Chennai Vs Bengaluru: చెన్నైతో మ్యాచ్‌.. బెంగళూరువి వ్యూహాత్మక తప్పిదాలే: సునీల్ గావస్కర్

చెన్నైతో మ్యాచ్‌లో బెంగళూరు సరైన ప్రణాళికలతో ఆడలేకపోయిందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు. ఓటమికి అవే కారణమని విశ్లేషించారు.

Published : 23 Mar 2024 14:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ను బెంగళూరు ఓటమితో ప్రారంభించింది. చెన్నై చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఒక దశలో 78/5 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును దినేశ్‌ కార్తిక్, అనుజ్‌రావత్ కాపాడారు. చివరికి చెన్నై ముందు బెంగళూరు 174 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, బౌలింగ్‌లో విఫలమై ఓటమిని కొనితెచ్చుకుందని.. వ్యూహాత్మక తప్పిదాల వల్లే ఇలా జరిగినట్లు భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ విశ్లేషించాడు. 

‘‘షార్ట్ బంతులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెడదామని చూశారు. కానీ, అది వర్కౌట్ కాలేదు. అలాగే కేవలం 2 ఓవర్లు వేసి 6 పరుగులే ఇచ్చిన బౌలర్‌తో పూర్తి కోటా వేయించలేదు. మరోవైపు జోసెఫ్, సిరాజ్, గ్రీన్ భారీగా పరుగులు సమర్పించారు. వీరందరూ బౌన్సర్లు వేసి ఫలితం రాబట్టాలని చూశారు. కానీ, అవి వైడ్‌లుగా మారిపోయాయి. దీంతో అదనంగా పరుగులు ఇచ్చినట్లైంది. ఒకే కోణంలో ఇలాంటి వ్యూహంతో ఆడితే నిరుత్సాహానికి గురి కావాల్సి వస్తోంది’’ అని గావస్కర్‌ తెలిపాడు. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ తీసుకోవాల్సింది: కెవిన్ పీటర్సెన్

‘‘నేను బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ స్థానంలో ఉండుంటే.. ఛేజింగ్‌కు వెళ్లేవాడిని. చెపాక్‌ పిచ్‌ అలాంటిది. గత గణాంకాలు విభిన్నంగా ఉన్ననప్పటికీ.. వాటిని ఒక్కోసారి పట్టించుకోనక్కర్లేదు. స్పిన్నర్లకు కాస్త మాత్రమే సహకరించే పిచ్‌.. పేసర్లకు చాలా క్లిష్టమైంది. అందుకే, బెంగళూరు టాస్‌ నెగ్గి బౌలింగ్‌ తీసుకొని ఉండే బాగుండేది’’ అని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సెన్‌ పేర్కొన్నాడు. 

అక్కడ చెన్నై చాలా స్ట్రాంగ్‌: స్టీవ్‌ స్మిత్

‘‘చెపాక్‌ పిచ్‌ చెన్నై జట్టుకు కొట్టిన పిండి. అక్కడ బెంగళూరు నెగ్గడం చాలా కష్టం. ఇది ఇప్పటికే నిరూపితమైంది. మిడిల్‌ ఓవర్లలో కాస్త పట్టు సడలించినట్లు అనిపించినా.. చివరికి బెంగళూరును కట్టడి చేశారు. ముస్తాఫిజర్‌ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. బెంగళూరు నిర్దేశించిన లక్ష్య ఛేదన సులువేం కాదు. ఎందుకంటే చెన్నై జట్టులో అత్యధిక స్కోరు 37 పరుగులే. ప్రతి ఒక్కరూ కాస్త సమయం తీసుకుని ఆడారు. చెన్నైకు వారు అనుకున్న విధంగానే ఆరంభం దక్కింది’’ అని ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్ స్టీవ్‌ స్మిత్ విశ్లేషించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని