ODI WC 2023: పడితేనే గెలిచేది.. ప్రపంచకప్‌లో ఫీల్డింగే కీలకం!

క్రికెట్‌లో ఒక్క క్యాచ్‌ చేజారినా.. మిస్‌ ఫీల్డింగ్‌ అయినా ఫలితమే తారుమారయ్యే ప్రమాదం ఉంది. అలాంటిది వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఫీల్డింగ్‌ కీలక  పాత్ర పోషించనుంది. 

Published : 05 Oct 2023 14:22 IST

‘క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌’ అనేది క్రికెట్లో ప్రాచుర్యంలో ఉన్న నానుడి. పెద్ద టోర్నీల్లో ఈ మాట అక్షర సత్యం. ఎందుకంటే కీలక సమయాల్లో క్యాచ్‌లు నేలపాలు చేసి మ్యాచ్‌లే పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ ఫీల్డింగ్‌ కీలకపాత్ర పోషించనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌ కూడా ఫీల్డింగ్‌లో మెరుగ్గా ఉంది. 

జాంటీ రోడ్స్‌ గుర్తున్నాడా!

1992 వన్డే ప్రపంచకప్‌ పేరు ఎత్తితే జాంటీ రోడ్సే గుర్తొస్తాడు. ఈ దక్షిణాఫ్రికా స్టార్‌ వేసిన ముద్ర అలాంటిది. అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలతో ‘గాల్లోకి ఎగురుతోంది మనిషా పక్షా’ అన్న అనుమానాన్ని కలిగించిన టాప్‌ ఫీల్డర్‌ అతడు. ఈ కప్‌లోనే పాకిస్థాన్‌ స్టార్‌ ఇంజమామూల్‌ హక్‌ను రనౌట్‌ చేసిన తీరు ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే వాల్‌ పేపర్లలో అప్పుడు రోడ్స్‌ గాల్లోకి ఎగిరి ఫుల్‌ లెంగ్త్‌ డైవ్‌ చేసిన ఫొటోనే ప్రపంచకప్‌కు ప్రచార చిత్రంగా వాడేవాళ్లు. ఆ తర్వాత ఎందరో  ఫీల్డర్లు వచ్చినా రోడ్స్‌ను మించలేకపోయారు. అతడిని ఆదర్శంగా తీసుకుని దక్షిణాఫ్రికాలో చాలామంది మెరుపు ఫీల్డర్లు వచ్చారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ జట్టు ఇప్పటిదాకా ప్రపంచకప్‌ను ముద్దాడలేకపోయింది. 

మనోళ్లూ తక్కువేం కాదు

గత పదేళ్లలో భారత క్రికెట్‌ ఫీల్డింగ్‌ ప్రమాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి భారత ఫీల్డర్లకు ఆదర్శంగా మారిపోయాడు. అద్భుతమైన ఫిట్‌నెస్‌కు మారుపేరైన విరాట్‌.. ఎన్నో సంచలన క్యాచ్‌లు పట్టాడు. మెరుపు విన్యాసాలతో రనౌట్లు చేశాడు. ఇక భారత ఫీల్డింగ్‌లో ర్యాంకింగ్స్‌ ఇస్తే మాత్రం రవీంద్ర జడేజాదే అగ్రస్థానం. యువరాజ్‌సింగ్, సురేశ్‌ రైనా తర్వాత జట్టులో మెరుపు ఫీల్డర్‌గా జడేజానే పేరు దక్కించుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాల్సిన బాధ్యత ఈ ఆల్‌రౌండర్‌పై ఉంది. ముఖ్యంగా ఎంతో కఠినంగా ఉండే యోయో టెస్టులు పెట్టి జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో మైదానంలో మన ఫీల్డర్లు చురుగ్గా కదులుతున్నారు. అదిరే క్యాచ్‌లు పడుతున్నారు. రవిచంద్రన్‌ అశ్విన్, మహ్మద్‌ సిరాజ్‌ లాంటి ఒకటి రెండు వీక్‌ లింక్‌లు ఉన్నా.. ఫీల్డింగ్‌లో భారత్‌ది మంచి జట్టే. మరి ప్రపంచకప్‌లో ఈ విభాగంలో మనోళ్లు ఎలా రాణిస్తారో చూడాలి.

వీళ్లను ఓ కంట కనిపెట్టండి

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా), స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా), డేవిడ్‌ మిల్లర్‌ (దక్షిణాఫ్రికా), బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లాండ్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌), ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌), జో రూట్‌ (ఇంగ్లాండ్‌), శాంట్నర్‌ (న్యూజిలాండ్‌), షాదాబ్‌ఖాన్‌ (పాకిస్థాన్‌) మెరుపు ఫీల్డర్ల జాబితాలో ఉన్నారు. బౌండరీ లైన్‌ దగ్గర మెరుపు వేగంతో ఫీల్డింగ్‌ చేస్తూ చాలా పరుగులు ఆపుతాడు మ్యాక్స్‌వెల్‌. ఇక స్లిప్, కవర్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌లతో అదరగొడతాడు. మిల్లర్, స్టోక్స్, ఫిలిప్స్‌ గ్రౌండ్‌ ఫీల్డింగ్‌ చూస్తే కళ్లు చెదరాల్సిందే. ఒంటి చేత్తో వీళ్లు అందుకున్న మెరుపు క్యాచ్‌లు చాలానే ఉన్నాయి. గత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ ఫెలుక్వాయో క్యాచ్‌ను బౌండరీ లైన్‌ దగ్గర స్టోక్స్‌ అందుకున్న తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక తన బౌలింగ్‌లోనే బౌల్ట్, శాంట్నర్‌ కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. రూట్‌ కూడా మంచి స్లిప్‌ ఫీల్డర్‌. తొలి 15 ఓవర్లలో అతడు కీలకంగా ఉంటాడు. చెత్త ఫీల్డింగ్‌ అంటే గుర్తొచ్చే జట్టు పాకిస్థాన్‌. చాలా తేలికైన క్యాచ్‌లను కూడా నేలపాలు చేస్తుంటుందీ జట్టు. కానీ ఆ జట్టు స్పిన్నర్‌ షాదాబ్‌ఖాన్‌ సహచరులకు భిన్నం. మెరుపు ఫీల్డింగ్‌ చేయడంతో పాటు కొన్ని స్టన్నింగ్‌ క్యాచ్‌లు పడుతుంటాడు. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని