Zimbabwe: మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం

జింబాబ్వే మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. 

Updated : 25 Apr 2024 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జింబాబ్వేకు చెందిన ఓ మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి చేయగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని పెంపుడు శునకం కాపాడింది. ఈ ఘటనను వివరిస్తూ ఇటీవల ఆయన సతీమణీ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. 

జింబాబ్వే (Zimbabwe)కి చెందిన 51 ఏళ్ల మాజీ ఆల్‌ రౌండర్‌ గై విట్టాల్‌ (Guy Whittall) ఇటీవల హ్యూమని ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. తనతో పాటు పెంపుడు శునకం చికారాను కూడా తీసుకెళ్లాడు. పర్వతారోహణ సమయంలో హఠాత్తుగా ఓ చిరుత విట్టాల్‌పై దాడి చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన చికారా యజమానిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో అది కూడా తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నా పోరాడి విట్టాల్‌ను రక్షించింది. చిరుతను తరిమికొట్టింది. ఈ ఘటనలో విట్టాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్‌ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్

వెంటనే విట్టాల్‌, చికారాను విమానంలో ఆస్పత్రికి తరలించారు. ఆ మూగజీవం కోలుకుంటోంది. తీవ్ర గాయాల కారణంగా విట్టాల్‌కు శస్త్రచికిత్స జరిగింది. అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు భార్య హన్నా స్టూక్స్ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. గతంలోనూ ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకొంది. 2013లో విట్టాల్‌ ఇంట్లోకి పెద్ద మొసలి చొరబడి మంచం కిందకు వెళ్లింది. ఆ విషయాన్ని ముందుగానే గమనించడంతో అతడికి ప్రాణాపాయం తప్పినట్లు ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని