Kohli vs Gambhir: కోహ్లీతో వివాదం.. తొలిసారి స్పందించిన గంభీర్‌

విరాట్‌ కోహ్లీతో ఇటీవల ఐపీఎల్‌లో చోటుచేసుకున్న వివాదంపై గౌతం గంభీర్‌(Gautam Gambhir) ఎట్టకేలకు స్పందించాడు.

Updated : 12 Jun 2023 13:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 16 (IPL 16)వ సీజన్‌లో లఖ్‌నవూ (LSG) మెంటార్‌ గౌతం గంభీర్‌(Gautam Gambhir), బెంగళూరు(RCB) స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై గంభీర్‌ ఎట్టకేలకు మౌనం వీడాడు. ఆ రోజు చోటుచేసుకున్న ఘటనపై స్పందించాడు.

‘ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ లేదా ఇతర ఏ ఆటగాడితోనైనా.. నా అనుబంధం ఒకేలా ఉంటుంది. మా మధ్య ఏదైనా వివాదం చోటుచేసుకుంటే.. అది మైదానం వరకు మాత్రమే పరిమితం. వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. నాలాగే వాళ్లు కూడా గెలవాలని కోరుకుంటాను’ అంటూ ఈ వివాదంపై ముగింపు పలికాడు గంభీర్‌.
ఇదీ చదవండి : విరాట్‌.. గంభీర్‌ మధ్య వాగ్వాదానికి కారణమేంటి?

‘క్రికెట్‌ మైదానంలో నేను చాలా పోరాటాలు చేశాను. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదం.. మైదానం వరకు మాత్రమే పరిమితం కావాలి. చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. టీఆర్పీ రేటింగ్‌ల కోసం ఈ వివాదంపై స్పష్టత ఇవ్వాలని చాలా మంది అడిగాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ గంభీర్‌ వివరించాడు.

ఇక అప్పటి ఘటనను వివరిస్తూ.. ‘నేను ఒక్కటే చెబుతాను. ఆ సమయంలో నేను చేసినదాన్ని సమర్థించుకుంటున్నా. నవీనుల్‌ తప్పు చేయలేదని భావిస్తే.. అతడి వెంట నిలబడటం నా బాధ్యత. అక్కడ నవీనుల్‌ ఉన్నా.. ఇతర వ్యక్తి ఉన్నా.. నా చివరి శ్వాస వరకూ అదే చేస్తా. మీరు సరైనవారని నేను భావిస్తే.. నేను మీవైపే ఉంటా. నేను ఇదే నేర్చుకున్నా.. దీన్నే కొనసాగిస్తా.. ఈ విధంగానే జీవిస్తా. మీరు అతడికి మద్దతిస్తున్నారు.. అతడు మన సొంత ఆటగాడు కాదు కదా.. అని చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. ఇక్కడ అతడు మనవాడా కాదా అన్నది కాదు.. ఒకవేళ నా జట్టు సభ్యుడు తప్పు చేస్తే.. అతడికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వను’ అంటూ వివరణ ఇచ్చాడు.

ఆరోజు ఏం జరిగిందంటే..

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌(Lucknow Supergiants)తో ఆర్సీబీ(RCB) మ్యాచ్‌ అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో కోహ్లీ-గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. అంతకుముందు మ్యాచ్‌లో లఖ్‌నవూ బౌలర్‌ నవీనుల్‌, విరాట్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ విరాట్‌, గంభీర్‌కు భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కూడా. తాజాగా గంభీర్‌ ఈ ఘటనపై వివరణ ఇచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని