Yashasvi Jaiswal: ‘యశస్వి భయానికి లొంగే రకం కాదు..’

టీమ్‌ ఇండియా కుర్రాడు యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని చిన్ననాటి కోచ్‌ వెల్లడించాడు. 

Published : 20 Feb 2024 14:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్ ఇండియా (Team India) యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) అమ్ములపొదిలోని ‘పుల్‌’ షాట్‌కు ఓ ప్రత్యేకత ఉందని అతడి చిన్ననాటి కోచ్‌ ఆరిఫ్‌ హుస్సేన్‌ వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘‘యశస్వి(Yashasvi Jaiswal)లో ఏదో ప్రత్యేకత ఉందని మేం బలంగా నమ్మేవాళ్లం. దీంతో అతడి ప్రతిభకు పదునుపెట్టాలని భావించి ముంబయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. అతడికి ప్రయాణ ఖర్చులు, శిక్షణను అందించాం. ఆ ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అతడు చురుకైన ఆటగాడని మొదట్లోనే గుర్తించాం. 2007-08లో నా అకాడమీలో చేర్చుకొన్నాను. ఏడాదిలోపే సీనియర్‌ జట్టులో స్థానం సాధించాడు. అక్కడ అన్ని అవకాశాలను అందించాం’’ అని వివరించాడు. 

యశస్విని తీర్చిదిద్దడంలో ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ పాత్ర చాలా ఉందని ఆరిఫ్‌ వెల్లడించాడు. ‘‘నేడు అతడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. దీనిని కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను. మొదట్లో చాలా శ్రద్ధగా కృషి చేసి చాలా అంశాలు నేర్చుకొన్నాడు. నాయకత్వ లక్షణాలు చూపాడు. జైస్వాల్‌లో ఏదో ప్రత్యేకత ఉంది. ఎన్నడూ భయపడి వెనక్కి తగ్గలేదు. అతడికి ‘పుల్’ ఫ్యామిలీ షాట్‌ వంటిది. దీనికి కారణం అతని సోదరుడు తేజస్వి దీనిని అద్భుతంగా ఆడతాడు. ఈ యువ ఆటగాడు కూడా త్వరలోనే ఉన్నత శిఖరాలకు చేరుకొంటాడని ఆశిస్తున్నా’’ అని సగర్వంగా చెప్పాడు. 

పరుగుల తపస్వి

యశస్వి టెస్ట్‌ కెరీర్‌ను ఘనంగా మొదలుపెట్టాడు. ఏడు మ్యాచ్‌ల్లో 861 పరుగులు సాధించాడు. వీటిల్లో రెండు ద్విశతకాలు, ఒక శతకం, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్‌పై స్వదేశంలో చెలరేగిపోయాడు. కేవలం ఆరు ఇన్నింగ్సుల్లో 545 పరుగులు చేశాడు. రెండు డబుల్‌ సెంచరీలూ ఈ సిరీస్‌లో సాధించనవే. అంతేకాదు ఇటీవల 12 సిక్సర్ల సాయంతో చేసిన 214 పరుగులతో వసీం అక్రం రికార్డును సమం చేశాడు. 

అతడు వీరూ లెఫ్ట్‌ హ్యాండ్‌ వెర్షన్‌ : కనేరియా

జైస్వాల్‌ను పాక్‌ దిగ్గజ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా పొగడ్తలతో ముంచెత్తాడు. అతడు తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ ‘‘గంగూలీ, సెహ్వాగ్‌ ప్రతిభను కలబోసినట్లు  యశస్వి ఆటతీరు ఉంటుంది. వీరూ లెఫ్ట్‌హ్యాండ్‌ వెర్షన్‌ను చూసినట్లనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ సీమర్లలో అండర్సన్‌ ఒకడు. దాదాపు 700 వికెట్లు సాధించాడు. అలాంటి ఆటగాడు వేసిన ఉచ్చును ఈ కుర్రాడు వెంటనే గ్రహించాడు. దానిని పూర్తిగా ధ్వంసం చేశాడు’’ అని అన్నాడు.  మరో యువ ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నాడని డానిష్‌ అభిప్రాయపడ్డాడు. తాను చూసిన ఉత్తమ ఇన్నింగ్స్‌ల్లో అతడిది కూడా ఒకటని పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని