Team India: మరో కోహ్లీ కావాల్సిందే.. లేదంటే తయారు చేయాల్సిందే!

Who is next kohli: టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి టీమ్‌ ఇండియా మరో ప్లేయర్‌ను రెడీ చేయకతప్పదు. ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. 

Updated : 27 Feb 2024 10:31 IST

టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో ఓ పేరు ఉంటే... ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. అదే విరాట్‌ కోహ్లీ. టెస్టుల్లో చాలా ఏళ్లుగా నాలుగో స్థానం(సెకండ్‌ డౌన్‌)లో బ్యాటింగ్‌కి దిగి జట్టును విజయ పథాన నడిపించాడు. అయితే ఆ స్థానంలో నిలకడగా ఆడే మరో ప్లేయర్‌ దొరకడం లేదు. ఎవరైనా కుదురుకొని కొన్నాళ్లు ఆడినా.. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. దీంతో ‘నాలుగులో ఎవరు?’ అనే ప్రశ్న అభిమానుల్ని తొలిచేస్తోంది. 

ఇదీ కోహ్లీ అంటే...

145 ఇన్నింగ్స్‌ల్లో 7303 పరుగులు. అందులో 25 సెంచరీలు, 21 అర్ధసెంచరీలు. టెస్టుల్లో నాలుగో స్థానంలో ఆడి విరాట్‌ కోహ్లీ (Virat Kohli) సాధించిన గణాంకాలివి. ఆటగాడి నాణ్యతను లెక్కించడానికి, ఆ స్థానం విలువ చెప్పడానికి ఇవి చాలు. చాలా ఏళ్లుగా కోహ్లీ ఇదే స్థానంలో ఆడుతున్నాడు. కానీ, ఇంగ్లాండ్‌తో టెస్టుకు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. దీంతో ఆ ప్లేస్‌ని భర్తీ చేయడానికి టీమ్‌ ఇండియా మూడు ప్రయత్నాలు చేసింది. అందులో ఒకటి తప్ప మిగిలిన రెండూ విఫలమయ్యాయి. దీంతో ‘నాలుగు కోసం మరో కోహ్లీ కావాలి’ అనే పరిస్థితి వచ్చింది. 

ముగ్గురు వచ్చారు కానీ..

ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో.. తొలి టెస్టులో నాలుగో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) వచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్‌లో (22) నిరాశపరిచాడు. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమవ్వడంతో ఆ ప్లేస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) వచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 27, 29 పరుగులతో నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు అయ్యర్‌ దూరమవుతాడు అనే వార్తలొచ్చాయి. అదే సమయంలో గాయపడటంతో కొత్త కుర్రాడు రజత్‌ పటీదార్‌ (Rajat Patidar)ను తీసుకొచ్చారు. మూడు, నాలుగు టెస్టుల్లో రజత్‌ నంబర్‌-4గా బ్యాటింగ్‌కు దిగినా.. ఏమంత ఆకట్టుకోలేకపోయాడు. అతని స్కోర్లు వరుసగా 5, 0, 17, 0. దీంతో ఐదో మ్యాచ్‌కు కష్టమే. ఇచ్చిన రెండు ఛాన్స్‌లను చేజార్చుకొని డగౌట్‌కి పరిమితమయ్యాడు. 

ఇలా సెకండ్‌ డౌన్‌ కోసం టీమ్‌ ఇండియా తీసుకొచ్చిన ముగ్గురిలో ఒకరు విఫలమవ్వగా, ఇద్దరు గాయాల కారణంగా దూరమయ్యారు. నాలుగో టెస్టులో మిడిల్‌ ఆర్డర్‌ ఫెయిలైంది. వచ్చినవాళ్లు వచ్చినట్లు పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ఆ సమయంలో ధ్రువ్‌ జురెల్‌ (90) అడ్డుపడకుంటే.. భారత్‌ ఇబ్బందిపడేదే. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో సరైన బ్యాటర్‌ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం అనేది విశ్లేషకుల మాట. దీంతో ఆఖరి టెస్టులో ఆ ప్లేస్‌లో ఎవరొస్తారు అనే చర్చ మొదలైంది. డగౌట్‌లో ఉన్నవాళ్లను చూస్తే దేవదత్‌ పడిక్కల్‌ కనిపిస్తున్నాడు. మరోవైపు కేఎల్‌ రాహుల్‌ ఆఖరి టెస్టుకు జట్టులోకి వస్తాడు అని కూడా అంటున్నారు. అయితే ఇది తాత్కాలిక ఆలోచన మాత్రమే. పూర్తిస్థాయిలో సెకండ్‌ డౌన్‌ బ్యాటర్‌ అయితే టీమ్‌ ఇండియాకు అవసరం.

టీమ్‌ ఏం చేయాలి?

కోహ్లీ ఉండగా... ఆ స్థానంలో వేరే బ్యాటర్‌ను పంపే పరిస్థితి రాదు. అయితే, 35 ఏళ్లు దాటిన అతడు ఇంకెన్నాళ్లు టెస్టు క్రికెట్‌ ఆడతాడో చెప్పలేం. ఈ నేపథ్యంలో అర్జెంట్‌గా మరో విరాట్‌ అవసరం పడింది. అతడిలా నిలకడగా క్రీజులో గంటల తరబడి ఉండి.. వేల కొద్దీ పరుగులు చేయాలి. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటివాళ్లు కుదురుకుంటే జట్టుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కొత్త కుర్రాడిని వెతకాలి. లేదంటే ఉన్నవాళ్లను ఆ స్థానం కోసం సానపెట్టాలి.  ప్రతిభాన్వేషణలో హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ దిట్ట. మరి ఎవరిని ‘నాలుగు’ కోసం సిద్ధం చేస్తారో చూడాలి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని