DC vs RCB: 182 లక్ష్యం.. చిన్నదైపోయింది!
పిచ్ బ్యాటింగ్ స్వర్గధామం కాదు.. అలా అని బౌలర్లకూ పూర్తి అనుకూలం కాదు.. అలాంటి పిచ్ మీద 181 పరుగులు చేసిన బెంగళూరు.. విజయంపై ధీమాగా బౌలింగ్ మొదలుపెట్టింది.
అలవోకగా కొట్టేసిన దిల్లీ
రెచ్చిపోయిన ఫిల్ సాల్ట్
పిచ్ బ్యాటింగ్ స్వర్గధామం కాదు.. అలా అని బౌలర్లకూ పూర్తి అనుకూలం కాదు.. అలాంటి పిచ్ మీద 181 పరుగులు చేసిన బెంగళూరు.. విజయంపై ధీమాగా బౌలింగ్ మొదలుపెట్టింది. కానీ ఇదొక లక్ష్యమా అన్నట్లు చెలరేగిపోయిన దిల్లీ బ్యాటర్లు.. 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి బెంగళూరుకు పరాభవం రుచి చూపారు. ఈ సీజన్లో ఆడిన ఆరో మ్యాచ్‌కు గానీ గెలుపు రుచి చూడని దిల్లీ.. చివరి అయిదు మ్యాచ్‌ల్లో నాలుగో విజయంతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.
దిల్లీ
ఐపీఎల్-16లో ఆలస్యంగా ఫామ్ అందుకున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ ఆశలను నిలుపుకొంటూ మరో విజయం సాధించింది. శనివారం సొంతగడ్డపై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట లొమ్రార్ (54; 29 బంతుల్లో 6×4, 3×6), కోహ్లి (55; 46 బంతుల్లో 5×4), డుప్లెసిస్ (45; 32 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (2/21) ఆ జట్టును దెబ్బ తీశాడు. అనంతరం ఫిల్ సాల్ట్ (87; 45 బంతుల్లో 8×4, 6×6) రెచ్చిపోవడంతో దిల్లీ 20 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పది మ్యాచ్‌ల్లో దిల్లీకిది నాలుగో విజయం కాగా.. బెంగళూరు అయిదో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
బాదుడే బాదుడు..
లక్ష్యం పెద్దది.. ఆచితూచి ఆడితే మొదటికే మోసం వస్తుందని.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడాలనే కృత నిశ్చయంతో ఛేదన మొదలు పెట్టినట్లు కనిపించింది దిల్లీ. ఆచితూచి ఆడే వార్నర్ (22; 14 బంతుల్లో 3×4, 1×6) ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించడంతోనే దిల్లీ ఉద్దేశమేంటో అర్థమైపోయింది. కెప్టెన్ వేసిన బాటలో సాల్ట్ మరింత రెచ్చిపోయాడు. తానెంత విధ్వంసక బ్యాటర్‌నో అతను ఈ మ్యాచ్‌తోనే చాటి చెప్పాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో వార్నర్ ఔటైనా.. దిల్లీ జోరు తగ్గలేదు. మిచెల్ మార్ష్ (26; 17 బంతుల్లో 3×4, 1×6) సైతం బౌలర్లపై ఎదురుదాడికే మొగ్గు చూపాడు. కొత్త బంతితో వికెట్లు తీయడం అలవాటుగా మార్చుకున్న సిరాజ్.. 2 ఓవర్లలో వికెట్ లేకుండా 28 పరుగులు సమర్పించుకుని బౌలింగ్ నుంచి తప్పుకొన్నాడు. స్పిన్నర్లు హసరంగ (4-0-32-0), కర్ణ్ శర్మ (3-0-33-1).. సాల్ట్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. మార్ష్‌ను హర్షల్ (2-0-32-1) ఔట్ చేసినా.. బెంగళూరుకు ఉపశమనం దక్కలేదు. నాలుగో స్థానంలో వచ్చిన రొసో (35 నాటౌట్; 22 బంతుల్లో 1×4, 3×6) కూడా రెచ్చిపోవడంతో 15 ఓవర్లకు 166/2తో మ్యాచ్‌ను దిల్లీ ఏకపక్షం చేసేసింది. సెంచరీ చేసేలా కనిపించిన సాల్ట్‌ను కర్ణ్ బౌల్డ్ చేసినా.. అక్షర్ పటేల్ (8 నాటౌట్)తో కలిసి రొసో లాంఛనాన్ని పూర్తి చేశాడు.
లొమ్రార్ ధనాధన్
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు దక్కిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఆ జట్టు 200 మార్కును చేరుకుంటుందనిపించింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఆ జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ వికెట్లు కాపాడుకుంటూనే ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేను ఆర్సీబీ 51/0తో ముగించింది. ఆ తర్వాత స్కోరు వేగం కొంచెం తగ్గినప్పటికీ 10 ఓవర్లకు 79/0తో ఆ జట్టు పటిష్ట స్థితిలోనే కనిపించింది. కానీ తన చివరి మ్యాచ్‌లో 4 వికెట్లతో అదరగొట్టిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. మరోసారి తన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వరుస బంతుల్లో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ (0)లను ఔట్ చేయడంతో బెంగళూరుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. దీనికి తోడు కోహ్లి కూడా వేగం తగ్గించేయడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. అయితే నాలుగో స్థానంలో వచ్చిన లొమ్రార్ బ్యాట్ ఝుళిపించడంతో ఆర్సీబీ పుంజుకుంది. స్పిన్నర్ కుల్‌దీప్‌ను లక్ష్యంగా చేసుకున్న అతను రెండు సిక్సర్లు బాదాడు. అర్ధశతకం తర్వాత 16వ ఓవర్లో కోహ్లి వెనుదిరిగినా.. లొమ్రార్ జోరుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివరి వరకు అతను ధాటిని కొనసాగించాడు. దినేశ్ కార్తీక్ (11), అనూజ్ రావత్ (8 నాటౌట్) కూడా ఒక్కో సిక్సర్ బాదడంతో స్కోరు 180 దాటింది.
బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఖలీల్ (బి) ముకేశ్ 55; డుప్లెసిస్ (సి) అక్షర్ (బి) మార్ష్ 45; మ్యాక్స్‌వెల్ (సి) సాల్ట్ (బి) మార్ష్ 0; లొమ్రార్ నాటౌట్ 54; కార్తీక్ (సి) వార్నర్ (బి) ఖలీల్ 11; అనూజ్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181; వికెట్ల పతనం: 1-82, 2-82, 3-137, 4-172
బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-45-1; అక్షర్ పటేల్ 3-0-17-0; ఇషాంత్ శర్మ 3-0-29-0; ముకేశ్ కుమార్ 3-0-30-1; మిచెల్ మార్ష్ 3-0-21-2; కుల్‌దీప్ యాదవ్ 4-0-37-0
దిల్లీ ఇన్నింగ్స్: వార్నర్ (సి) డుప్లెసిస్ (బి) హేజిల్‌వుడ్ 22; సాల్ట్ (బి) కర్ణ్‌శర్మ 87; మిచెల్ మార్ష్ (సి) లొమ్రార్ (బి) హర్షల్ 26; రొసో నాటౌట్ 35; అక్షర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 187 వికెట్ల పతనం: 1-60, 2-119, 3-171 బౌలింగ్: సిరాజ్ 2-0-28-0; మ్యాక్స్‌వెల్ 1.4-0-14-0; హేజిల్‌వుడ్ 3-0-29-1; హసరంగ 4-0-32-0; కర్ణ్‌శర్మ 3-0-33-1; లొమ్రార్ 1-0-13-0; హర్షల్ పటేల్ 2-0-32-1
1
ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్‌గా కోహ్లి (7,043) రికార్డు సృష్టించాడు. ధావన్ (6,536), వార్నర్ (6,211) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.