Virat - Gambhir: కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్

బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది.

Updated : 29 Mar 2024 14:51 IST

(ఫొటో సోర్స్‌: ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ - గౌతమ్ గంభీర్ (Virat - Gambhir)ల వాగ్వాదం గత ఐపీఎల్ సీజన్‌లో ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోయే సంఘటన. ఈసారి కోహ్లీ బెంగళూరు తరఫున ఆడుతుండగా.. గంభీర్‌ కోల్‌కతాకు మెంటార్‌గా వచ్చాడు. ఇవాళ చిన్నస్వామి వేదికగా బెంగళూరు-కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈక్రమంలో మరోసారి అప్పటి సంఘటన పునరావృతం అవుతుందా? అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఈ ప్రశ్నకు భారత మాజీ క్రికెటర్‌, బెంగళూరు జట్టుకు ఆడిన వరుణ్‌ ఆరోన్‌ స్పందించాడు. 

‘‘అప్పటి సంఘటనపై మాట్లాడాలనుకోవడం లేదు. కానీ, ఈసారి మ్యాచ్‌ సమయంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగానే ఉంది. గౌతమ్‌ గంభీర్ కోల్‌కతా డగౌట్‌లో బెంగళూరు జట్టుకు దగ్గరగా ఉంటాడు. మరి విరాట్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఎందుకంటే అతడిలోని ఫైర్‌ను ఉంచుకోడు. అదంతా మైదానానికే పరిమితం అవుతుందని భావిస్తున్నా’’ అని ఆరోన్ వ్యాఖ్యానించాడు. 

పోటీ ఎవరి మధ్య ఉంటుందంటే?: డీకే

బెంగళూరు - కోల్‌కతా జట్ల మధ్య పోరంటే సాధారణంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంటుందో చూస్తాం. కానీ, దాంతోపాటు అదనంగా విరాట్-గంభీర్‌ల మధ్య కూడా ఫైట్‌ ఆసక్తికరంగా ఉంటుంది. దీనిపై దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) స్పందిస్తూ.. ‘‘ మిచెల్ స్టార్క్ - గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ పోరు బాగుంటుంది. నాకు, వరుణ్‌ చక్రవర్తికి మధ్య ఫైట్‌ ఆసక్తికరం. ఇక మీరందరూ అనుకున్నట్లు విరాట్ Vs గంభీర్‌ పోటీతత్వంపై  నేనేమీ మాట్లాడలేను’’ అని నవ్వుతూ కార్తిక్ సమాధానం ఇచ్చాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కార్తిక్‌ ‘ఫినిషర్‌’ పాత్ర పోషించాడు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు బోణీ కొట్టగలిగింది. సొంత మైదానం కావడంతో మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని