Gautam Gambhir: అతడొచ్చాడు.. కోల్‌‘కథ’ మార్చాడు!

ఐపీఎల్‌-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఫైనల్‌కు చేరింది. మైదానంలో ఆ జట్టును ముందుండి నడిపించింది శ్రేయస్‌ అయ్యరే కానీ.. వెనకుండి ఆ జట్టును ముందుకు నడిపిన శక్తి గౌతమ్‌ గంభీర్‌దే (Gautam Gambhir)! ఓటమిని ఒప్పుకోని తత్వం.. రాజీపడని మనస్తత్వంతో గౌతి తనకు మరో ఇళ్లు అయిన కోల్‌కతా జట్టులో వెలుగులు నింపాడు.

Updated : 22 May 2024 17:05 IST

ఐపీఎల్‌లో కోల్‌కతా (Kolkata Knight Riders) పేరు చెప్పగానే పేరు గొప్ప..! అనే మాట గుర్తుకు రాక మానదు. ఎందుకంటే స్టార్‌ ఆటగాళ్లు, భారీ కోచింగ్‌ సిబ్బంది.. షారుక్‌ లాంటి ఓ స్ఫూర్తినిచ్చే యజమాని! ఇన్ని ఉన్నా కూడా ఆ జట్టు కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా రాలేకపోతుంది. చివరిగా 2014లో కప్పు కొట్టింది. గత రెండేళ్లలో చెత్త ప్రదర్శన చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. కేకేఆర్‌ను చూస్తే ఇంకా పైకి లేచేలా కనిపించలేదు. అలాంటిది ఏడాదిలోనే ఆ జట్టులో ఎంతో మార్పు! ఆటలో మరెంతో తేడా! కొట్టొచ్చినట్టు కనబడుతున్న ఆత్మవిశ్వాసం! ఫలితం ఐపీఎల్‌-17లో ఫైనల్లో ప్రవేశం! మైదానంలో ఆ జట్టును ముందుండి నడిపించింది శ్రేయస్‌ అయ్యరే కానీ.. వెనకుండి ఆ జట్టును ముందుకునడిపిన శక్తి గౌతమ్‌ గంభీర్‌దే (Gautam Gambhir)! ఓటమిని ఒప్పుకోని తత్వం.. రాజీపడని మనస్తత్వంతో గౌతి తనకు మరో ఇళ్లు అయిన కోల్‌కతా జట్టులో వెలుగులు నింపాడు. 2012, 2014లో కోల్‌కతా సారథిగా ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన గంభీర్‌ ఇప్పుడు మార్గనిర్దేశకుడిగా మరో టైటిల్‌ అందించేందుకు రంగం సిద్ధం చేశాడు. 

అక్కడ నుంచి వచ్చి..

2023 ఐపీఎల్‌లో లఖ్‌నవూ జట్టుకు కోచ్‌గా ఉన్న సమయంలో గంభీర్‌ వివాదాల్లో చిక్కుకున్నాడు. లఖ్‌నవూ-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో కోహ్లితో వాగ్వాదానికి దిగి వార్తల్లో నిలిచాడు. కోహ్లి అభిమానుల ట్రోలింగ్‌ ఎదుర్కొన్నాడు. ముక్కోపిగా పేరు పొందాడు. దీంతో లఖ్‌నవూ జట్టుకు కూడా దూరం కావాల్సివచ్చింది. కానీ ఇది అతడికి మంచే చేసింది. తన కెరీర్‌ను మరో దశకు తీసుకెళ్లిన కోల్‌కతాతో తిరిగి చేతులు కలిపాడు. మార్గనిర్దేశకుడిగా జట్టుకు స్ఫూర్తినిచ్చాడు. పేరుకే చంద్రకాంత్‌ కోచ్‌ కానీ.. అన్నీ తానై చూసుకున్నాడు. పెద్దగా ఫామ్‌లో లేని సునీల్‌ నరైన్‌ను ఓపెనర్‌గా తెచ్చి సక్సెస్‌ చేయించడం.. వెంకటేశ్‌ అయ్యర్, హర్షిత్‌ రాణాలను సరిగ్గా ఉపయోగించుకోవడం గౌతి ప్రణాళికల వల్లే సాధ్యమైంది. ఒకప్పుడు కీలక ఆటగాళ్లుగా ఉండి గత రెండు సీజన్లుగా పెద్దగా రాణించలేకపోయిన రసెల్, నరైన్‌లు తిరిగి ట్రాక్‌లోకి రావడం వెనక గంభీర పాత్ర ఎంతో ఉంది. ఎక్కువ అవకాశాలు దక్కించుకోలేకపోయిన ఫిల్‌ సాల్ట్‌ లాంటి హిట్టర్‌ని ఓపెనర్‌గా దింపి విజయవంతం అయ్యేలా చేశాడు. ఆరంభంలో సాల్ట్, నరైన్‌ చెలరేగి శుభారంభాలు ఇస్తే.. మిడిల్‌ ఓవర్లలో శ్రేయస్‌ అయ్యర్, వెంకటేశ్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌కు ఆ ఊపు తగ్గకుండా చూశారు. చివర్లో రింకు సింగ్, రసెల్, రమణ్‌దీప్‌ భారీ షాట్లతో విరుచుకుపడి మెరుపు ఫినిషింగ్‌ ఇచ్చారు. ఇక స్పిన్‌ ద్వయం నరైన్, వరుణ్‌ చక్రవర్తి గొప్పగా బంతులేసి బ్యాటర్లను కట్టడి చేశారు. వైభవ్‌ అరోరా లాంటి కుర్రాడిని కొత్త బంతితో బౌలింగ్‌ చేయడం కూడా గౌతి వ్యూహమే.

ఇప్పుడూ సాధిస్తుందా?

గంభీర్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 2012, 14 టోర్నీల్లో కోల్‌కతా ఐపీఎల్‌ ట్రోఫీని సాధించింది. కానీ ఆ తర్వాత చివరిగా 2021లో బ్రెండన్‌ మెక్‌కలమ్‌ కోచ్‌గా ఉన్నప్పుడు తుదిపోరుకు అర్హత సాధించింది. కానీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. గత రెండేళ్లుగా కేకేఆర్‌ది తిరోగమనమే. బ్యాటింగ్, బౌలింగ్‌లలో దారుణంగా విఫలమైన కోల్‌కతా ఏడో స్థానంలో మాత్రమే నిలవగలిగింది. 2022లో శ్రేయస్‌ అయ్యర్‌ కేకేఆర్‌ కెప్టెన్‌గా ఎంపికైనా జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. 2023లో శ్రేయస్‌ అయ్యర్‌కు గాయం కావడంతో నితీశ్‌ రాణా జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అతడు కూడా కేకేఆర్‌ రాతను మార్చలేకపోయాడు. ఐపీఎల్‌-17లో తిరిగి జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌.. ఈసారి గంభీర్‌ మార్గనిర్దేశకత్వంలో భిన్నంగా కనిపించాడు. దూకుడుగా జట్టును నడిపించాడు. వనరులను సద్వినియోగం చేసుకోవడం దగ్గర నుంచి.. భిన్నమైన ప్రణాళికలను రూపొందించి మైదానంలో అమలుచేయడం వరకు శ్రేయస్‌ కొత్త శైలిలో పయనించాడు. ఇదే కోల్‌కతాకు ప్లస్‌ అయింది. బలమైన జట్లను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్‌-1లో పటిష్టమైన సన్‌రైజర్‌ హైదరాబాద్‌.. కోల్‌కతా ధాటికి ఏమాత్రం నిలవలేకపోయింది. 2018 నుంచి క్వాలిఫయర్స్‌-1లో గెలిచిన జట్టే ఐపీఎల్‌ విజేతగా నిలుస్తోంది.. మరి ఈసారి శ్రేయస్‌ సేన కప్‌ సాధిస్తుందా అనేది ఆసక్తికరం. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు