Neeraj Chopra - Nadeem: భారత్‌- పాక్‌ స్టార్లు.. ఆటలో కుస్తీ.. బయట దోస్తీ

దాయాదుల మధ్య పోరంటే అది ఏ క్రీడైనాసరే ఆసక్తికరంగానే ఉంటుంది. అది క్రికెట్ అయినా.. జావెలిన్‌ త్రో అయినా సరే. తాజాగా ప్రపంచ అథ్లెట్లిక్స్‌లో స్వర్ణ, రజత పతకాలను భారత్, పాకిస్థాన్‌ అథ్లెట్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Published : 29 Aug 2023 14:40 IST

నీరజ్, నదీమ్‌ మధ్య స్నేహం

ఏ క్రీడలోనైనా.. వేదిక ఎక్కడైనా.. భారత్, పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య పోటీ అంటే అమితమైన ఆసక్తి ఉంటుంది. ఈ దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆటల్లో ఇలాంటి వాతావరణం ఏర్పడింది. కేవలం క్రికెట్‌ అనే కాదు.. ఏ క్రీడలోనైనా ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతుంటే ప్రపంచం మొత్తం చూస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు జావెలిన్‌ త్రోలోనూ ఇలాంటి పోటీనే ఏర్పడుతోంది. భారత స్టార్‌ నీరజ్‌ చోప్రాకు, పాకిస్థాన్‌ సంచలనం అర్షద్‌ నదీమ్‌ సవాలు విసురుతున్నాడు. తాజాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్‌ పసిడి గెలవగా.. నదీమ్‌ రజతం ముద్దాడాడు. అయితే తమ శత్రుత్వం పోటీ వరకు మాత్రమే అంటూ.. నీరజ్, నదీమ్‌ బయట స్నేహితులుగా ఉండడం విశేషం. 

అప్పటి నుంచి

జావెలిన్‌ త్రోలో నీరజ్, నదీమ్‌ మధ్య పోటీ ఇప్పటిది కాదు. 2016 దక్షిణాసియా క్రీడల నుంచి ఇది మొదలైంది. అప్పుడు జావెలిన్‌ త్రోలో నీరజ్‌ (82.23మీ) స్వర్ణం, నదీమ్‌ (78.33మీ) కాంస్యం గెలిచారు. అదే ఏడాది ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్‌ (77.60మీ) రజతం గెలిస్తే, నదీమ్‌ (73.40మీ) కాంస్యం సాధించాడు. 2018 ఆసియా క్రీడల్లో నీరజ్‌ (88.06మీ), నదీమ్‌ (80.75మీ) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌ (2021)లోనూ ఈ ఇద్దరి పోరు ఆసక్తి రేపింది. నీరజ్‌ (87.58మీ) స్వర్ణంతో చరిత్ర సృష్టించగా.. నదీమ్‌ (84.62మీ) మాత్రం అయిదో స్థానంతో సంతృప్తి చెందాడు. నిరుడు ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్‌ రజతం గెలవగా.. నదీమ్‌ అయిదో స్థానానికే పరిమితమయ్యాడు. కానీ 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో మాత్రం నదీమ్‌ ఏకంగా 90.18 మీటర్ల దూరం ఈటెను విసిరి క్రీడల రికార్డుతో పాటు పసిడి పట్టేశాడు. గాయం కారణంగా నీరజ్‌ ఈ క్రీడలకు దూరమయ్యాడు. కానీ 90 మీటర్ల దూరాన్ని చేరుకునేందుకు నీరజ్‌ ప్రయత్నిస్తున్న సమయంలోనే నదీమ్‌ ఆ మార్కు చేరుకోవడం గమనార్హం. ఇప్పుడు మోచేతి, మోకాలి గాయాల నుంచి కోలుకుని ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి కోసం నీరజ్‌కు గట్టిపోటీనిచ్చిన నదీమ్‌.. చివరకు రజతం అందుకున్నాడు. 

మిత్రులుగా

నీరజ్, నదీమ్‌ మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంది. నీరజ్, తాను కలిసి ఇప్పుడు ప్రపంచ జావెలిన్‌ త్రోలో ఆధిపత్యం చలాయిస్తున్నామని నదీమ్‌ చెప్పడం అందుకు నిదర్శనం. ఒకప్పుడు ఐరోపా అథ్లెట్ల హవా కొనసాగిన జావెలిన్‌ త్రోలో ఇప్పుడు నీరజ్‌తో కలిసి పెత్తనం ప్రదర్శిస్తున్నందుకు ఆనందంగా ఉందని అతనన్నాడు. ఇక నదీమ్‌ పట్ల కూడా నీరజ్‌ ఎప్పుడూ గౌరవభావంతోనే మెలిగాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీల అనంతరం ఫొటో కోసం అక్కడ లేని నదీమ్‌ను పిలిచిన నీరజ్‌ అందరి హృదయాలను గెలిచాడు. వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణం కోసం కూడా ఈ ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. 

ఆటలో శిఖరాలకు 

అథ్లెటిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌.. అదంతా ఒకప్పుడు భారత్‌కు కలగా ఉండేది. కానీ ఇప్పుడు నీరజ్‌ రూపంలో వెలుగు వచ్చింది. చీకటి మార్గంలో ధైర్యంగా అడుగులు వేస్తూ.. అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పతకాలు సాధించడం ఇంత సులువా అని చాటుతూ.. నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టిస్తున్నాడు. తాజాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో ఆ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. అయితే మనకు నీరజ్‌ లాగే.. పాకిస్థాన్‌కు అర్షద్‌ నదీమ్‌. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో అతను పాకిస్థాన్‌కు మొట్టమొదటి పతకం అందించాడు. మొదట నదీమ్‌ క్రికెటర్‌గా ఎదగాలనుకున్నాడు. కానీ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు, సోదరుల సలహాతో జావెలిన్‌ చేతబట్టి అంచెలంచెలుగా ఎదిగాడు.  

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని