పరుగుల తపస్వి

7 టెస్టులు.. 861 పరుగులు.. 71.75 సగటు.. రెండు  డబుల్‌ సెంచరీలు.. ఒక సెంచరీ.. రెండు అర్ధసెంచరీలు..  ఈ గణాంకాలు చూస్తే చాలు యశస్వి జైస్వాల్‌ టెస్టు కెరీర్‌కు ఎంత గొప్ప ఆరంభం దక్కిందో చెప్పడానికి.

Updated : 20 Feb 2024 03:47 IST

ఈనాడు క్రీడావిభాగం

‘‘ఇంగ్లాండ్‌కు బజ్‌బాల్‌ ఉంటే.. ఇండియాకు విరాట్‌బాల్‌ ఉంది’’
టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్యలివి.
విరాట్‌ కోహ్లి ఉన్నాడు కాబట్టి ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భారత బ్యాటింగ్‌కు ఢోకా లేదని ధీమాగా చెప్పాడు. కానీ విరాట్‌ అనూహ్యంగా సిరీస్‌కు దూరమయ్యాడు. మరి భారత బ్యాటింగ్‌ భారాన్ని మోసేదెవరు? జట్టుకు భరోసానిచ్చేదెవరు?
ఈ ప్రశ్నకు సమాధానం.. యశస్వి జైస్వాల్‌!
సిరీస్‌లో కోహ్లి లాంటి సూపర్‌స్టార్‌ లేని లోటును భర్తీ చేయడమే కాదు.. కోహ్లి తర్వాత అంతటి స్థాయిని అందుకోగల సత్తా ఉన్న బ్యాటర్‌గా దిగ్గజాల కితాబులందుకుంటున్నాడు ఈ యువ బ్యాటర్‌. టెస్టుల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి యశస్వి పరుగుల ప్రవాహం చూస్తుంటే ఈ అంచనాలు అతిగా అనిపించవు.

7 టెస్టులు.. 861 పరుగులు.. 71.75 సగటు.. రెండు  డబుల్‌ సెంచరీలు.. ఒక సెంచరీ.. రెండు అర్ధసెంచరీలు..  ఈ గణాంకాలు చూస్తే చాలు యశస్వి జైస్వాల్‌ టెస్టు కెరీర్‌కు ఎంత గొప్ప ఆరంభం దక్కిందో చెప్పడానికి. ఇవేమీ అంత అనుకూల పరిస్థితుల్లో చేసిన పరుగులు కావు. అతడి అరంగేట్రమే పేస్‌ పిచ్‌లకు నెలవైన వెస్టిండీస్‌లో జరిగింది. కరీబియన్‌ జట్టులో ఒకప్పటిలా భీకర బౌలర్లు లేకపోవచ్చు. కానీ అరంగేట్రమే వేరే దేశంలో, అది కూడా పేస్‌కు అనుకూలించే పిచ్‌పై చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లోనే 171 పరుగులు చేయడం మామూలు విషయం కాదు. ఇక వర్తమానంలోకి వస్తే.. ఇంగ్లాండ్‌ లాంటి మేటి జట్టుపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు ద్విశతకాలు సాధించడం అసామాన్యం. ఈ సిరీస్‌లో యశస్వికి దరిదాపుల్లో నిలిచే బ్యాటర్‌ రెండు జట్లలో ఎవరూ కనిపించడం లేదు. పిచ్‌ ఎలా ఉన్నా.. పేస్‌, స్పిన్‌ అని తేడా లేకుండా ఎలాంటి బౌలర్‌నైనా అలవోకగా ఎదుర్కొంటున్నాడు యశస్వి. అతడి ఆట చూస్తుంటే బ్యాటింగ్‌ ఇంత తేలికా అనిపిస్తోంది. అతను సంప్రదాయ షాట్లను ఎంత అందంగా ఆడతాడో.. టీ20 మార్కు వినూత్న షాట్లనూ అంతే అలవోకగా కొట్టగలడు. రాజ్‌కోట్‌లో అతను ఎలా సిక్సర్ల మోత మోగించాడో తెలిసిందే. అండర్సన్‌ లాంటి దిగ్గజాన్ని గల్లీ బౌలర్‌గా మారుస్తూ.. రాజ్‌కోట్‌లో అతను ఒకే ఓవర్లో మూడు కళ్లు చెదిరే సిక్సర్లు బాదిన తీరు చూస్తే ఔరా అనకుండా ఉండలేం.

టెస్టుల్లో ఓపెనింగ్‌ చేయడమంటే ఆషామాషీ విషయం కాదు. పిచ్‌, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియకుండా క్రీజులోకి దిగి కొత్త బంతి బౌలర్లను ఎదుర్కోవడం అనుభవజ్ఞులకూ సవాలే. అలాంటిది ఈ మధ్యే జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల యశస్వి ఎంతో పరిణతితో కొత్త బంతిని ఎదుర్కొంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అవసరానికి తగ్గట్లు డిఫెన్స్‌ ఆడుతూనే.. క్రీజులో కుదురుకున్నాక చక్కటి స్ట్రోక్‌ప్లేతో అలరిస్తున్నాడు. అతడి పరుగుల దాహం గురించి ఇప్పుడందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక మైలురాయి అందుకోగానే అలక్ష్యంతో వికెట్‌ పారేసుకోవట్లేదు జైస్వాల్‌. 50ని 100గా.. 100ను 150గా.. 150ని 200గా మలిచేందుకు పట్టుదల ప్రదర్శిస్తున్నాడు. రాజ్‌కోట్‌లో మూడో రోజు సెంచరీ తర్వాత వెన్ను నొప్పితో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన అతను.. తర్వాతి రోజు తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి డబుల్‌ సెంచరీని పూర్తి చేశాడు. ఈ టీ20 యుగంలో ఇంత ఓపికతో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే ఆటగాళ్లు అరుదు. అందుకే యశస్విని ప్రత్యేకమైన బ్యాటర్‌గా భావిస్తున్నారు మాజీలు, విశ్లేషకులు. బజ్‌బాల్‌ వ్యూహంతో అన్ని జట్లనూ దెబ్బ కొట్టిన ఇంగ్లాండ్‌.. ప్రస్తుత సిరీస్‌లో యశస్వి ధాటిని తట్టుకోలేకపోతోంది. ఈ సిరీస్‌లో అతడి ఆట చూసి అబ్బురపడ్డ ఇంగ్లాండ్‌ మాజీ స్టార్‌ కెవిన్‌ పీటర్సన్‌.. యశస్వి ఎక్కడైనా సెంచరీ కొట్టగలడని, భవిష్యత్తులో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకుంటాడని వ్యాఖ్యానించాడు.

అదే పోరాట స్ఫూర్తి..

యశస్వి నేపథ్యం తెలిస్తే అతను ఇప్పుడున్న స్థాయి ఆశ్చర్యం కలిగిస్తుంది. అతను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక పేద కుటుంబంలో పుట్టాడు. చిన్న వయసులో క్రికెట్‌ కోసం తండ్రి దగ్గర దెబ్బలు తిని.. చివరికి ఆ తండ్రిని ఒప్పించి ఈ ఆట కోసమే కట్టుబట్టలతో ముంబయికి చేరుకున్నాడు. అక్కడ చేతిలో డబ్బులు లేక అతను పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఒక టెంట్లో పడుకుని అవకాశం వచ్చినపుడు క్రికెట్‌ సాధన చేయడం, సాయంత్రం పూట పానీపూరి బండి దగ్గర పని చేయడం.. ఇలా సాగింది అతడి ప్రయాణం. లక్షలమంది ప్రొఫెషనల్‌ క్రికెటర్లున్న దేశంలో కోట్లు ఖర్చు పెట్టినా ఒక అంతర్జాతీయ క్రికెటర్‌ను తయారు చేయడం తేలిక కాదు. అలాంటిది ఇలాంటి నేపథ్యం ఉన్న యశస్వి.. టీమ్‌ఇండియా వరకు వచ్చాడంటే ఎంత కసితో కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌లో పేరు సంపాదించి.. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ వరకు రాలేకపోయినా, వచ్చినా నిలకడ లేక చోటు కోల్పోయిన కుర్రాళ్లు ఎందరో. కానీ యశస్వి ఆ జాబితాలో చేరలేదు. నిరంతరం మెరుగుపడేందుకు కష్టపడుతున్నాడు. బలహీనతలను అధిగమించేందుకు కసరత్తు చేస్తున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో ఓ మ్యాచ్‌ సందర్భంగా జైపుర్‌కు వెళ్లిన ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ.. యశస్వి మధ్యాహ్నం తర్వాత మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు సాధన చేయడం చూసి ఆశ్చర్యపోయాడట. చిన్నతనం నుంచి కష్టాలకు ఎదురొడ్డి లక్ష్య సాధన కోసం అడుగులు వేయడంలో చూపించిన పోరాట స్ఫూర్తే ఇప్పుడు యశస్వి ఆటలోనూ ప్రతిఫలిస్తోంది. అందుకే అతను అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగతున్నాడు.

బహు పరాక్‌

ఇప్పటిదాకా యశస్వి ప్రయాణం అద్భుతం. అతడి ప్రదర్శన అసామాన్యం. అయితే ఇక నుంచే అతను జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. కెరీర్‌ ఆరంభంలో గొప్ప ప్రదర్శన చేసి ఆ తర్వాత చూస్తుండగానే కనుమరుగైపోయిన క్రికెటర్లు ఎందరో. ఇందుకు వినోద్‌ కాంబ్లి లాంటి ఎంతోమంది ఉదాహరణగా కనిపిసారు. యశస్వి కంటే ముందు అంచనాలు రేకెత్తించిన పృథ్వీ షా.. ఇప్పుడు టీమ్‌ఇండియా ఛాయల్లో లేడు. చిన్న వయసులో వచ్చే పేరు ప్రఖ్యాతులతో పొగరు తలకెక్కించుకుని దెబ్బ తినేవాళ్లు కొందరు. ఆటేతర విషయాలు, ఆకర్షణలతో దృష్టి మళ్లి దారి తప్పేవాళ్లు ఇంకొందరు. ఒక స్థాయి అందుకున్నాక శ్రమ తగ్గించడం వల్ల వైఫల్యాలు చవిచూసి కనుమరుగయ్యేవాళ్లు మరికొందరు. వీటన్నింటినీ అధిగమిస్తేనే క్రికెటర్‌గా గొప్ప స్థాయిని అందుకోవడం సాధ్యమవుతుంది. సచిన్‌, కోహ్లి లాంటి మేటి ఆటగాళ్లు సహజ ప్రతిభకు శ్రమను జోడించి ఎవ్వరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నారు. వాళ్ల స్ఫూర్తితో యశస్వి కష్టాన్ని నమ్ముకుని, ఏకాగ్రతతో సాగితే కొత్త సూపర్‌ స్టార్‌గా ఎదగొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని