Hardik Pandya: మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్‌ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్

హార్దిక్‌పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్‌కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు.

Updated : 25 Apr 2024 12:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్యపై (Hardik Pandya) విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. మ్యాచుల సందర్భంగానూ ప్రేక్షకులు అతడిని హేళన చేశారు. ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్ తీరును తప్పుబట్టారు. అయినా ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ మాజీ స్టార్ వసీమ్‌ అక్రమ్ తీవ్రంగా స్పందించాడు. మన దగ్గర అభిమానులు ఇలాంటి వాటిని ఎప్పటికీ మరిచిపోరని.. వారి పిల్లలకూ చెబుతుంటారని అక్రమ్‌ వ్యాఖ్యానించాడు. ఇకనైనా నిశ్శబ్దంగా ఉండాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు. 

‘‘హార్దిక్‌ విషయంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆందోళనకరంగా మారింది. భారత్, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో ఓ సమస్య ఉంది. ఏ విషయాన్ని మనం మరిచిపోం. హార్దిక్‌ పాండ్యకు కొడుకు ఎప్పుడు పుట్టాడు, 20 ఏళ్ల కిందట అతడు ఎలా కెప్టెన్‌ అయ్యాడనే విషయాలను మన పిల్లలకూ చెబుతాం. ఇక నుంచైనా అభిమానులు నిశ్శబ్దంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతడు ఇక్కడి ఆటగాడు. ముంబయి జట్టుకు ఆడాడు. మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నించే ఓ ప్లేయర్‌. ఇప్పటికీ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ముంబయికి అవకాశం ఉంది. సొంత ఆటగాడిని హేళన చేయడానికి మరే పాయింట్ మీ దగ్గర (ఫ్యాన్స్‌ను ఉద్దేశించి) లేదు. ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ఇకనైనా వాటిని వదిలేసి ముందుకు సాగాలి. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పులు సహజం. చెన్నైనే తీసుకోండి. అక్కడా సారథి మారాడు. సుదీర్ఘ కాలం జట్టును నడిపించడానికి అవసరమైన ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయాలు ఉంటాయి. ముంబయి కూడా అలానే చేసి ఉండొచ్చు. అక్కడ వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు ఉండవు. అయితే, నా వరకు మాత్రం రోహిత్‌ను మరో ఏడాదిపాటు కొనసాగిస్తే బాగుండేది. వచ్చే సీజన్‌లో పాండ్యను కెప్టెన్‌గా చేస్తే సరిపోయేది. అప్పుడు ఎలాంటి వివాదమూ వచ్చి ఉండేది కాదు’’ అని అక్రమ్‌ తెలిపాడు. 

పాండ్య మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు: ఉతప్ప

‘‘పాండ్య ఫిట్‌నెస్‌ గురించి హేళనలు, ట్రోలింగ్, మీమ్స్‌ చాలా వచ్చాయి. ఇవి అతడిని బాధించవని మీరు (ఫ్యాన్స్‌) భావిస్తున్నారా? తప్పకుండా హర్ట్‌ చేస్తాయి. అసలు ఎంత మందికి అతడి ఫిట్‌నెస్‌ గురించి కరెక్ట్‌గా తెలుసు? ఇప్పుడు హార్దిక్‌ మానసిక సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నాడు. భారతీయులుగా మనకు చాలా భావోద్వేగాలు ఉంటాయి. అయితే, మరొకరిపై ఇలాంటి వైఖరి ప్రదర్శించడం సరైంది కాదు. ఓ వ్యక్తిని అవమానిస్తూ నవ్వుకోవడం, మీమ్స్‌తో విమర్శించడం ఆపేయాలి’’ అని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని