KKR-Shreyas Iyer: ఫస్ట్‌ బౌలింగ్‌ చేయడమే లక్కీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు థ్యాంక్స్‌: శ్రేయస్‌

మూడోసారి ఐపీఎల్‌ విజేతగా నిలవడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని కేకేఆర్‌ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ వ్యాఖ్యానించాడు.

Published : 27 May 2024 08:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్ టైటిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఒడిసి పట్టింది. తుది పోరులో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. టోర్నీ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్‌ ప్లేయర్లు ఫైనల్‌లోనూ ఇదే ఆటతీరుతో రాణించారు. చెపాక్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో ప్రత్యర్థి ఎస్‌ఆర్‌హెచ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తమ జట్టు విజయం వెనుక ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ వ్యాఖ్యానించాడు. 

‘‘జట్టుగా మేం సాధించాలని కోరుకున్నదిదే. కీలక సమయంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి నిలబడ్డారు. మాటల్లో వర్ణించలేని ఆనందం. చాన్నాళ్లు వేచి చూస్తున్నా. ఈ సీజన్‌ మొత్తం మేం అద్భుత ఆటతీరును ప్రదర్శించాం. తొలి మ్యాచ్‌ను ఎలాంటి నిబద్ధతతో ఆడామో.. ఇప్పుడే అదే స్ఫూర్తితో పోరాడాం. సన్‌రైజర్స్‌ క్రికెటర్లు ఈసారి చాలా దూకుడుగా ఆడారు. అద్భుతంగా ఆడినందుకు ధన్యవాదాలు. పోటీ ఉన్నప్పుడే మనలోని సత్తా బయటికొస్తుంది. ఈ మ్యాచ్‌లో మేం తొలుత బౌలింగ్‌ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. చివరి వరకూ మా చేతుల్లోనే మ్యాచ్‌ను ఉంచుకోగలిగాం. భారీ ఒత్తిడి కలిగిన ఇలాంటి మ్యాచుల్లో స్టార్క్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు నాణ్యమైన ప్రదర్శన చేస్తే జట్టుకు చాలా ప్రయోజనం ఉంటుంది. రస్సెల్, సునీల్ నరైన్, హర్షిత్, వెంకటేశ్‌.. ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అందించారు’’ అని శ్రేయస్‌ తెలిపాడు. టాస్ నెగ్గిన హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

స్టార్క్‌ దెబ్బ కొట్టాడు: పాట్ కమిన్స్

‘‘కోల్‌కతా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. మరీ ముఖ్యంగా నా సహచరుడు స్టార్క్‌ మళ్లీ విజృంభించాడు. ఈసారి మేం అనుకున్న విధంగా ఆడలేకపోయాం. కొన్ని బౌండరీలను కొట్టి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. మాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఒకవేళ మేం 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్‌ రేసులో ఉండేవాళ్లం. ఇదేమీ 200+ వికెట్ కాదు. ఈ సీజన్‌లో మాకు చాలా సానుకూలాంశాలను చూశాం. కుర్రాళ్లు తమ సత్తాను నిరూపించుకొనేందుకు ఉత్సాహం చూపారు. 250+ స్కోర్లను మేం మూడుసార్లు సాధించామంటే మా బ్యాటర్ల ఆటతీరు ఆ స్థాయిలో ఉంది. తీవ్ర ఒత్తిడిలోనూ పోరాటపటిమ చూపించాం. భువనేశ్వర్, నటరాజన్, జయ్‌దేవ్ వంటి బౌలర్లతో పని చేయడం బాగుంది. ఇలాంటి భారీ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతి సంవత్సరం మరింత మెరుగ్గా లీగ్‌ జరుగుతుంది’’ అని కమిన్స్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు