IND vs ENG: కుల్‌దీప్‌ విషయంలో రోహిత్ అయోమయానికి గురయ్యాడు: మాజీ క్రికెటర్లు

రాంచీ వేదికగా నాలుగో టెస్టులో (IND vs ENG) రెండో రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రోజు ఆటలోనూ జో రూట్‌ సెంచరీ చేసి ఆ జట్టును కాపాడాడు. అయితే, బౌలర్లను వినియోగించుకోవడంలో రోహిత్ ఇబ్బంది పడ్డాడని భారత మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు.

Published : 25 Feb 2024 02:02 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో (IND vs ENG) భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్ల విషయంలో తీవ్ర గందరగోళానికి గురైనట్లు మాజీ క్రికెటర్లు ఆర్‌పీ సింగ్‌, ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యానించారు. లెప్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌తో ఎక్కువ ఓవర్లు వేయించకపోవడం సరైన నిర్ణయం కాదన్నారు. తొలి రోజు ఆటలో కుల్‌దీప్‌ కేవలం 10 ఓవర్లు మాత్రమే విసిరాడు. దాదాపు సగం ఓవర్ల తర్వాతనే బౌలింగ్‌కు తీసుకురావడం గమనార్హం. వికెట్‌ తీయనప్పటికీ.. కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేసి పరుగులు నియంత్రించాడు. రెండో రోజూ కేవలం మరో 2 ఓవర్లే ఇవ్వడం గమనార్హం. తన 12 ఓవర్ల కోటాలో కుల్‌దీప్‌ కేవలం 22 పరుగులే ఇచ్చాడు. 

‘‘భారత బౌలర్లు చాలా శ్రమించారు. రవీంద్ర జడేజా, అశ్విన్‌, సిరాజ్, ఆకాశ్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. తొలి స్పెల్‌ కంటే రెండో స్పెల్‌లో సిరాజ్‌ చక్కగా బంతులను విసిరాడు. ఇక్కడ నాకొచ్చే ఏకైక అనుమానం కుల్‌దీప్‌ను ఎందుకు పెద్దగా వాడుకోలేదు? జడ్డూ, అశ్విన్‌తో చాలా ఓవర్లు వేయించిన కెప్టెన్‌.. కుల్‌దీప్‌కు తక్కువ ఇచ్చాడు. ముగ్గురు స్పిన్నర్లు ఉండి.. ఇద్దరు వికెట్లు తీస్తూ ఉంటే మూడో బౌలర్‌ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి తప్పదు’’ అని ఆర్‌పీ సింగ్‌ తెలిపాడు.

కుల్‌దీప్‌ను తేవడంలో ఆలస్యమైంది: చోప్రా  

‘‘జట్టులో ఐదుగురు బౌలర్లు ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడు బౌలింగ్‌కు తీసుకురావాలన్న కన్‌ఫ్యూజ్‌ ఉంటుంది. మీరు బఫెట్‌కు వెళ్లినప్పుడు చాలా రకాలు పదార్థాలు ఉంటాయి. ఏది వేసుకోవాలనే విషయంలో గందరగోళం తప్పదు. కుల్‌దీప్‌ను చాలా ఆలస్యంగా బౌలింగ్‌కు తీసుకొచ్చారు. ఇంకాస్త ముందుగా తెచ్చి ఉంటే బాగుండేది’’ అని ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యానించాడు. 

కోహ్లీ లేని లోటు కనిపించింది: మంజ్రేకర్

‘‘ఐదు టెస్టుల సిరీస్‌లో విరాట్ కోహ్లీ లేకపోవడం భారత్‌కు ఇబ్బందే. అతడి దూకుడైన ఆటతీరు ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేలా ఉంటుంది. ఫీల్డింగ్‌ సమయంలో ఆటగాళ్లు కాస్త డల్‌గా అనిపించినప్పుడు.. కోహ్లీ వారిలో ఎనర్జీ తీసుకురాగలడు. ఇప్పుడు మైదానంలో ఉన్నవారెవరూ అలా చేయలేరు. మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే ప్రేక్షకులను కూడా విరాట్ తన విన్యాసాలతో ఆకట్టుకుంటాడు’’ అని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్ తెలిపాడు. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులకు ఫిబ్రవరి 15న రెండో బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. అకాయ్‌గా అతడిని కోహ్లీ పరిచయం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని