Ajit Agarkar: చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌.. ఎంపికకు కారణాలు ఇవేనా..?

టీమ్‌ఇండియా (Team India) మాజీ పేస్‌ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్‌కు (Ajit Agarkar) కీలక పదవి దక్కింది. అయితే అందుకుగల కారణాలు ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.. 

Updated : 05 Jul 2023 17:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ అజిత్‌ అగార్కర్‌కు (Ajit Agarkar) సెలక్షన్ కమిటీ చీఫ్‌ పదవి దక్కింది. చేతన్ శర్మ రాజీనామా నేపథ్యంలో ఎవరు వస్తారా..? అనే ఎదురు చూపులకు బీసీసీఐ (BCCI) తెరదించింది. వీరేంద్ర సెహ్వాగ్‌ పేరు విసృతంగా వినిపించినప్పటికీ.. అనూహ్యంగా అజిత్‌ అగార్కర్‌ రేసులోకి వచ్చాడు. అతడిని చీఫ్‌ సెలక్టర్‌గా బీసీసీఐ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టును అగార్కర్‌ నేతృత్వంలోని కమిటీనే ప్రకటించాల్సి ఉంది. ఆసియా కప్‌, వన్డే ప్రపంచ కప్‌ వంటి టోర్నీలు ఉన్న నేపథ్యంలో కీలమైన పోస్టుకు అగార్కర్‌ను ఎంపిక చేసుకోవడానికిగల కారణాలను ఓసారి పరిశీలిద్దాం..

యువ అభ్యర్థిత్వం: ఈసారి చీఫ్ సెలక్టర్‌గా యువ అభ్యర్థిత్వం వైపు బీసీసీఐ మొగ్గు చూపింది. రాబోయే కాలంలో వన్డే ప్రపంచ కప్‌తోపాటు టీ20 వరల్డ్‌ కప్‌ జట్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో టీ20లు ఆడిన  అనుభవం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అజిత్‌ పేరును ఆమోదించింది.

అనుభవం: కేవలం మ్యాచ్‌ల అనుభవమే కాకుండా.. గతంలో ఏదైనా జట్టుకు కోచ్‌ లేదా సెలక్షన్‌ కమిటీలో పని చేసిన అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం విశేషం. అగార్కర్‌ గతంలో ముంబయి జట్టుకు చీఫ్‌ సెలక్టర్‌గా పని చేశాడు. ఐపీఎల్‌లో దిల్లీకి సహాయక కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 

క్రికెట్ విశ్లేషకుడు: ఆటపట్ల పూర్తి అవగాహన కలిగిన అజిత్‌ అగర్కార్‌కు క్రికెట్ విశ్లేషకుడిగా అనుభవం ఉంది. ఆటను నిశితంగా పరిశీలిస్తాడు. భారత్ తరఫున  మూడు ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు, 1,800కిపైగా పరుగులు చేసిన అగార్కర్‌కు అన్ని విభాగాలపై పట్టు ఉంది. ఆటగాళ్ల బలాబలాలను అంచనా వేయడంలో దిట్ట. 

వేతన భత్యాలు: చీఫ్ సెలక్టర్‌గా ఎంపికైన అభ్యర్థికి ప్రస్తుతం రూ. కోటి వేతనం ఉంటుంది. అయితే, స్టార్ మాజీ ఆటగాళ్లకు ఇది చాలా తక్కువే. క్రికెట్ విశ్లేషకుడు, వ్యాఖ్యాతగా అంతకంటే ఎక్కువే అగార్కర్‌ సంపాదన ఉంటుంది. దీంతో వేతన ప్యాకేజ్‌ను  రూ. 3 కోట్లకు పెంచేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. 

అతడొక్కడే: ఖాళీగా ఉన్న సెలక్టర్‌ పదవి కోసం అగార్కర్‌ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో క్రికెట్ సలహా కమిటీ అగార్కర్‌ను మాత్రమే ఇంటర్వ్యూ చేసింది. అతడి అనుభవం, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని చీఫ్ సెలెక్టర్‌ పదవిని బీసీసీఐ అప్పగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని