Gambhir - Jay Shah: గంభీర్‌ను కలిసిన జై షా.. ‘ప్రధాన కోచ్‌’ పదవిపై మళ్లీ చర్చ!

ఐపీఎల్ 17వ సీజన్ విజయవంతంగా ముగిసింది. కోల్‌కతా ఛాంపియన్‌గా నిలిచి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇద్దరి కలియిక మాత్రం చర్చకు దారితీసింది.

Published : 27 May 2024 14:21 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో గత రెండేళ్లు మెంటార్‌గా లఖ్‌నవూను ప్లేఆఫ్స్‌కు చేర్చడం.. ఇప్పుడు కోల్‌కతాను ఛాంపియన్‌గా మార్చడం వెనుక భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం సాధించి మూడోసారి కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ అనంతరం గౌతమ్‌ గంభీర్‌తో బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ పదవి ఖాళీ అవుతున్న క్రమంలో వీరిద్దరిని ఇలా చూడటంతో చర్చకు దారితీసింది. ఇవాళే కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడం గమనార్హం. ఇప్పటికే గంభీర్‌ను ఒప్పించడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేసిందనే ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో జైషాకు అభిమానుల నుంచి వినతులు వస్తున్నాయి. కొందరు విభిన్నంగానూ స్పందించారు. 

‘‘జైషా సార్ మీరు ఒకే ఒక పనిచేయండి. గౌతమ్‌ గంభీర్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమించండి’’

‘‘గంభీర్‌తో జైషా సీరియస్‌గా చర్చిస్తున్నారు. విషయం ఒకటే. అది కన్ఫార్మ్‌ అయినట్లు ఉంది’’

‘‘ప్రధాన కోచ్‌ పదవిని ఇవ్వడానికి ఎందుకీ ఆలస్యం? ముందు టీ20 వరల్డ్ కప్‌ కోసం అతడిని మెంటార్‌గా పెట్టండి. గతంలో ధోనీ సేవలను వినియోగించుకున్నట్లు ఈసారి గౌతీకి అవకాశం ఇస్తే బాగుంటుంది’’ 

‘‘కోల్‌కతా జట్టుతో పోలిస్తే టీమ్‌ఇండియాలో విభిన్నమైన సంస్కృతి ఉంటుంది. ఇక్కడి సీనియర్లు గంభీర్‌ను గౌరవించకపోవచ్చు. అందుకే, అతడికి కోచ్‌ పదవి కష్టంగా మారే అవకాశం ఉంది’’

‘‘గౌతమ్‌ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తే మాత్రం.. అతడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. లేకపోతే విఫలమయ్యాడనే వ్యాఖ్యలు వినిపిస్తాయి’’ 

గ్రౌండ్‌ స్టాఫ్‌కు నజరానా

రెండు నెలలకుపైగా సాగిన ఐపీఎల్‌ 17వ సీజన్‌ విజయవంతం కావడంలో గ్రౌండ్‌ సిబ్బంది విశేష కృషి ఉంది. సమయానికి అద్భుతమైన పిచ్‌లు, వర్షం పడినా మైదానాన్ని త్వరగా సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో వారికి మద్దతుగా నిలిచేందుకు బీసీసీఐ కార్యదర్శి జైషా నజరానా ప్రకటించారు. ‘‘టీ20 సీజన్‌ సక్సెస్ కావడంలో గ్రౌండ్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మా హీరోలకు  ప్రశంసలు కురిపించడంతోపాటు వారికి నజరానా ఇవ్వాలని నిర్ణయించాం. 10 రెగ్యులర్‌ మైదానాల్లో ఒక్కోదానికి రూ. 25 లక్షలు, అదనంగా మరో మూడు వేదికలకు పదేసి లక్షలను ఇస్తున్నాం. సిబ్బంది, క్యురేటర్‌ నిబద్ధతకు, కష్టానికి ధన్యవాదాలు’’ అని జై షా పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు