IPL 2024: భారత క్రికెట్‌లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం

ఐపీఎల్‌లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Updated : 18 Apr 2024 14:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయితో మ్యాచ్‌ సందర్భంగా చెన్నై బౌలింగ్‌ యూనిట్‌పై క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే (Harsha Bhogle) చేసిన కామెంట్లు ఓ భారత మాజీ క్రికెటర్‌కు ఆగ్రహాన్ని తెప్పించాయి. తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు. అయితే, సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో వాటిని డిలీట్ చేయడం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందంటే?

వాంఖడే మైదానం వేదికగా గత ఆదివారం ముంబయి-చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్కే 206/4 స్కోరు చేసింది. చివరి ఓవర్‌లో ధోనీ హ్యాట్రిక్‌ సిక్స్‌లతో విరుచుకుపడటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆ సమయంలో కామెంట్రీ చేస్తున్న హర్షా.. ‘‘206 స్కోరు మంచిదే. కానీ, మంచు ప్రభావం ఎక్కువగా ఉండే ఇలాంటి పిచ్‌పై అదనంగా మరో 20 పరుగులు చేస్తే బాగుండేది. ఆ జట్టులో బౌలింగ్‌ ఆప్షన్లు కూడా మరీ ఎక్కువగా లేవు’’ అని పేర్కొన్నాడు. అతడి కామెంట్లపై భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘మీలాంటి వారు చెన్నై ఆటగాళ్లను తక్కువ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటివి నాతో చేయండి. అంతేకానీ సీఎస్కేతో వద్దు’’ అని ఘాటుగా పోస్టు పెట్టాడు. 

(సోర్స్‌: ఎక్స్)

అంతటితో ఆగని ఆయన మరో పోస్టులో భోగ్లేను ఉద్దేశించి ‘‘భారత క్రికెట్‌కు నువ్వేం చేశావు? నీ భాగస్వామ్యం ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది’’ అని కామెంట్ చేశాడు. అయితే, ఆ తర్వాత వాటిని శివరామకృష్ణన్‌ డిలీట్‌ చేశాడు. అప్పటికే అభిమానులు స్క్రీన్‌ షాట్లను తీయడంతో వైరల్‌గా మారాయి. ఆ మ్యాచ్‌లో చివరికి ముంబయి 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చెన్నై బౌలర్లు రాణించడంతో 186/6 స్కోరుకే ముంబయి పరిమితమైంది. పతిరన (4/28) అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు