Rinku Singh to Ireland : బిజినెస్‌ క్లాస్‌లో తొలిసారి ప్రయాణం.. రింకు సింగ్‌ రియాక్షన్‌ ఏంటంటే?

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో సంచలనంగా మారిన రింకు సింగ్ (Rinku Singh) ఐర్లాండ్‌ పర్యటనకు ఎంపికైన సంగతి తెలిసిందే. భారత జట్టుతో కలిసి తొలిసారి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించి ఐర్లాండ్‌కు చేరుకున్నాడు.

Updated : 18 Aug 2023 11:34 IST

ఇంటర్నెట్ డెస్క్: జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని టీమ్‌ఇండియా (Team India) మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు ఐర్లాండ్‌కు (IRE vs IND) చేరుకున్న సంగతి తెలిసిందే. నేడు తొలి మ్యాచ్‌ ‘ది విలేజ్‌’ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ఎక్కువగా యువ క్రికెటర్లతో కూడిన జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకు సింగ్‌, జితేశ్ శర్మ, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె తదితరులు ఐర్లాండ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా రింకు తొలిసారి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించడంపై భావోద్వేగానికి గురయ్యాడు. ఇదే విషయంపై మరో యువ క్రికెటర్‌ జితేశ్ శర్మతో సంభాషించిన వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. జితేశ్‌, రింకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే డెబ్యూ చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఒకేసారి అరంగేట్రం చేసే అవకాశం రానుండటం గమనార్హం. రింకు, జితేశ్ సంభాషణకు సంబంధించిన టీజర్‌ను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో (ప్రస్తుతం ఎక్స్‌) పోస్టు చేసింది.

ఎప్పుడొస్తావ్‌ పంత్‌.. పునరాగమనంపై అభిమానుల్లో ఉత్కంఠ!

‘‘ప్రతి ఆటగాడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటాడు. నోయిడాలో నా స్నేహితులతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు జట్టులోకి ఎంపికైన విషయం తెలిసింది. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పా. క్రికెటర్‌గా ఎదగడంలో మా కుటుంబం పాత్ర చాలా కీలకం. జట్టుకు ఎంపికైన తర్వాత నా పేరుతో ఉన్న జెర్సీని, నంబర్‌ను చూసిన తర్వాత ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దీని కోసమే చాలా కష్టపడ్డా’’ అని రింకు చెప్పాడు. 

ఇద్దరం ఒకేసారి.. 

‘‘జితేశ్‌ శర్మ, నేను ఒకేసారి పదేళ్ల కిందట సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలోకి అడుగు పెట్టాం. ఇప్పుడు జాతీయ జట్టులోకి కూడా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. అదే విధంగా ఈ ఐర్లాండ్‌ పర్యటనలో ఇంగ్లిష్‌ విషయంలో నాకు సాయంగా ఉంటాడు (నవ్వుతూ). మేమిద్దరం తొలిసారి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించాం. ఇందులోని సదుపాయాల గురించి తెలుసుకోవడం కాస్త కష్టంగానే అనిపించింది. తుది జట్టులో అవకాశం లభిస్తే భారత్ విజయం కోసం వందశాతం ప్రయత్నిస్తా. జట్టులోని ప్రతి ఒక్కరితో మాట్లాడా. వారంతా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆడాలని చెప్పారు.  అయితే ఇంగ్లిష్‌లో ఇంటర్వ్యూ ఇవ్వడమే నేను ఒత్తిడిగా భావిస్తానని సంజూ భాయ్‌తో చెప్పా’’ అని రింకు సింగ్‌ వ్యాఖ్యానించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని