Kolkata Knight Riders: ఇటు షారుక్.. అటు గంభీర్

ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders)ఛాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టు సక్సెస్ కావడంలో మెంటార్ గంభీర్, యజమాని షారుక్‌ ఖాన్‌లు తెర వెనుక కీలకపాత్ర పోషించారు.

Published : 28 May 2024 00:05 IST

ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందెంతో

అభిమానులను ఉర్రూతలూగిస్తూ సాగిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ ఏకపక్ష ఫైనల్‌తో ముగిసింది. సీజన్ అంతటా నిలకడగా ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders).. దూకుడుకు మారుపేరుగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఐపీఎల్‌లో ఇంత నిలకడగా ఆడి కప్పు గెలిచిన జట్లు అరుదుగా కనిపిస్తాయి. ఈ విజయంలో ఆటగాళ్లది ఎంత ముఖ్య పాత్రో తెర వెనక వ్యక్తులు కూడా అంతే కీలకం. ప్రధానంగా నైట్‌రైడర్స్ మెంటార్‌గా ఈ సీజన్లోనే బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), యజమాని షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)ల మీద ప్రశంసలు కురుస్తున్నాయి. వాళ్లు తెర వెనక పోషించిన పాత్ర ఆటగాళ్లలో ఒక ప్రేరణ కలిగించిందనడంలో సందేహం లేదు. 

టీ20 క్రికెట్లో కో‌చ్ పాత్ర పరిమితమే. ఇక ఫ్రాంఛైజీ క్రికెట్లో మెంటార్ అంటే నామమాత్రం అనే భావిస్తారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి వాళ్లు ఐపీఎల్‌లో మెంటార్ పాత్రల్లో ఏదో ఉన్నాం అంటే.. ఉన్నాం అనిపించారు. ఎక్కువగా క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు కనిపించలేదు. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం అలా కాదు. గత రెండేళ్లు లఖ్‌నవూ మెంటార్‌గా మంచి ఫలితాలు రాబట్టిన అతను.. ఈ సీజన్లో తాను ఒకప్పుడు ఆటగాడిగా, కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారి అక్కడ బలమైన ముద్రే వేశాడు. ఎప్పుడో 2017లో తాను కెప్టెన్‌గా ఉండగా స్పిన్నరైన సునీల్ నరైన్‌ (Sunil Narine)ను ఓపెనర్‌గా పంపి ప్రయోగం చేసిన గంభీర్.. ఈసారి ఆ ఆలోచనను తిరిగి అమల్లోపెట్టాడు. మొత్తంగా జట్టును సమష్టిగా నడిపించడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. కోల్‌కతాకు నాణ్యమైన ఆటగాళ్లున్నప్పటికీ సమష్టిగా రాణించకపోవడం, ఒక ప్రణాళిక ప్రకారం ఆడకపోవడం, దేశీయ ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోవడం వల్ల చాలా ఏళ్ల నుంచి కప్పు గెలవలేకపోతోంది. ఈ లోపాలన్నింటినీ గంభీర్ మెంటార్ అయ్యాక అధిగమించింది నైట్‌రైడర్స్. మిచెల్ స్టార్క్‌ (Mitchell Starc)ను భారీ రేటు పెట్టి వేలంలో కొనడం దగ్గర్నుంచి గంభీర్ ప్రతీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా లాంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించి ఉత్తమ ప్రదర్శన ఇచ్చేలా చేశాడు. ఆటగాళ్లు స్వేచ్ఛగా, సహజశైలిలో ఆడేలా చూడడంలో గంభీర్‌ది ముఖ్య పాత్ర. ఆటగాళ్లెవ్వరూ ఒత్తిడికి గురికాకుండా చూడడంలోనూ గంభీర్ పాత్ర కీలకమన్నది జట్టు వర్గాల మాట. కోల్‌కతాకు కోచ్ చంద్రకాంత్ పండిట్ అయినప్పటికీ.. గంభీర్ అన్నీ తానై వ్యవహరించి జట్టు కప్పు గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. లఖ్‌నవూతో ఉండగా గంభీర్ మంచి పనితీరే కనబరిచినా.. నిరుడు బెంగళూరు జట్టుతో వివాదం జరిగినపుడు జట్టులో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. అది ఆ జట్టును గంభీర్ విడిచిపెట్టాల్సిన పరిస్థితికి దారితీసింది. అయితే కెప్టెన్‌గా గంభీర్ చాలా ఏళ్లు నడిపించడంతో పాటు రెండు కప్పులు అందించిన కోల్‌కతాకు మారడానికి ఇది దోహదపడింది. ఇక్కడికి వచ్చాక తన సొంతింటికి వచ్చిన భావన కలిగింది గౌతీకి. అక్కడ తనకు పూర్తి స్వేచ్ఛ లభించడంతో ఆటగాళ్లలో మంచి సమన్వయంతో పని చేసి ఫలితాలు రాబట్టాడు.

కింగ్ ఖాన్ ఏం చేశాడు?

మెంటార్‌గా కోల్‌కతా కోసం గంభీర్ ఏం చేశాడో అందరూ చెబుతున్నారు. మరి యజమానిగా షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan) ఏం చేశాడు అన్నది చర్చనీయాంశం. నిజానికి షారుక్‌ ఏం చేయకపోవడమే అతడిలోని ఉత్తమ లక్షణం. కొన్ని రోజుల కిందటే హైదరాబాద్ చేతిలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) చిత్తుగా ఓడిపోయింది. లఖ్‌నవూ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించి పడేసింది. ఆ మ్యాచ్ అయ్యాక ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా.. డగౌట్ దగ్గరే అందరూ చూస్తుండగా, కెమెరాలు ఫోకస్ చేస్తుండగా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ (KL Rahul)తో వాగ్వాదానికి దిగాడు. ఇదేం ఆట అంటూ అతణ్ని నిలదీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వివాద సమయంలో అందరూ షారుక్‌ ఖాన్ గురించే మాట్లాడుకున్నారు. అతను ఆటకు సంబంధించిన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడు. మైదానానికి వచ్చి ఆటగాళ్లకు ఉత్సాహాన్నిస్తాడు. గెలిస్తే అభినందిస్తాడు. ఓడితే ఓదారుస్తాడు. అంతే తప్ప గెలిచినపుడు అతిగా సంబరాలు చేసుకోవడం, ఓడినపుడు ఆటగాళ్ల మీద అరవడం లాంటివి ఎన్నడూ జరగలేదన్నది జట్టు వర్గాల మాట. తాను అన్నేళ్లపాటు కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్నప్పటికీ.. షారుక్‌తో కొన్ని నిమిషాలు కూడా ఆట గురించి మాట్లాడింది లేదని గతంలో గంభీరే స్వయంగా చెప్పాడు. ఇదే విషయమై ఓ యూట్యూబ్ ఛానెల్ చిట్‌చాట్‌లో షారుక్‌ మాట్లాడుతూ.. తనకు ఎవరైనా నటనలో సలహాలు ఇస్తే కోపం వస్తుందని, అలాగే తనకు పెద్దగా అవగాహన లేని క్రికెట్లో ప్రొఫెషనల్ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వకూడదని భావిస్తానని షారుక్‌ అన్నాడు. తనదెంతో బిజీ షెడ్యూల్ అయినా సరే.. ఆటగాళ్లను ఉత్సాహపరచడానికే షారుక్‌ తరచుగా స్టేడియాలకు వస్తుంటాడు. ఆట పరంగా ఎక్కువ జోక్యం చేసుకోకుండా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించాడు. కాబట్టే కోల్‌కతా ఉత్తమ ప్రదర్శన చేయడంలో షారుక్‌ పాత్ర కూడా కీలకం అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని