IND vs ENG: ఎలా ఫీల్ అవుతున్నానో చెప్పలేనన్న అశ్విన్‌.. ఎక్కడా వెనకడుగు వేయలేదు: యశస్వి జైస్వాల్

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌, 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కుల్‌దీప్‌ యాదవ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా, యశస్వి జైస్వాల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపికయ్యారు. 

Published : 09 Mar 2024 17:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో (ఆఖరి) టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (Team India) ఇన్నింగ్స్‌, 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను రోహిత్‌ సేన 4-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin)కు ఇది కెరీర్‌లో వందో టెస్టు కాగా.. మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టి చిరస్మరణీయం చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. సిరీస్‌లో అదరగొట్టిన యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు దక్కించుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం వీరు మాట్లాడారు. 

‘‘నా వందో టెస్టులో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఇప్పుడు చెప్పలేను. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు. సిరీస్‌ ఆసాంతం బంతి వేగం, బౌలింగ్‌ యాక్షన్‌లో మార్పులు చేసుకున్నా. భారతదేశం భిన్నమైనది. ప్రతీ మైదానం ఏదో ఒక సవాలు విసురుతుంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించినందుకు హ్యాపీగా ఉంది. ఈ మ్యాచ్‌, రాంచీలో రెండో ఇన్నింగ్స్‌లో ప్రదర్శన సంతృప్తినిచ్చింది. నేను ప్రయోగాలు చేస్తుంటా. వాటి గురించి వచ్చే మంచి ఫీడ్‌బ్యాక్‌ని స్వీకరిస్తా. ప్రయత్నిస్తే తప్ప నేర్చుకోలేను. ఏదైనా ప్రయత్నించగలనని నాకు నమ్మకం ఉంటే,  వెనక్కి తగ్గను. కొత్త ప్రయోగాలు చేయడం, నిరంతరం నేర్చుకోవడం నాకు ఎంతో ఉపయోగపడింది. కొత్త బంతితో ఈ రోజు నాకు కొంత బౌన్స్ లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ దానిని సద్వినియోగం చేసుకోగలిగాడు. కుల్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతని చేతుల్లోంచి బంతి వస్తున్న తీరు నమ్మశక్యంగా లేదు’’- అశ్విన్‌

‘‘నేను ఇప్పటివరకు ఆడిన సిరీస్‌ల్లో నా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇదే. గత కొన్నాళ్లుగా నేను కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతోంది. రాంచీ టెస్టులో బాగా బౌలింగ్ చేశాను.  అక్కడ బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతంగా ఉంది. రాంచీలో స్టోక్స్, జాక్‌ క్రాలీలను ఔట్‌ చేయడం ఆనందాన్నిచ్చింది. గుడ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయడంపై ఫోకస్‌ పెడతాను. ఈ ఫార్మాట్‌లో స్పిన్నర్‌కు ఇది చాలా ముఖ్యం.  బ్యాటర్ ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే దాని గురించి ఎక్కువగా ఆలోచించను. నా రిథమ్ నాకు బాగా నచ్చింది. బ్యాటింగ్‌లో నా వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ బ్యాటింగ్ కోచ్‌కి దక్కుతుంది’’- కుల్‌దీప్‌ యాదవ్‌ 

‘‘సిరీస్‌ను నిజంగా ఆస్వాదించాను. సిరీస్ అంతటా నేను ఆడిన తీరుతో సంతోషంగా ఉన్నాను. నేను ఒక బౌలర్‌ను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తే అతడి బౌలింగ్‌లో బాదడం మొదలెడతా. అదే ప్లాన్ అమలుచేశా. ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రతీ మ్యాచ్‌లో ఒకేలా ఆడకుండా ఒక్కో మ్యాచ్‌లో ఆ సమయానికి తగినట్టుగా ఆడేందుకు ప్రయత్నిస్తా. జట్టు గెలవడానికి నేను ఎలాంటి పాత్ర పోషించాలనే దాని గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తా’’- యశస్వి జైస్వాల్ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని