Virat X Gambhir: విరాట్‌.. గంభీర్‌ మధ్య అసలేం జరిగింది? వాగ్వాదానికి కారణమేంటి?

లఖ్‌వనూ, బెంగళూరు మ్యాచ్‌ అనంతరం గంభీర్‌(Gautam Gambhir)-విరాట్‌ కోహ్లీ(virat kohli)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే.. ఈ గొడవ ఎక్కడ మొదలైందన్న విషయాలపై పూర్తి స్పష్టత లేదు. 17వ ఓవర్‌లోనే ఇరు జట్ల ఆటగాళ్లకు జరిగిన మాటల యుద్ధమే దీనికి దారితీసినట్లు పలువురు పేర్కొంటున్నారు.

Updated : 02 May 2023 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : లఖ్‌నవూ (Lucknow Supergiants)- బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య సోమవారం జరిగిన పోరు కంటే.. ఆ మ్యాచ్‌లో జరిగిన వాగ్వాదాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. మ్యాచ్‌ అనంతరం గంభీర్‌ (Gautam Gambhir) - విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీసీసీఐ వారిపై జరిమానా విధించే వరకూ ఈ గొడవ వెళ్లింది. అయితే.. ఈ గొడవ ఎక్కడ మొదలైందన్న విషయంపై స్పష్టత లేదు. మ్యాచ్‌ చివర్లో 16 - 17 ఓవర్ల మధ్య విరామ సమయంలో లఖ్‌నవూ ఆటగాడు నవీన్‌ ఉల్‌ హక్‌ (naveen ul haq), ఆర్సీబీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)కు మధ్యలో జరిగిన చిన్నపాటి గొడవే దీనికి కారణమంటూ పలువురు పేర్కొంటున్నారు.

సిరాజ్‌ వేసిన ఆ ఓవర్‌..

చివరివరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ మధ్యలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కవ్వింపు చేష్టలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సిరాజ్‌ వేసిన 17వ ఓవర్‌ సమయంలో చోటుచేసుకున్న ఘటన ఇరు జట్ల మధ్య వాగ్వాదానికి మరింత ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. సిరాజ్‌ వేసిన ఆ ఓవర్‌ మొదటి ఐదు బంతుల్లో 8 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వేసిన బంతి.. నవీన్‌ ప్యాడ్లకు తాకింది. అనంతరం సిరాజ్‌.. నవీన్‌ వైపు చూస్తూ బంతిని స్టంప్స్‌పైకి విసిరాడు. అప్పటికీ నవీన్‌ క్రీజులోనే ఉన్నాడు. 

నవీన్‌ X కోహ్లీ..

దీంతో నవీన్‌, సిరాజ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. మధ్యలోకి కోహ్లీ కూడా వచ్చి చేరాడు. మరో ఎండ్‌లో ఉన్న అమిత్‌ మిశ్రా వచ్చి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. మిశ్రాతో కూడా కోహ్లీ ఏదో అంటున్నట్లు కనిపించింది. ఆ తర్వాత కోహ్లీ గురించి నవీన్‌ ఏదో అంటుండగా అంపైర్‌ మధ్యలో కలగజేసుకున్నాడు. అయితే దీనిపై విరాట్‌ విసిగిపోయి అంపైర్‌కు తన ఉద్దేశాన్ని వివరించినట్లు తెలుస్తోంది. కోహ్లీ తన షూను చూపిస్తూ నవీన్‌పై ఏదో సంజ్ఞలు చేయడం వివాదం మరింత పెరిగేలా చేసింది. ఈ ఘటనే మ్యాచ్‌ అనంతరం విరాట్ (Kohli), గంభీర్‌ (Gautam Gambhir)ల మధ్య వాగ్వాదానికి కారణమంటూ పలువురు పేర్కొంటున్నారు. 

మ్యాచ్‌ ముగిసినా..

మ్యాచ్‌ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్ల కరచాలనం చేసుకునే సమయంలోనూ కోహ్లీ - నవీన్‌ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ తర్వాత కైల్‌ మేయర్స్‌, విరాట్‌ ఏదో మాట్లాడుతుండగా.. గంభీర్‌ వచ్చి మేయర్స్‌ను పక్కకు తీసుకెళ్లాడు. అదే సమయంలో ఎదురుగా నవీన్‌ రావడంతో మరోసారి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ వెంటనే కోహ్లి, గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది వారిని విడదీశారు. అనంతరం రాహుల్ వచ్చి కోహ్లీతో మాట్లాడాడు. తన టీమ్‌ సభ్యుడు నవీన్‌ని కోహ్లితో మాట్లాడమని ఒత్తిడి చేసినా.. తను నిరాకరిస్తూ వెళ్లిపోయాడని మరో వీడియో ద్వారా తెలుస్తోంది. 

అయితే, ఈ క్రమంలో ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అనే విషయంలో స్పష్టత లేదు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులు, వీడియోల సీక్వెన్స్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. నిజానికి లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచి రెండు జట్ల మధ్య హీటెడ్‌ డిస్కషన్స్‌ జరిగాయి. అయితే మ్యాచ్‌ ఆఖరికి వచ్చేసరికి అవి తారస్థాయికి చేరాయి. ఇవన్నీ కలిపే ఆఖర్లో గంభీర్‌, కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమయ్యాయి. దీనికి గతంలో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా గంభీర్‌ చేసిన కొన్ని సంజ్ఞలు కూడా కారణమని తెలుస్తోంది. ఆ మ్యాచ్‌ సందర్భంగా నోరు మూసుకోండి అనే అర్థంతో గంభీర్‌ అభిమానుల వైపు చూస్తూ అనడం వీడియోల్లో కనిపించింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని