Sanju Samson - Gambhir: నువ్వు కొత్త ప్లేయర్‌వి కాదు.. వరల్డ్‌ కప్‌లో సత్తా చాటాలి: గంభీర్

ఆదివారం రాజస్థాన్‌తో కోల్‌కతా తన చివరి లీగ్‌ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్‌నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 17 May 2024 11:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత జట్టులోకి వస్తానా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్న సంజూ శాంసన్‌కు (Sanju Samson) ఇప్పుడు ఏకంగా వరల్డ్‌ కప్‌లోనే చోటు దక్కింది. రిషభ్‌ పంత్‌తో పాటు రెండో వికెట్‌ కీపర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ను ప్లేఆఫ్స్‌నకు చేర్చడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడిన సంజూ 504 పరుగులు సాధించాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ పొట్టి కప్‌లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) సూచించాడు. కావాల్సినంత అనుభవం ఉందని.. దానిని మెగా టోర్నీలో ప్రదర్శించాలని పేర్కొన్నాడు.

‘‘ఇప్పుడు నువ్వు వరల్డ్ కప్‌ జట్టులోకి వచ్చావు. నీకు తుది టీమ్‌లో అవకాశం వస్తే.. భారత్‌ను గెలిపించేందుకు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాలి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో కావాల్సినంత అనుభవం సాధించావు. నువ్వు కొత్త ఆటగాడివి కాదు. ఐపీఎల్‌లోనూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించావు. అందుకే, నీకు వరల్డ్ కప్‌లో ఆడే ఛాన్స్‌ వచ్చింది. తప్పకుండా అతడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెబుతాడని ఆశిస్తున్నా.

సంజూ 2012లో కోల్‌కతా జట్టులోకి వచ్చాడు. అప్పుడు చాలా చిన్న కుర్రాడు. అతడి ఆటను చూసే అవకాశం అప్పుడు రాలేదు. అతడు ఎలాంటి ప్లేయర్‌ అని చెప్పేందుకు కేవలం ఐదు నిమిషాలు సరిపోతాయి. నైపుణ్యంపరంగా ఎంతో మెరుగు కావడంతోపాటు మానసికంగానూ బలంగా మారాడు. ఫిట్‌నెస్‌, పవర్‌ హిట్టింగ్, కీపింగ్‌, కెప్టెన్సీ.. ఇలా అన్నింట్లోనూ రాటుదేలాడు. ఎప్పుడూ తప్పుడు మార్గంలో అడుగులు వేయలేదు. ఇదే ఒరవడిని కొనసాగిస్తే పొట్టి కప్‌లోనూ అతడి బ్యాట్‌ నుంచి మంచి ఇన్నింగ్స్‌లు వస్తాయనే నమ్మకం ఉంది’’ అని గంభీర్‌ తెలిపాడు. ఆదివారం కోల్‌కతా - రాజస్థాన్‌ జట్ల మధ్య తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని