Gambhir - Shah Rukh Khan: ఆ నాలుగేళ్లలో తరచూ ‘మన్నత్‌’ వేదికగా గంభీర్‌-షారుక్ భేటీ..!

కోల్‌కతా మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ రాక ఏదో సడెన్‌గా జరగలేదని.. సుదీర్ఘ చర్చల అనంతరం అతడు ఇటువైపు వచ్చినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Published : 28 May 2024 13:14 IST

ఇంటర్నెట్ డెస్క్: తన జట్టుతోపాటు పదేళ్లు ఉండేందుకు గౌతమ్‌ గంభీర్‌కు (Gautam Gambhir) షారుక్‌ ఖాన్ ‘బ్లాంక్‌ చెక్‌’ ఆఫర్‌ ఇచ్చిన వార్తలు నెట్టింట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. రెండేళ్లపాటు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ మెంటార్‌గా ఉన్న గంభీర్‌.. ఈ సీజన్‌నాటికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చేరిపోయాడు. ఇలా గౌతీని కేకేఆర్‌కు తీసుకొచ్చేందుకు ఆ ఫ్రాంచైజీ యజమాని షారుక్ చాలా కష్టపడినట్లు ఉంది. తాజాగా వస్తున్న వార్తలను బట్టి అదే నిజమనిపిస్తోంది. 2018 - 2022 మధ్య షారుక్ - గంభీర్‌ తరచూ ‘మన్నత్‌’లో భేటీ అయినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. షారుక్ ఖాన్ నివాసమే ‘మన్నత్‌’.

షారుక్‌ నుంచి ‘బ్లాంక్‌ చెక్’ ఆఫర్ రావడంతో 2023 సీజన్‌లోనే లఖ్‌నవూను వదిలేద్దామని గంభీర్‌ అనుకున్నాడని సమాచారం. ఆ జట్టుతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ బయటకు రావడానికి నిశ్చయించుకున్నాడు. ఇదే సమయంలో షారుక్‌ అందివచ్చిన ఛాన్స్‌ను మిస్‌ చేసుకోకూడదనే ఆలోచనలో ఉన్నాడు. వెంటనే గౌతీని షారుక్ తన ఇంటికి ఆహ్వానించాడు. వీరిద్దరి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చ జరిగినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అప్పుడే కోల్‌కతాకు గౌతమ్ గంభీర్ రావడం ఖాయమైందని.. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆసక్తి చూపినట్లు తెలిసింది. రెండేళ్లపాటు తన జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చిన గంభీర్‌ వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకోవడంతో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా షాక్‌కు గురయ్యారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

తర్వాత భారత ప్రధాన కోచ్‌గానేనా? 

ఐపీఎల్‌లో కేకేఆర్‌ను విజేతగా నిలపడం.. ఇటు భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవి ఖాళీ కావడంతో గౌతమ్‌ గంభీర్‌కు మంచి అవకాశం వచ్చింది. బీసీసీఐ  అతడి వైపే ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం అడ్డంకిగా మారింది. పదేళ్లపాటు కేకేఆర్‌ మెంటార్‌గా బాధ్యతలు స్వీకరించిన గంభీర్‌.. ఇప్పుడు నిర్ణయం తీసుకొనేందుకు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన కోచ్‌ పదవి కోసం దరఖాస్తుల గడువు కూడా ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని