత క్రికెట్ అనుకున్న సత్ఫలితాలను సాధించడంలో వెనకబడుతుంది’’ అని ఇర్ఫాన్ పోస్టు పెట్టాడు. 

బీసీసీఐ నిర్ణయం సరైందే: సౌరభ్‌ గంగూలీ

‘‘శ్రేయస్‌, ఇషాన్‌ను రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ సూచించింది. కానీ, వారిద్దరూ అక్కడ ఆడకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. దేశంలో గొప్ప టోర్నీల్లో ఒకటైన రంజీల్లో ఆడటాన్ని తక్కువగా భావించడం సరైంది కాదు. ప్రతిఒక్కరూ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్ ఆడాలి. కుర్రాళ్లు ఇలాంటి వైఖరిని ప్రదర్శించడం షాకింగ్‌ అనిపిస్తోంది. కాంట్రాక్ట్‌ ప్లేయర్లు బీసీసీఐ సూచనలను పాటించాలి. అత్యవసర, ఇతర కారణాలతో ఉండిపోతే ఏం చేయలేం. కానీ, ఫిట్‌గా ఉండి మరీ డుమ్మా కొట్టడం బాగోలేదు. అందుకే, ఇషాన్‌, శ్రేయస్‌ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే. తప్పకుండా ఇతర ఆటగాళ్లకు ఇది హెచ్చరికగా ఉంటుంది’’ అని భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని