Team India - Head Coach: టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌ పదవి.. కాస్త తెలివిగా ఎంచుకోండి: గంగూలీ

భారత ప్రధాన కోచ్‌ పదవి కోసం ఎంపిక చేసేటప్పుడు తెలివిని ప్రదర్శించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచించాడు. 

Published : 30 May 2024 14:48 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid). జూన్ 30తో అతడి పదవీకాలం ముగుస్తుంది. ఈలోగా కొత్త కోచ్‌ను ఎంపిక చేసి జులై 1 నుంచి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే, ఎవరిని ఎంపిక చేస్తారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir), ఆశిశ్ నెహ్రాతోపాటు పలువురు విదేశీ కోచ్‌లు ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. గత సోమవారంతో దరఖాస్తుల గడువు కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) ఆసక్తికర పోస్టు చేశాడు. 

‘‘ఒక ఆటగాడి జీవితంలో కోచ్‌ పదవి అత్యంత కీలకమైంది. మార్గదర్శిగా, కనికరం లేని శిక్షణతో మైదానంలో అత్యుత్తమ ప్లేయర్‌గా మార్చాల్సిన బాధ్యత ఉంటుంది. వ్యక్తిత్వపరంగానూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కోచ్‌ పదవి కోసం ఎంపిక చేసేటప్పుడు తెలివిని ప్రదర్శించాలి’’ అని గంగూలీ పోస్టు చేశాడు. ఇప్పటికైతే ఎవరు దరఖాస్తు చేశారనేది బీసీసీఐ వెల్లడించలేదు. మరోవైపు కోచ్‌ ఎంపిక ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

కోహ్లీ నా ఫేవరేట్‌: జై శంకర్‌

భారత క్రికెటర్లలో ప్రతి ఒక్కరి ఆటను ఇష్టపడతానని.. అయితే, విరాట్ కోహ్లీ (Virat Kohli) నాకిష్టమైన ఆటగాడని కేంద్ర మంత్రి జై శంకర్‌ (Jai Shakar) వెల్లడించారు. ‘‘సునీల్ గావస్కర్, సచిన్, విరాట్.. ముగ్గురు అత్యుత్తమమే. వీరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటారని అడిగితే మాత్రం కోహ్లీ వైపే మొగ్గు చూపుతా. అతడి ఫిట్‌నెస్, ఆడే విధానం నచ్చుతాయి. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తుందని భావిస్తున్నా’’ అని జై శంకర్‌ తెలిపారు. టీ20 ప్రపంచ కప్‌ కోసం భారత్ ఇప్పటికే అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. అంతకుముందు (జూన్ 1న) బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో తలపడనుంది. దాయాది దేశం పాకిస్థాన్‌ను జూన్ 9న ఢీకొట్టనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని