Gautam Gambhir: ‘వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి’.. వైరలవుతోన్న గంభీర్‌ పోస్ట్‌!

Gautam Gambhir: ఐపీఎల్‌ 2024 ట్రోఫీని కోల్‌కతా కైవసం చేసుకుంది. ఈ విజయంలో జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ది కీలక పాత్ర. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరలవుతోంది.

Updated : 27 May 2024 11:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ 2024 ట్రోఫీని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలుచుకోవడంలో జట్టు మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ది (Gautam Gambhir) కీలక పాత్ర. ఆటగాళ్లతో పాటు క్రీడా ప్రముఖులూ అదే చెబుతున్నారు. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ మైదానంలో తన ప్రణాళికలను అమలుపర్చినప్పటికీ.. తెర వెనక వ్యూహ రచన మాత్రం గంభీర్‌దే. అతడొచ్చిన తర్వాత జట్టు తీరే మారిపోయింది. ప్రతి మ్యాచ్‌లో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. తద్వారా పదేళ్ల కల సాకారంలో తనదైన బాధ్యతను నిర్వర్తించాడు.

ఈ సందర్భంగా గంభీర్‌ (Gautam Gambhir) ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. ‘‘ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి’’ అంటూ హిందీలో చేసిన తాత్వికతతో కూడిన పోస్ట్‌ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఫస్ట్‌ బౌలింగ్‌ చేయడమే లక్కీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు థ్యాంక్స్‌: శ్రేయస్‌

గతంలో కెప్టెన్‌గా కోల్‌కతా ఫ్రాంచైజీకి గంభీర్‌ రెండు ట్రోఫీలను (2012, 2014) అందించారు. ఈసారి తిరిగి మెంటార్‌గా జట్టు గూటికి చేరారు. తద్వారా పదేళ్ల నిరీక్షణకు తెరదించారు. ఈ సందర్భంగా గెలుపులో గంభీర్‌ పాత్రను జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, వైస్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా కొనియాడారు. ‘‘గంభీర్‌ను మెంటార్‌గా ప్రకటించినప్పుడు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు సుదీర్ఘ సందేశం పంపా. దానికి ధన్యవాదాలు తెలుపుతూనే.. చేతిలో ట్రోఫీతో పోడియంపై నిలబడితే మరింత సంతోషిస్తా అన్నారు. ఆరోజు రానే వచ్చింది’’ అని రాణా గుర్తుచేసుకున్నారు.

మరో కేకేఆర్‌ స్టార్‌ ఆటగాడు రింకూ సింగ్‌ సైతం గంభీర్‌ పాత్రను కొనియాడాడు. తన ఏడేళ్ల కల నెరవేరిందంటూ మొత్తం టీమ్‌తో పాటు ప్రత్యేకంగా గంభీర్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. సునీల్‌ నరైన్‌ సైతం మెంటార్‌ నుంచి లభించిన సహకారం అద్భుతమని తెలియజేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని