Shubman Gill: గిల్‌.. నువ్వు ధోనీ నుంచి నేర్చుకోవాలి: మంజ్రేకర్

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) నిలకడగా ఆడుతున్న బ్యాటర్లలో శుభ్‌మన్‌ గిల్‌ (GILL) ఒకరు. అతడికి మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ ఓ సలహా ఇచ్చాడు.

Updated : 15 Apr 2023 15:18 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 16వ సీజన్‌లో (IPL 2023) గుజరాత్‌ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) అదరగొట్టేస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు అర్ధశతకాలతో 183 పరుగులు చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ (PBKS vs GT) 49 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. కానీ, మిడిల్‌ ఓవర్లలో మాత్రం నెమ్మదించాడు. దీంతో 154 పరుగుల లక్ష్య ఛేదన చివరి ఓవర్‌ వరకూ వెళ్లింది. ఈ క్రమంలో 14 ఓవర్లకే 106 పరుగులు సాధించిన గుజరాత్‌.. చివరి 48 పరుగులను సాధించడానికి 35 బంతులు తీసుకోవడం గమనార్హం. శుభ్‌మన్‌ గిల్‌తోపాటు డేవిడ్ మిల్లర్‌ (18 బంతుల్లో 17 నాటౌట్) కూడా నిదానంగా ఆడారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ మాత్రం గిల్‌ బ్యాటింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి మంచి ఫినిషర్‌గా మారాలని అనుకుంటే మాత్రం ఎంఎస్ ధోనీని చూసి నేర్చుకోవాలని సూచించాడు. 

‘‘మ్యాచ్‌లో ఓ బ్యాటర్‌ క్రీజ్‌లో పాతుకుపోయి ఉంటే మాత్రం.. అతడే ఫినిష్‌ చేయాలి. కానీ, చివరి ఓవర్‌ వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లకూడదు. గేమ్‌ను 18, 19వ ఓవర్‌లోనే పూర్తి చేసేయాలి. చివరి ఓవర్‌ వరకూ తీసుకెళ్లాలంటే ధోనీలా నాటౌట్‌గా నిలవాలి. సాయి సుదర్శన్ కూడా 100 స్ట్రైక్‌రేట్‌తోనే పరుగులు చేశాడు. డేవిడ్‌ మిల్లర్‌ కూడా దూకుడుగా ఆడలేకపోయాడు. గిల్‌ కూడా మిడిల్‌ ఓవర్లలో నెమ్మదించాడు. ఇప్పుడు గిల్ యువకుడు. అతడిలో అద్భుతమైన సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలకు డెత్‌ ఓవర్లలో ఆడిన అనుభవం ఉంది. ఓపెనర్‌గానూ, వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లీకి చివరి వరకు క్రీజ్‌లో ఉండి గేమ్‌ను ఫినిష్‌ చేయడం తెలుసు. ఇక ధోనీ తన క్రికెట్‌ కెరీర్‌ మొత్తం డెత్‌ ఓవర్లలోనే గడిచిపోయింది. కాబట్టి, వీరి నుంచి గిల్‌ నేర్చుకోవాలి’’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని