Prithvi Shaw: బెంచ్‌పై ఉంచితే పరుగులు చేస్తాడా..? పృథ్వీషాకు అవకాశాలు ఇవ్వాలి: మాజీలు

కీలకమైనా ఆటగాడిని పక్కన పెట్టడం ఎందుకో దిల్లీ మేనేజ్‌మెంట్ చెబితే బాగుంటుందని మాజీ క్రికెటర్లు ప్రశ్నించారు. పృథ్వీషాను ఆడించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

Published : 30 Mar 2024 09:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత యువ ఆటగాడు పృథ్వీ షాకు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. గత సీజన్‌లో పెద్దగా రాణించనంత మాత్రాన ఆడించకపోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. మినీ వేలం సమయంలో దిల్లీ జట్టు పృథ్వీ షాను వదిలేయకుండా అట్టిపెట్టుకుంది. ఈ సీజన్‌లో ఇంకా ఆడించలేదు. దీనిపై భారత మాజీ క్రికెటర్ వసీమ్‌ జాఫర్, ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం టామ్‌ మూడీ దిల్లీ మేనేజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశారు. రికీ భుయ్‌కు బదులు పృథ్వీ షాను తీసుకోవడం ఉత్తమమని వ్యాఖ్యానించారు. 

‘‘భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన ఆటగాడిని డగౌట్‌కు పరిమితం చేయడం తెలివైన నిర్ణయం కాదు. గత సీజన్‌లో అతడు రాణించలేదన్నది వాస్తవమే. కానీ, డగౌట్‌లో కూర్చుంటే పరుగులు చేయడం కుదరదు కదా. అవకాశం ఇచ్చి.. సరిగ్గా ఆడకపోతే అప్పుడు పక్కన పెట్టినా అర్థముంటుంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడిన రికీ భుయ్‌ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. రెండు మ్యాచుల్లో (3, 0) విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీలో సాధించిన పరుగులకు.. అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లో ఆటతీరుకు చాలా వ్యత్యాసం ఉంది. బౌన్సర్‌కు భుయ్‌ వికెట్‌ను సమర్పించాడు’’ అని టామ్‌ మూడీ వెల్లడించాడు. 

ఇప్పటికీ ఆశ్చర్యమే: వసీమ్‌ జాఫర్

‘‘మినీ వేలం సమయంలో పృథ్వీషాను అట్టిపెట్టుకొని దిల్లీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తొలి రెండు మ్యాచుల్లో ఆడించకుండా పక్కన పెట్టింది. ఎందుకు అతడిని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారో అర్థం కావడం లేదు. దేశవాళీ క్రికెట్‌లో ముంబయి తరఫున ఆడాడు. అతడి ఫిట్‌నెస్‌ కూడా బాగానే ఉంది. అతడిని శిక్షించాలనుకోవడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మ్యాచ్‌లను కూడా ఓడిపోవాల్సి వస్తోంది. టోర్నీలో ముందుకు వెళ్లే మార్గం కనిపించడం లేదు’’ అని వసీమ్ జాఫర్ తెలిపాడు. ఆదివారం చెన్నై జట్టుతో దిల్లీ తలపడనుంది. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. వైజాగ్‌ను దిల్లీ రెండో సొంతమైదానంగా ఎంపిక చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు