Hardik Pandya: లఖ్‌నవూకు వెళ్లాలనుకున్నా.. ఆ ఫోన్‌ కాల్‌తో మనసు మారింది

కెప్టెన్‌గా సత్తా చాటుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య నిరుడు గుజరాత్‌ టైటాన్స్‌ను ఐపీఎల్‌ అరంగేట్రంలోనే విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.

Updated : 16 Apr 2023 07:51 IST

అహ్మదాబాద్‌: కెప్టెన్‌గా సత్తా చాటుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య నిరుడు గుజరాత్‌ టైటాన్స్‌ను ఐపీఎల్‌ అరంగేట్రంలోనే విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. ఈ ఆల్‌రౌండర్‌ తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. కేఎల్‌ రాహుల్‌తో సాన్నిహిత్యం వల్ల మొదట తాను లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ జట్టులో చేరాలనుకున్నానని చెప్పాడు. ‘‘లఖ్‌నవూ ఫ్రాంఛైజీ నుంచి కూడా నాకు ఫోన్‌ వచ్చింది. నాకు బాగా తెలిసిన రాహుల్‌ ఆ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నా గురించి తెలిసిన వ్యక్తితో కలిసి ఆడాలనుకున్నా. నా గురించి తెలిసిన వారికి.. నా గురించి తెలియని వ్యక్తులకు భిన్నమైన అభిప్రాయం నాపై ఉంటుంది. ఈ నేపథ్యంలో లఖ్‌నవూ నుంచి అవకాశం రావడంతో ఆ ఫ్రాంఛైజీలో చేరాలనుకున్నా’’ అని హార్దిక్‌ చెప్పాడు. అయితే ఆశిష్‌ నెహ్రా నుంచి ఫోన్‌ రావడంతో తన మనసు మారిందని అతడు వెల్లడించాడు. ‘‘కానీ అశూ పా (నెహ్రా) నాకు ఫోన్‌ చేశాడు. అప్పటికి ఆ జట్టు (గుజరాత్‌)కు ఐపీఎల్‌లో భాగం కావడానికి అనుమతి రాలేదు. స్పష్టత లేదు. ‘నేను టైటాన్స్‌ కోచ్‌ కాబోతున్నా. ఇంకా నిర్ణయం కాలేదు. కానీ నేను కోచ్‌ అవుతా’ అని చెప్పాడు. అప్పుడు నేను ‘అశూ పా మీరు లేకపోతే నేను ఆ జట్టులో చేరడానికి అంగీకరించేవాణ్ని కాదు. ఎందుకంటే బాగా అర్థం చేసుకున్న వ్యక్తి మీరు’ అని అన్నా. ఫోన్‌ పెట్టేశాక.. ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా నువ్వే ఉండాలనుకుంటున్నా అంటూ సందేశం పంపాడు. నేను ఆశ్చర్యపోయా’’ అని హార్దిక్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని