Shreyas iyer: ఐపీఎల్‌ మొత్తానికి శ్రేయస్‌ దూరం

వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకుంటాడని, ఫలితంగా ఐపీఎల్‌ మొత్తానికి దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Updated : 05 Apr 2023 07:40 IST

దిల్లీ: వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకుంటాడని, ఫలితంగా ఐపీఎల్‌ మొత్తానికి దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెనైన శ్రేయస్‌ కనీసం అయిదు నెలలు ఆటకు దూరమవుతాడని భావిస్తున్నారు. ‘‘శ్రేయస్‌కు విదేశాల్లో శస్త్రచికిత్స జరగనుంది. పూర్తిగా కోలుకోవడానికి అతడికి కనీసం అయిదు నెలలు పట్టొచ్చు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. జూన్‌ 7న ఆరంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా శ్రేయస్‌ దూరమవుతాడు. అతడు గాయం వల్ల బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ఆఖరి టెస్టులో ఆడలేకపోయాడు. ఆ తర్వాత వన్డే సిరీస్‌ నుంచి కూడా వైదొలిగాడు. శ్రేయస్‌ గైర్హాజరీలో ఐపీఎల్‌లో కోల్‌కతాకు నితీశ్‌ రాణా నాయకత్వం వహిస్తున్నాడు.
పటిదార్‌ కూడా..: బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌, విలియమ్సన్‌ల బాటలోనే మరో ఆటగాడు ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. బెంగళూరు టాప్‌ఆర్డర్‌ బ్యాటర్‌ రజత్‌ పటిదార్‌.. కాలి మడమ గాయంతో ఐపీఎల్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. గత సీజన్లో 8 మ్యాచ్‌ల్లో 50పైన సగటుతో 333 పరుగులు చేసిన రజత్‌.. క్వాలిఫయర్‌-1లో మెరుపు శతకం (112; 54 బంతుల్లో) బాదాడు. మరోవైపు గాయం నుంచి కోలుకుంటున్న ఆర్సీబీ ప్రధాన పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ ఏప్రిల్‌ చివరి వారం వరకు లీగ్‌కు అందుబాటులో ఉండనని చెప్పాడు. ఆర్సీబీకి ఇంకో షాక్‌ కూడా తగిలింది. ముంబయి ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా కింద పడి భుజం స్థానభ్రంశం కావడంతో పేసర్‌ రీస్‌ టాప్లీ కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని