Delhi Vs Kolkata: భారీ స్కోరు రికార్డు మిస్.. కానీ, ఐపీఎల్‌లో కోల్‌కతా అరుదైన ఘనత

ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా దూసుకుపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ వరుస విజయాలను నమోదు చేస్తోంది.

Published : 04 Apr 2024 10:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌ పాయింట్ల పట్టికలో  కోల్‌కతా అగ్రస్థానానికి చేరుకుంది. దిల్లీపై 106 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. దీంతో రాజస్థాన్‌ (6)ను వెనక్కి నెట్టి నెట్‌రన్‌రేట్‌ కారణంగా కోల్‌కతా తొలి స్థానం దక్కించుకుంది. ఐపీఎల్‌లో రెండో అత్యుత్తమ స్కోరు సాధించిన జట్టుగానూ నిలిచింది. హైదరాబాద్‌ రికార్డును (277) అధిగమించే అవకాశం చేజార్చుకుంది. ఇదే క్రమంలో ఒక ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లను గెలవడం కోల్‌కతాకు ఇదే తొలిసారి కావడం విశేషం. బయటి వేదికల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా కోల్‌కతా రికార్డు సృష్టించింది. ఈ విజయంలో సునీల్ నరైన్‌ (85: 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

‘‘క్రికెట్‌లో బ్యాటింగ్‌ చాలా కీలకం. బ్యాట్‌తోనూ భాగస్వామ్యం అందించడం బాగుంది. కానీ బౌలింగ్‌ చేయడాన్నే ఎక్కువగా ఆస్వాదిస్తా. నేను బ్యాటింగ్‌ సమావేశాలకు హాజరు కానని మా వాళ్లు జోక్‌ చేస్తుంటారు. బౌలర్‌గా ఎక్కువ పాత్ర పోషించడానికే ఆసక్తి చూపిస్తా. అబుదాబి నైట్‌రైడర్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగడానికి కారణముంది. ఆ జట్టులో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి, నా అవసరం లేదక్కడ. కోల్‌కతా జట్టుకు మాత్రం ఓపెనర్‌గా రావాలని సూచించారు. దీంతో ఇక్కడ బ్యాటింగ్‌కు వస్తున్నా. ఫిలిప్ సాల్ట్ చాలా దూకుడుగా ఆడే బ్యాటర్. దీంతో నాపై పెద్దగా ఒత్తిడి లేకుండా పోయింది. ఇప్పుడు మేం భారీ తేడాతో గెలవడం టోర్నీలో మున్ముందు కీలకంగా మారే అవకాశం ఉంది’’ అని నరైన్‌ వ్యాఖ్యానించాడు. 

వర్కౌట్‌లో పెద్ద మార్పుల్లేవు: మిచెల్ స్టార్క్

ఐపీఎల్‌ మినీ వేలంలో భారీ మొత్తం వెచ్చించి మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్‌ తీయలేదు. వైజాగ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌ కోసం ప్రత్యేకంగా ఎలాంటి వర్కౌట్‌ చేయలేదు. టీ20ల్లో ఒక్కోసారి కలిసిరాదు. కొన్నిసార్లు క్యాచ్‌లు డ్రాప్‌ కావడం, బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుని వెళ్లిపోవడం జరుగుతుంటాయి.  ప్రస్తుతం మేం 3-0తో ఉన్నాం. భారీ మొత్తం దక్కించుకున్నాక వికెట్లు తీయలేదనే ఒత్తిడి నాపై లేదు. టీ20ల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాస్త అదృష్టం కూడా కలిసిరావాలి. మార్ష్, డేవిడ్ వార్నర్ వికెట్లను తీయడం భలేగా ఉంది. వైభవ్‌ అరోరా షార్ట్‌ బంతులతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌ మీటింగుల్లో, ట్రైనింగ్‌ సెషన్స్‌లో ఎక్కువగా ఇలాంటి బంతులపైనే చర్చించుకుంటాం’’ అని స్టార్క్‌ తెలిపాడు. 

మరికొన్ని విశేషాలు..

  • ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులను అందుకొన్న క్రికెటర్లలో ఆండ్రి రస్సెల్‌ (14)తో సమంగా సునీల్‌ నరైన్ నిలిచాడు. వీరిద్దరి తర్వాత మాజీ కెప్టెన్ గౌతమ్‌ గంభీర్‌ (10), యూసఫ్‌ పఠాన్ (7) ఉన్నారు. 
  • ఐపీఎల్‌లో కోల్‌కతాకు భారీ విజయాల్లో ఇది రెండోది. ఇప్పుడు దిల్లీపై 106 పరుగుల తేడాతో గెలవగా.. బెంగళూరుపై 2008 సీజన్‌లో 140 పరుగుల తేడాతో కోల్‌కతా ఘన విజయం సాధించింది.
  • పరుగుల పరంగా దిల్లీకిది రెండో భారీ ఓటమి. 2017 సీజన్‌లో ముంబయి చేతిలో 145 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. వైజాగ్‌లో దిల్లీ ఆడిన 7 మ్యాచుల్లో నాలుగో ఓటమి.
  • ఐపీఎల్‌లో 100+ మార్జిన్‌తో కోల్‌కతా రెండు మ్యాచుల్లో విజయాలు నమోదు చేయగా.. బెంగళూరు 4 మ్యాచుల్లో గెలిచింది.
  • కోల్‌కతా ఒక ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా తొలి మూడు మ్యాచుల్లో గెలవడం ఇదే మొదటిసారి. అలాగే 2022 తర్వాత దిల్లీపై కోల్‌కతాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని